వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా బారిన పడిన పేదవారి కోసం సేవా భారతి, యూత్ ఫర్ సేవా సంయుక్తంగా “వర్చుస”సేవా సంస్థ హైదరాబాద్ సహకారంతో వరంగల్ హంటర్ రోడ్ లోని శ్రీ వ్యాస ఆవాసం లో ఏర్పాటు చేసిన 30 పడకల ఉచిత ఐసోలేషన్ కేంద్రాన్ని శనివారం ఆర్.ఎస్.ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రెండు ఎకరాల ఆహ్లాదకరమైన వాతావరణంలో, 24 గంటలు పనిచేసే జనరేటర్, ఎయిర్ కూలర్లు ఐసోలేషన్ కేంద్రంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ ఉచిత వసతి, పౌష్టికాహార భోజనంతో పాటు మందులు అందజేస్తామని పేర్కొన్నారు.
ఈ కేంద్రంలో డాక్టర్ల పర్యవేక్షణ , అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో ఉంచామని చెప్పారు. కరోనా బారిన పడిన పేద కుటుంబాల వారు, ఒకటి, రెండు గదులలో అద్దెకుంటూ ఇబ్బంది పడుతున్న స్వల్ప లక్షణాలు కలిగిన 60 సంవత్సరాల లోపు కోవిడ్ పేషెంట్లు 7207416163 మొబైల్ నెంబర్ కి ఫోన్ చేసి ఈ కేంద్రంలో చేరవచ్చని తెలిపారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో సేవాభారతి ఇప్పటికే కోవిడ్ బారిన పడిన వారికి ఉచిత డాక్టర్ కన్సల్టేషన్ తో పాటు మందులు కూడా అందజేస్తున్నదని రమేష్ చెప్పారు. కోవిడ్ బారిన పడి మరణించిన పేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేస్తున్నదని వివరించారు.
31 వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు, ప్రముఖ వైద్యులు డాక్టర్ శివ సుబ్రమణ్యం, డాక్టర్ బందెల మోహన్ రావు ,యూత్ ఫర్ సేవా రీజినల్ మేనేజర్ భూక్యా నరేష్, గాయత్రి అసోసియేట్స్ అధినేత కిరణ్ రావు ,సేవాభారతి జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు హనుమారెడ్డి, డాక్టర్ వీరారెడ్డి, కేర్ ఫార్మసీ అధినేత సుధీర్ ఆర్య, ఆర్.ఎస్.ఎస్ వరంగల్ విభాగ్ ప్రచారక్ కడమంచి విగ్నేష్, ఆర్ .ఎస్. ఎస్ వరంగల్ మహానగర కార్యవాహ వెంగళ సురేందర్ తదితరులు కూడా పాల్గొన్నారు.