Home News బడి గుడి గోశాల కొలువైన సరస్వతి విద్యామందిర్ హైస్కూల్

బడి గుడి గోశాల కొలువైన సరస్వతి విద్యామందిర్ హైస్కూల్

0
SHARE

సువిశాలమైన ఆ పాఠశాల ప్రాంగణంలోనికి ప్రవేశించగానే మొదటగా కనిపించేది గోశాల. కాస్త ముందుకు వెళ్ళగానే ఎల్ ఆకారంలో 22 తరగతి గదులతో రెండంతస్తుల భవనం సందర్శకులకు స్వాగతం పలుకుతుంది. ఆ భవనం వెనుక భాగాన సరస్వతి అమ్మవారి గుడి. అలాగని అదేదో అలనాటి గురుకులం అనుకుంటే పొరపాటే. కార్పొరేట్ పాఠశాలలకు ఏ మాత్రం తగ్గని రీతిలో అత్యంత అధునాతమైన సదుపాయాలతో కూడిన సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ (SVMH) అందరిని ఆకట్టుకుంటున్నది. శ్రీ సరస్వతి విద్యా పీఠం ఆధ్వర్యంలో విద్యా బోధన సాగిస్తున్న SVMH హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉంది.

కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా పిల్లల్లో హైందవ ధర్మం, సంస్కృతీ సంప్రదాయాల పట్ల అవగాహన కలిగించడానికి తోడు వారితో ఆచరించేలా చేయడంలో ఇక్కడి 29 మంది బోధన, బోధనేతర సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటారని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. కొద్ది సంవత్సరాల క్రితం చిన్నపాటి వర్షానికే పూర్తిగా జలమయమైపోయే పాఠశాలకు నేడు పటిష్టమైన భవనాన్ని కల్పించడంలో దాతల సౌజన్యం ఎంతైనా ఉందని వారు తెలిపారు.

ఈ పాఠశాల విద్యార్థులు ప్రధానంగా చుట్టుపక్కల బస్తీలు, కాలనీల్లో నివసించే పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. అయినా కానీ, అనుకూలమైన వాతావరణంలో వారికి విద్యాబోధన చేయాలనే సంకల్పంతో తరగతి గదుల్లో ఏసీలను ఏర్పాటు చేశారు.

నేడు అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అట్టడుగు వర్గాలకు చెందిన బాలబాలికలకు అందించాలనే లక్ష్యంతో గ్రంథాలయం, స్పోర్ట్స్ ల్యాబ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్‌లకు తోడుగా కంప్యూటర్ ల్యాబ్‌ను నెలకొల్పినట్టు SVMH కార్యదర్శి మహంకాళి శ్రీకాంత్ తెలిపారు. 200 మంది కూర్చునే విధంగా నిర్మించిన ఆడిటోరియం సైతం పాఠశాలలో ఉందని ఆయన చెప్పారు. పర్యావరణ హితం కోసం సౌరశక్తితో కూడిన విద్యుత్తుతో యావత్ పాఠశాల కార్యకలాపాలు సాగిస్తున్నదని తెలిపారు. ఏ పాఠశాలలోనైనా విద్యార్థులు ఎదుర్కొనే ప్రధానమైన సమస్య సరిపడినంత సంఖ్యలో మరుగుదొడ్లు లేకపోవడం అని ఆయన తెలిపారు. ఆ క్రమంలో తమ పాఠశాలలో అలాంటి సమస్య ఉత్పన్నం కానివిధంగా 300కు పైగా ఉన్న బాలబాలికలకు విడివిడిగా మొత్తం 20 మరుగుదొడ్లును ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

ఇక గోశాలకు సంబంధించి విద్యార్థులకు గోమాత విశిష్టతను ప్రత్యక్షంగా తెలియజెప్పే దిశగా గోశాలను ఏర్పాటు చేసినట్టు శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం గోశాలలో ఒక గోమాత, దూడ ఉన్నాయి.

ప్రతి సంవత్సరం వసంతపంచమి నాడు పాఠశాల ప్రాంగణంలో సరస్వతి అమ్మవారి మందిరంలో నిర్వహించే అక్షరాభ్యాసం కార్యక్రమంలో చుట్టుపక్కల కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు వారి చిన్నారులతో కలిసి వచ్చి పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. అలాగే ఫిబ్రవరి 14న పాశ్చాత్య దుష్ప్రభావానికి అద్దంపట్టే వాలెంటైన్స్ డే నీడ తమ పాఠశాల విద్యార్థులపై పడకూడదనే ఉద్దేశ్యంతో అదే రోజున బాలబాలికలతో వారి తల్లిదండ్రులకు పాదపూజ చేయిస్తున్నట్టు పాఠశాల కోఆర్డినేటర్ జగదీష్ తెలిపారు. ఆ సందర్భంగా పిల్లలు తమ పట్ల చూపిన భక్తి భావనకు చెమర్చిన కళ్ళతో ఇండ్లకు వెళ్లిన తల్లిదండ్రులు ఉన్నారని ఆయన చెప్పారు.

పాఠశాలకు గౌరవ సలహాదారుగా ఉన్న చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోని నేమి ఫౌండేషన్ పాఠశాలకు వసతి సదుపాయాలను కల్పించడంలో కీలకమైన పాత్రను పోషిస్తున్నదని పాఠశాల కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు.