Home News ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా వ‌న‌వాసి మహిళ ద్రౌప‌ది ముర్ము

ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా వ‌న‌వాసి మహిళ ద్రౌప‌ది ముర్ము

0
SHARE

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా వ‌న‌వాసీ మహిళ ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేశారు. మంగ‌ళ‌వారం న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. “20 మంది పేర్లపై విస్తృత చర్చ జరిగింది. కానీ రాష్ట్రపతి అభ్యర్థి కోసం తూర్పు ప్రాంతం వారిని ఎంపిక చేయాలనీ, వీలైతే మహిళకు, ఇప్పటివరకూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీలకు అవకాశం దక్కనందున ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. ఆ కోణంలో ద్రౌపదీ ముర్మూ పేరును ఖరారు చేశాం. ఉపాద్యాయురాలిగా జీవితం ప్రారంభించి కౌన్సిలర్, వైస్ చైర్పర్సన్, ఎమ్మెల్యే, మంత్రి, గవర్నర్ గా ఆమె సేవ‌లందించారు. 2007లో ఉత్తమ ఎమ్మెల్యేగా నీల్కర్ అవార్డు అందుకున్నారు. విద్యను నమ్ముకొని జీవితంలో పైకెదిగారు. అప్పగించిన. బాధ్యతలన్నింటినీ ఉత్తమంగా నిర్వర్తించారు. అందుకే ఎన్డీయే భాగ‌స్వామ్య‌ ప‌క్షాల‌తో సంప్ర‌దించిన త‌ర్వాత‌ ఆమె పేరును ప్రకటిస్తున్నాం” అని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ఒడిషాకు చెందిన ముర్మూ బాల్యం నుంచి సంఘ్ ప‌రివార్‌ తో సన్నిహితంగా ఉన్నారు. విద్యాభ్యాసం తర్వాత సేవారంగంలో ప్రవేశించి, మయూర్ భంజ్ జిల్లాలో వ‌న‌వాసీల హితం కోసం కృషి చేశారు. 2021 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

అత్యంత మారుమూల, అభివృద్ధి చెందని మయూర్ భంజ్ జిల్లాలోని ఒక పేద వ‌న‌వాసి కుటుంబంలో జ‌న్మించిన ద్రౌప‌ది ముర్ము జీవితంలో ఎన్నో పోరాటాల‌ను, స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నారు.  ఉపాధ్యాయురాలిగా వృత్తి జీవితం ప్రారంభించిన ద్రౌప‌ది ముర్ము 1997లో బీజేపీలో చేరారు. రాయ్‌రంగ్‌పూర్ కౌన్సిల‌ర్‌గా, వైస్ చైర్మ‌న్‌గా ఎన్నిక‌య్యారు. 2000లో రాయ్‌రంగ్‌పూర్ ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. 2000-2002 మ‌ధ్య‌కాలంలో ఒడిశా రవాణా, వాణిజ్య శాఖ మంత్రిగా, 2002-2004 మ‌ధ్య‌కాలంలో ఒడిశా పశు సంవర్ధక శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 2004లో రాయ్ రంగపూర్‌ ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికయ్యారు. 2002-2009 స‌మ‌యంలో మయూర్ భంజ్ జిల్లా భాజపా అధ్యక్షురాలిగా పార్టీ బ‌లోపేతానికి కృషి చేశారు. 2008-2009 మ‌ధ్య‌కాలంలో ఒడిశా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షురాలిగా సేవ‌లందించారు. 2010, 2013-2015 లో మయూర్ భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 2015-2021 వ‌ర‌కు ఝార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు.

భారతదేశ చరిత్రలో మొదటి వ‌న‌వాసి మహిళా రాష్ట్రపతి అభ్యర్థి అయిన ద్రౌప‌ది ముర్ము, రాష్ట్రప‌తిగా ఎన్నికైతే భారతదేశపు మొదటి వ‌న‌వాసి రాష్ట్రపతిగా, అలాగే రెండవ మహిళ రాష్ట్రప‌తిగా చరిత్ర సృష్టిస్తారు.