భారత ఆణిముత్యం, అరుదైన మణి, విశిష్ట సంస్కృతీ పూజారి, కళాతపస్వి పద్మశ్రీ కె. విశ్వనాథ్ గారి హటాన్మరణం సినీరంగానికే కాక తెలుగు ప్రాంతాలకు, ప్రజలకు తీరని లోటు మిగిల్చింది. తెలుగు సినిమాకు విలువలు జోడించి, భారతీయ సంప్రదాయానికి, పరంపరకు, శాశ్వత సత్యానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రపంచస్థాయికి చేర్చడానికి కృషిచేసిన సఫల సాధకుడాయన. అనేక కళాకారులను వెలికితీసి, తెరపైన, తెర వెనుక ప్రోత్సహించి, వారి నైపుణ్యాలకు అత్యద్భుతమైన పదునుపెట్టి, సినిమారంగానికి అరుదైన సేవలను అందించిన మహానుభావులు కాశీనాధుని విశ్వనాథ్ గారు. సినిమారంగం వెర్రితలలువేస్తూ, తప్పటడుగులు వేస్తున్న వేళ అనూహ్య మలుపు తిప్పి, దాని గౌరవ గరిమ పెంచిన దిశా నిర్దేశకులు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత విశ్వనాథులు. వెండితెరపై నూతనశకాన్ని ఆవిష్కరించి, దాన్ని నిరంతరంగా పరిష్కరిస్తూ సమాజాన్ని సరైన దిశలో అడుగులు వేయించి, సమాజ జాగరణకు, ప్రబోధనకు, సంస్కారానికి పూనుకున్న ఋషితుల్యులు, కర్మయోగి విశ్వనాథులు. ఇక వారిని స్మరించుకుంటూ, వారి అడుగుజాడల్లో కొద్దిమందైనా సినీరంగ ప్రముఖులు నడవాలని అభిలషిస్తూ, వినమ్ర భక్తిపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వవలసిందిగా ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాను.
– దూసి రామకృష్ణ, సహ క్షేత్ర సంఘచాలక్, దక్షిణ మధ్య క్షేత్ర, ఆర్.ఎస్.ఎస్