1992లో భాగ్యనగర్ నుండి కొంతమంది అయోధ్యకు కరసేవకు వెళ్ళివచ్చారు. రాను, పోను ఖర్చులు పోగా వారి వద్ద ఇంకా కొంత సొమ్ము మిగిలింది. ఆ కొంత ధనంతో ఏం చేయాలని వారు బాగా ఆలోచించి, తల్లిదండ్రులు లేని అనాథ బాలికల సహాయార్థం వినియోగించాలని నిర్ణయించారు. అలా ఏర్పడిందే వైదేహి ఆశ్రమం.
వైదేహి అంటే అయోనిజ అయిన సీతామాత. వైదేహి ఆశ్రమం 5 సంవత్సరముల నుండి 9 సంవత్సరముల లోపు నిరాశ్రిత బాలికలకు ఆశ్రయం కల్పిస్తున్నది.
వైదేహి ఆశ్రమం ముగ్గురు పిల్లలతో తాత్కాలిక అద్దె గృహంలో 1993లో ప్రారంభమైంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ‘వైదేహి సేవా సమితి’ అనే పేరు మీద 1997లో సేవాభారతి అనుబంధ సంస్థగా రిజిస్టర్ అయింది.
ప్రారంభంలో ఆశ్రమ శ్రేయోభిలాషులు తమ గృహంలో వంట ప్రారంభించే ముందు ఒక పిడికెడు బియ్యం ఒక గోనె సంచిలో వేసి ఉంచేవారు. వారం తరువాత ఆ బియ్యాన్ని ఆశ్రమ అవసరాలకు పంపించేవారు. అదే తరువాత అన్నపూర్ణ పథకంగా రూపుదిద్దుకొంది. క్రమంగా సందర్శకుల సంఖ్య పెరిగి శ్రేయోభిలాషులు పెరిగారు. తద్వారా రకరకాలుగా సంస్థకు సహాయం అందటం ప్రారంభమైంది. ఆశ్రమానికి మధ్య తరగతి మహిళా మణుల ప్రోత్సాహం మరువలేనిది.
నిరాశ్రిత బాలికలకు విద్యతో పాటు సంస్కారం, దేశభక్తి, క్రమశిక్షణలతో వారి జీవితాలను తీర్చిదిద్దుతున్నది వైదేహి ఆశ్రమం.
ముగ్గురు బాలికలతో కిరాయి ఆవాసంలో ప్రారంభమైన వైదేహి ఆశ్రమంలో కొంతకాలం తర్వాత ఆ బాలికల సంఖ్య 36 కి చేరింది. ఆశ్రమ ఆవాసం సరిపోని పరిస్థితి. ఆ స్థితిలో ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలైన దేశ్‌ముఖ్, విద్వాన్ రెడ్డి ప్రయత్నించి భాగ్యనగరంలోని సైదాబాద్ సరస్వతీ నగరంలో 1730 చ.మీ. స్థలాన్ని కొన్నారు. ప్రస్థుతం వైదేహి ఆశ్రమం 14,200 చదరపు అడుగుల నిర్మాణం కలిగిన మూడంతస్థుల భవనంలో తన కార్యకలాపా లను నిర్వహిస్తోంది.
గ్రంథాలయం, వంటశాల, భోజనశాల, సందర్శకుల గది వంటి సౌకర్యాలతో విశాలమైన ఆవరణంలో నడుస్తోంది వైదేహి ఆశ్రమం. బాలికలను చేర్చుకునే ముందే వారికి పూర్తి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తగినవారినే చేర్చుకొంటుంది ఆశ్రమం. ప్రస్తుతం ఆశ్రమంలో మొదటి తరగతి నుండి ఇంజనీరింగు వరకు చదువుతున్న 91 మంది బాలికలున్నారు. వైదేహి సేవా సమితి ఇప్పటి వరకు వైదేహి ఆశ్రమంలో పెరిగి పెద్దైన, విద్య పూర్తయిన 36 మంది యువతులకు వివాహం జరిపించింది.
ఆర్.ఎస్.ఎస్. సర్ సంచాలక్ డా||మోహన్ భాగవత్ ఆశ్రమాన్ని సందర్శించి బాలికలను ఆశీర్వదించారు.
ఆశ్రమాన్ని సందర్శించిన ప్రముఖులలో శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు, శ్రీ చిన్నజీయర్ స్వామి వారు, మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు, బ్రహ్మశ్రీ సామవేదం శణ్ముఖ శర్మ, శ్రీమతి సోమరాజు సుశీల, శ్రీమతి పూనం మాల కొండయ్య, మాతా నిర్మలానంద భారతి, సిబిఐ పూర్వ జె.డి.లక్ష్మినారాయణ, జస్టిస్ నూతి రామోహన్ రావు, జస్టిస్ సి.వి.యన్ శాస్త్రి మరెంతో మంది ఉన్నారు.
వైదేహి సేవాసమితి విడివిడిగా ప్రత్యేక నిర్వాహణ కమిటీలను ఏర్పాటు చేసి ఈ క్రింది సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
- వైదేహి ఆశ్రమం (నిరాశ్రిత బాలికల వసతి గహం)
- వైదేహి కిశోరీ వికాస్ యోజన (ఆర్ధికంగా వెనుకబడిన బస్తీ బాలికల వికాసం కోసం)
- వైదేహి మహిళా వికాస్ సమితి (నిరాశ్రిత లేక ఆదరణ కోల్పోయిన మహిళల అభివద్ధి కోసం)
- వైదేహి సంచార వైద్యశాల (బస్తీలలో పేదవారికి వైద్య సహాయం కోసం)
సమాజ సహాయ సహకారాలతో నిరాటంకంగా రజతోత్సవ ఉత్సవాలను జరుపుకోబోతున్నది వైదేహి సేవా సమితి. ప్రస్తుతం వైదేహి సేవాసమితి అధ్యక్షులుగా సుందర్ రెడ్డి, కార్యదర్శిగా కొండూరు బాలక్రిష్ణయ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వైదేహి సేవ సమితి వివరాలకు ఈ క్రింది వెబ్ సైట్ ను సంప్రదించగలరు
Vaidehi Seva Samithi
ఆఫీస్ నం: +91 – 9032152105