- ఫౌండేషన్‌తో సేవాకార్యక్రమాలు
- పేదపిల్లలకు అండదండలు
- విద్యాబోధన, స్కాలర్‌షిప్‌లు అందజేత
- తోడుగా నిలిచిన కుటుంబ సభ్యులు
ప్రముఖ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఇంట్లోకి అడుగుపెడితే ఎన్నో ట్రోఫీలు ఆనందంగా ఆహ్వానం పలుకుతాయి. తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న వివిఎస్ లక్ష్మణ్, ఆయన భార్య శైలజ కూడా ఒకేమాట, బాటగా నిలిచిన జంట. సమాజం ఎంతో ఇచ్చింది, అలాంటి సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలని ఆకాంక్షించే ధోరణివారిది. వివిఎస్ ఫౌండేషన్ ద్వారా వారు చేపడుతున్న ఎన్నో సేవాకార్యక్రమాలే అందుకు ఉదాహరణ. గడచిన రెండేళ్లలో వారు చేపట్టిన కార్యక్రమాలు పేద కుటుంబాలకు ఎంతో ప్రయోజనం కలిగిస్తున్నాయి.
90 మందికి విద్యావసతి
ఈ ఫౌండేషన్ ద్వారా నలుగురు ఐఐటి విద్యార్థులను కలుపుకుని దాదాపు 90 మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. మరింత మందికి విద్యను అందించే ప్రయత్నంలో వీరున్నారు. హైదరాబాద్‌లో మూడు, బెంగళూరులో ఒక పాఠశాల నిర్వహణకు సహాయం అందిస్తున్నారు. వీరు సహాయం చేసే పిల్లల ఎంపిక పారదర్శకంగా ఉంటుంది. పేద పిల్లలకు మాత్రమే సాయం అందుతుంది. లక్ష్మణ్ భార్య శైలజలో తాత్విక ధోరణి కనబడుతుంది. నిజమైన పేద పిల్లలను ఎంపికచేసే విధానం ఆమె నిబద్ధతకు నిదర్శనమంటారు లక్ష్మణ్. ఈ ఫౌండేషన్ నిర్మాణాత్మకంగా, క్రమశిక్షణతో తన విధులను చిత్తశుద్ధితో నిర్వహించటానికి ఈ జంట ఎంతో శ్రమిస్తారు.
సమాజసేవే లక్ష్యం..
పదిమందికి సాయపడాలనే భావన లక్ష్మణ్, శైలజలకే పరిమితం కాదు. వారి కుటుంబ సభ్యులందరిలోనూ అదే ధోరణి. నిజానికి వారి పెద్దల మార్గదర్శకత్వంలో వీరు ఈ మార్గంలోకి వచ్చారు. తాము ఎదుగుతున్నకొద్దీ మరికొందరికి మంచిమార్గం చూపాలన్నది వారు లక్ష్యం. హైదరాబాద్‌లోని ఈ మాజీ క్రికెటర్ ఇంట్లోకి అడుగుపెడితే ఎన్నో ట్రోఫీలు ఆయన క్రికెట్ సత్తాను చాటిచెబుతూ కనిపిస్తాయి. మరికొన్ని వారి సేవాభావనకు అద్దంపడుతూంటాయి. వివిఎస్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో కుటుంబం అంతా భాగస్వాములవుతారు.
అవి చూశాకే ఫౌండేషన్ ఆలోచన
క్రికెట్ నుంచి విరమించుకున్న తరువాత లక్ష్మణ్ రెండు ఎన్జీఓ సంస్థలకు అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఇందులో భాగంగా ఆయన చారిటీ స్కూళ్లను సందర్శించారు. అక్కడ పేద పిల్లలను చూసిన తరువాత వారి కోసం తనవంతుగా ఏదైనా చేయాలని భావించి ఈ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు.
ఆర్థికంగా చేయూత
విద్య, క్రీడారంగాలలో భావిభారత పౌరులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు స్కాలర్‌షిప్పులను ఇస్తుంటారు. లక్ష్మణ్ తన తల్లిదండ్రులు సత్యభామ, శాంతారామ్ పేరు మీద ‘సత్యారామ్’అనే స్కాలర్‌షిప్పును ఏర్పాటుచేసి విద్యార్థులకు ఇస్తున్నారు. అలాగే స్పోర్ట్స్‌లో పిల్లలకు ఇచ్చే స్కాలర్‌షిప్పును ‘బాబా కృష్ణమోహన్’ స్కాలర్‌షిప్పుగా పిలుస్తారు. త్వరలో ఓ స్పోర్ట్స్ స్కూలును ఏర్పాటుచేసి పేద పిల్లలను విద్య, క్రీడలలో ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఉన్నామని లక్ష్మణ్ భార్య శైలజ చెబుతున్నారు. ప్రతి మూడు నెలలకు ఫౌండేషన్ చేస్తున్న సేవాకార్యక్రమాలను సమీక్షించుకుని ముందుకు వెళుతుంటారు. అలాగే తమ ఫౌండేషన్ ఆధ్వ్యంలో చదువుకునే పిల్లల తల్లిదండ్రులతో కూడా కలిసి మాట్లాడుతుంటామని శైలజ తెలియజేస్తున్నారు. అలాగే పిల్లలకు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులను కూడా మార్పు తీసుకువచ్చేందుకు రోల్ మోడల్స్‌తో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అంతేకాదు పిల్లల పర్సనాల్టీ డెవలప్‌మెంట్ కోసం నిరంతరం ఈ ఫౌండేషన్ కృషి చేస్తుంది. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సాయంతో పిల్లలను వివిధ ప్రాంతాలకు తీసుకువెళుతుంటారు.
సొంత పిల్లలతో సమానంగా..
తమ ఫౌండేషన్ ద్వారా సాయం పొందుతున్న పిల్లలు తమ సొంత బిడ్డలతో సమానంగా చూసుకుంటామని శైలజ చెబుతున్నారు. సత్య సాయిబాబ ఆశీస్సులు తమ పిల్లలకు దక్కాయని, సర్వజిత్, అచింత్య అనే పేర్లు భగవాన్ సత్యసాయి బాబా నామకరణం చేశారని శైలజ ఎంతో ఉద్వేగంతో చెబుతుంది. ఆయన ఆశీస్సులు ఉండటం వల్లనే తమ ఇద్దరు పిల్లలు తోటి పిల్లలను సమానంగా చూస్తున్నారని ఆమె నమ్మకం.
ఇప్పటికీ బిజీబిజీ
క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ వివిఎస్ లక్ష్మణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన ఐపిఎల్ టీమ్ సన్‌రైజర్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. లక్ష్మణ్ శిక్షణలో స్పిన్నర్ రషీద్, మహ్మద్ నబి, ఫాస్ట్ బౌలర్ జోర్దాన్, మురళీధరన్ తమ సత్తా చాటుతున్నా రు. బిసిసిఐ అడ్వయిజరీ కమిటీలో ఉన్నా రు. క్రికెట్ అకాడమీ, స్కూల్‌ను భార్య సహకారంతో నిర్వహిస్తున్నారు. క్రికెట్‌లో రాణిస్తున్న సమయంలోనే లక్ష్మణ్ మదిలో ఈ సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ఉండేవారు. ఆ ఆశయమే ఆయనను విభిన్న కార్యక్రమాల్లో మమేకమ య్యేలా చేసింది. సౌరవ్‌గంగూలీ మాటల్లో చెప్పాలంటే.. లక్ష్మణ్ క్రికెట్‌నుంచి తప్పుకున్నా బిజీగానే ఉంటారు.
కుటుంబానికి సమయం
లక్ష్మణ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయించటం మొదటి నుంచి అలవాటుగా చేసుకున్నారు. రాత్రి వేళ వచ్చినా తెల్లవారుజామున లేచి పిల్లలతో ఆడుకోవటం అలవాటుగా చేసుకున్నారు. కుటుంబ సహకారంతో మరిన్ని సేవాకార్యక్రమాలను నిర్వహించాలని ఆశిద్దాం.
(ఆంధ్రభూమి సౌజన్యం తో)