Home News ఢిల్లీ సుల్తాన్ ను ఎదుర్కొన్న సంత్ రవిదాస్

ఢిల్లీ సుల్తాన్ ను ఎదుర్కొన్న సంత్ రవిదాస్

0
SHARE

-కె. సహదేవ్ 

ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యక్షేత్రం వారణాసి సమీపంలో `సీర్ గోవర్ధన్పూర్’ గ్రామంలో, 15-16వ శతాబ్దoలో పవిత్ర మాఘ పౌర్ణమి రోజు, సంత్ రవిదాస్ జన్మించారు. మాతా కల్సాన్, సంతోఖ్ దాస్ లు ఆయన తల్లిదండ్రులు. ఈరోజు ఆ ప్రాంతం, `శ్రీ గురు రవిదాస్ జన్మస్థాన్’ అని పిలవబడుతోంది. ప్రసిద్ధ బ్రాహ్మణ వైష్ణవ గురువు శ్రీ రామానంద ఆయనకి గురువు, ఇది శ్రీరామానంద సాంప్రదాయం అని పిలవబడుతోంది.. ”నా గురువుని కనుగొన్నాను, నా జన్మ ధన్యమైంది; బ్రహ్మజ్ఞానం పొందాను, రామనామం అనే అమృతాన్ని చవిచూసాను, నా ఆత్మ పరిశుద్ధమైంది” – రవిదాస్ (పంచవాణి).

 మేవార్ రాజపుత్ రాజకుమారి మీరాబాయికి,  సంత్ రవిదాస్ స్వయంగా గురువు. “ఆత్మ సాక్షాత్కారం పొందిన పరమగురువు సంత్ రవిదాస్ ముందు, మీరా ప్రణమిల్లుతోంది, నా గురువు ఆశీర్వాదం పొందాను. శ్రీ కృష్ణుడి పైనే నా మనసు లగ్నమైంది, `నేను’ అంటూ ఏమీ లేదు. స్వయంగా జ్ఞాన‌ సముద్రుడైన గురు రవిదాస్, నాకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించారు”.

 సంత్ రవిదాస్ బ్రాహ్మణ వ్యతిరేకియని,  `రవిదాస్సియా’ పేరుతో కొత్త మతాన్ని స్థాపించారని, ఈనాటి కాలంలో కొందరు పనిగట్టుకుని చేస్తున్న హిందూ-వ్యతిరేక దుష్ప్రచారం పూర్తిగా అసత్యం. అప్పటి సాహిత్యంలో మనకి కనపడే విషయం, వైదిక ధర్మం, వైదిక జ్ఞానం పట్ల ఆయనకి ఉన్న ధర్మనిష్ఠ. గురు-శిష్య పరంపర ఆయన పూర్తిగా పాటించారు. ఒక బ్రాహ్మణ వైష్ణవ గురువుకి సంత్ రవిదాస్ శిష్యుడైతే, క్షత్రియ రాజకుమారి అయిన మీరాబాయికి ఆయనే గురువు. మధ్యయుగంలో వివిధ వర్ణాల మధ్య ఉన్న సామరస్య సంబంధాలకు ఇది అద్దం పడుతుంది.

 “సంత్ రవిదాస్ వేదాలు, శాస్త్రాలు చెప్పిన ధర్మమార్గాన్నే అనుసరించారు. నీరక్షీర వివేకం ఉన్న గొప్ప వ్యక్తులని, ఆధ్యాత్మికవేత్తలని ఆయన ఎంతో గౌరవించారు. ఆ పరమాత్మ దయవల్ల ఆయన ఉత్కృష్ట స్థానం పొందారు. అన్ని వర్ణాల ప్రజలు ఆయనకి ప్రణమిల్లారు”- భక్తిమల్ (సా.శ. 1600)

 `సుల్తాన్ సికందర్ లోడి’ ఉదంతం :

 `సుల్తాన్ సికందర్ లోడి’తో ఎదురైన సమస్యలో కూడా మనకి సంత్ రవిదాస్ లో అదే ధర్మనిష్ఠ కనిపిస్తుంది. 16వ శతాబ్దంలో ఆయన అనుచరులు రచించిన ‘రవిదాస్ రామాయణం’లో మనకి ఈ ఉదంతం కనిపిస్తుంది.

 సికందర్ లోడి రాజసభలో ఒకనాడు, ఒక సూఫీ పీర్ లేచి నిలబడి, వారణాసికి చెందిన `రవిదాస్’ అనే ఒక హిందువు, `వేదాలు చాలా ప్రాచీనమైనవి, ఇస్లాం కొత్త మతం’ అని ఇస్లాంని అవమానిస్తున్నాడని చెప్పాడు. లోడి ఆగ్రహంతో ఊగిపోతూ, రవిదాస్ ని,  ఢిల్లీ సభలో ప్రవేశపెట్టాలని ఆజ్ఞాపించాడు.

సభలో `సంత్ రవిదాస్’తో లోడి అన్నాడు, “రవిదాస్, వైదిక ధర్మంతో భగవంతుడిని చేరుకోలేము, దుష్టులు మాత్రమే నమ్మే పునర్జన్మని, వక్ర మార్గాన్ని వైదిక ధర్మం బోధిస్తుంది. భగవంతుడిని చేరడానికి ఎన్నో మార్గాలున్నాయని చెప్తూ, గందరగోళాన్ని కలగచేస్తుంది. వైదిక ధర్మం కాఫిర్ హిందువుల ఒక భ్రాంతి మాత్రమే, ఇది ఒక రోగం, ఇది ఒక ఉన్మాదం. ఇది మతం కాదు. అది స్వర్గానికి దారి చూపదు, ఇస్లాం మాత్రమే స్వర్గానికి మార్గం. ఇస్లాంని స్వీకరించని వారు నరకానికి వెళ్తారు. వైదిక ధర్మం వదిలేయి, ఇస్లాం స్వీకరించు, ముస్లింగా మతం మార్చుకో, ఖురాన్ పఠించు, నా రాజ్యంలో నిన్ను ముఖ్య `ఉలేమా’గా నియమిస్తాను. నీకెంతో ధనం, అధికారం సమకూరుతాయి. నీకెంతో పేరు ప్రతిష్టలు, గౌరవం లభిస్తాయి, జనం నీపట్ల భయభక్తులతో ఉంటారు”.

ఈ మాటలు విని, సంత్ రవిదాస్ ఇలా సమాధానం ఇచ్చారు, ”ఈ భూమి మీద అత్యంత ఉత్కృష్టమైన మతం వైదిక ధర్మం. ఉత్తములు దాని ముందు మోకరిల్లుతారు. వేదమంత్రాలు అమృత తుల్యాలు, వాటికి కోటి పాపాలను కడిగేసి మానవులను పరిశుద్ధులను చేసే శక్తి ఉంది. వేదములు స్వయంగా పరబ్రహ్మ తెలిపినవి. వైదిక ధర్మం పరిపూర్ణమైనది, శాశ్వతమైనది. చీకటిని పారద్రోలే సూర్యకాంతి వేదం. వైదిక ధర్మజ్క్షానం లేని వారు దురదృష్టవంతులు. పరమ దుష్టులు మాత్రమే వైదిక ధర్మాన్ని దూషిస్తారు. ఖురాన్ హింసాయుతమైన మతం, మనుషలు, ఇతర జీవులను చంపమని అదేశిస్తుంది. కాని వైదిక ధర్మం `అహింసా పరమోధర్మః’ అని బోధిస్తుంది. వైదిక ధర్మం సమస్త లోకంలో ఉత్తమం, ఉత్కృష్టం; వేదమంత్రాలు, మోక్షాన్ని ప్రసాదిస్తాయి. మీ మ‌తంలోని `స్వర్గం’ నాకు వద్దు, అక్కడ మద్యం, ఒక వేయి `హూర్లు’ తప్ప ఏమి లేదు. నేను నా ధర్మాన్ని విడనాడను. నేను నా ప్రాణం వదలగలను గాని, ధర్మం కాదు. నీవు కావాలంటే నా తల నరికేయి, కానీ నా వేదధర్మం నుంచి నన్ను వేరు చేయలేవు. నేను అజ్ఞానిని కాదు, ధర్మమనే ఒక మహాసముద్రాన్ని వదిలి, ఇస్లాం అనే ఒక `చిన్నకుండ’ను ఎందుకు పట్టుకుంటాను? పరమ ఉత్తమమైన, పరమ పవిత్రమైన వేదమంత్రాలను నేను ఎందుకు వదులుతాను? పరమ సత్యమైన ధర్మాన్ని వదిలి, నేను ఎందుకు ముస్లిం అవుతాను?”
ఈ సమాధానంతో, సుల్తాన్ సికందర్ లోడి కోపావేశంతో ఊగిపోతూ, `నీ చెత్త నోటితో ఎంత మాట్లాడుతావు? నీవు తక్కువ జాతివాడివై ఉండి, ఎందుకు పెద్ద పండితుడు, గురువు అవ్వాలనుకున్నావు? వేదమంత్రాలు ప్రాచీనమైనవని, ఖురాన్ మజీద్‌ కొత్తవని అంటున్నావు, నీకు పిచ్చా? నీకు ఇస్లాం అర్ధం కాలేదు. ఖురాన్ అన్ని దిక్కులా వెలిగిపోతోంది, నా ఆదేశాలు అన్ని వైపులా అందరూ గౌరవిస్తారు. నా కత్తికున్న శక్తి ప్రపంచానికి తెలుసు. నా కత్తి ఎత్తానంటే, ఎంతో గొప్పవారు కూడా తలవంచుతారు. ఖురాన్లో ఉన్న పదాలు ఎంతో గొప్పవి, ఇస్లాం మతం అల్లాకి దాస్యం చేస్తుంది. నీకు బ్రతకాలని ఆశఉంటే, నీ జంధ్యం, తలమీద శిఖ తీసేసి, వైదిక ధర్మాన్ని త్యాగం చేసి, ముస్లిం అయి, ఖురాన్లో అల్లా గురించి ఉన్న పదాలు చదువు”.

సంత్ రవిదాస్ ఇలా సమాధానం ఇచ్చారు- “నీ ఇస్లాం మతం, హింసకి అజ్ఞానానికి నిలయం. అన్నింటినీ ధ్వంసం చేసే నీ మతాన్ని ఎవరూ ఇష్టపడి స్వీకరించరు. దాని ద్వారా పరమాత్మ పట్ల ఎప్పటికీ నిజమైన భక్తి ఉదయించదు. నా వైదిక ధర్మం ఉన్నతమైనది, సమగ్రమైనది, వివేకవంతులకి తప్ప మూర్ఖులకి అది అర్ధం కాదు. శృతులు, స్మృతులు, వాటిపై ర‌చించిన‌ భాష్యాలతో, ఖురాన్ మజీద్‌ ఎంతమాత్రం సరితూగలేదు.  నేను నా జీవితం త్యాగం చేస్తాను, నా వైదిక ధర్మం కాదు. లెక్కలేనన్ని కత్తులు మనవైపు గురిపెట్టబడినా, ధైర్యవంతుడు ఎప్పుడూ ధర్మానికి తన వెన్ను చూపలేడు. నా మనసు ఎవరూ మార్చలేరు. వైదిక ధర్మం నా ఆత్మ, శరీరాలతో పాటు మాత్రమే నన్ను విడిపోతుంది”.

సంత్ రవిదాస్ ఈ విధంగా ఇస్లాంని తిరస్కరించడంతో, సుల్తాన్ సికందర్ లోడి, ఆ మహాగురువుని, జైల్లో నిర్బంధించి చిత్రహింసలకి గురిచేసాడు. తర్వాత ఆయన ఏమయారో, ఎవరికీ క‌చ్చితంగా తెలియదు. ఒక కథ‌నం ప్రకారం, ఆయన చాకచక్యంగా జైలునుంచి తప్పించుకుంటే, `సుఖసాగర్’వంటి పండితులు, ఆయన జైలులోనే చిత్రహింసల వల్ల మరణించారని చెపుతారు.

అనువాదం: ప్ర‌ద‌క్షిణ‌