రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ బుధవారం, తన జన్మదిన సందర్భంగా రాజస్థాన్ లోని అల్వర్ జిల్లా గహన్ కార్ గ్రామంలో 123 సంవత్సరాల వృద్ధులైన బాబా కమలనాథ్ మహారాజ్ దర్శనం చేసుకుని, వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఉదయం సంత్ ఆశ్రమానికి చేరుకున్న ఆయనకు గ్రామ వికాస సమితి సభ్యులు ఘన స్వాగతం పలికారు. నేరుగా సంత్ కమలనాథ్ మహారాజ్ వద్దకు వెళ్ళిన డా. మోహన్ భాగవత్ ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకున్నారు. సంత్ మహరాజ్ కు శాలువా, కొబ్బరికాయ సమర్పించారు.
ఆ తరువాత ఆశ్రమానికి వచ్చినవారిని ఉద్దేశించి చేసిన సంక్షిప్త ఉపన్యాసంలో డా. భాగవత్ సమాజంలో సంత్ కమలనాథ్ మహారాజ్ వంటి మహాపురుషులు ఉన్నారని, వీరి త్యాగం, తపస్సు మూలంగా సమాజంలో అనేక సత్పరిణామాలు, మార్పులు వచ్చాయని అన్నారు. ఇలాంటి మహాపురుషుల అనుభవసారాన్ని గ్రహించి సమాజం సంఘటితంగా ముందుకు సాగాలని అన్నారు. తరువాత బాబా కమలనాథ్ మహారాజ్ తో అరగంటపాటు వివిధ ధార్మిక, సామాజిక అంశాలపై చర్చించారు.
సంఘ స్వయంసేవకులు అనేక సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం తనకు తెలుసని, సమాజానికి ఎంతో మేలు చేస్తున్న ఈ కార్యక్రమాలు అందరికీ ప్రేరణగా, ఆదర్శంగా నిలుస్తున్నాయని బాబా కమలనాథ్ మహారాజ్ తమ ఉపన్యాసంలో తెలియజేశారు. ఎప్పుడైతే హిందువులు మేల్కొని, సంఘటితమవుతారో అప్పుడు మన దేశం స్వర్గతుల్యమవుతుందని మహరాజ్ అన్నారు. దేశంలో గోవధ నిషేధం, మద్య నిషేధం అమలు చేయాలని అన్నారు.
బీహార్ లోని గోవిందపూర్ లో 1886లో జన్మించిన బాబా కమలనాథ్ మహారాజ్ దాదాపు 80ఏళ్ల పూర్వం తిజారా అడవుల్లోకీ వచ్చి నివసించారు. 1965లో ఆయన గహన్ కర్ గ్రామానికి వచ్చారు. 80వ దశకంలో ఇక్కడ ఆయన ఆశ్రమం స్థాపించారు. గత 30 ఏళ్లుగా మొండి జబ్బులకు మూలిక వైద్యం చేస్తున్నారు. మాదక ద్రవ్యాలను తీవ్రంగా వ్యతిరేకించే బాబా కమలనాథ్ కాన్సర్ కు మందు ఇస్తారు. దీనితోపాటు గుండెపోటు, రక్తపోటు, క్షయ మొదలైన రోగాలకు కూడా ఉచితంగా మూలికా వైద్యం చేస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా రోగులు ఇక్కడకు వచ్చి మందు తీసుకుంటారు. కేన్సర్ రోగులకు ఉచితంగా వైద్యం లభిస్తుంది. ఈ కేన్సర్ వైద్యం మూలంగా బాబా కమలనాథ్ మహారాజ్ పేరుప్రఖ్యాతులు దేశవిదేశాల్లో వ్యాపించాయి.