Home News సునీల్ కుమార్ ‘అంబేద్కర్స్ ఇండియా మిషన్’ వివాదంపై ప్ర‌త్యేక క‌థ‌నం

సునీల్ కుమార్ ‘అంబేద్కర్స్ ఇండియా మిషన్’ వివాదంపై ప్ర‌త్యేక క‌థ‌నం

0
SHARE

వివాదాస్పద ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కార్యకలాపాలపై దాఖలైన ఫిర్యాదుకు కేంద్ర హోంశాఖ స్పందించింది. ఈ అంశంలో తగిన చర్యలు తీసుకుని వాటి వివరాలు వీలైనంత త్వరగా తమకు పంపాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కోరింది.

1993 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ సివిల్ సర్వీస్  అధికారి అయిన సునీల్ కుమార్ ఎస్సీ కోటాలో ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యారు. వివిధ హోదాల్లో పనిచేసి ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంకులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత ఇన్వెస్టిగేషన్ విభాగమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటుకు అధినేతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ”అంబెడ్కర్స్ ఇండియా మిషన్’ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసి నిమ్నవర్గాల ప్రజల అభ్యున్నతికి కృషిచేస్తున్నారంటూ ప్రశంసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే పీవీ సునీల్ కుమార్ తీరుతెన్నులు, అతని కార్యకలాపాలు, ప్రసంగాలపై గత కొంతకాలంగా అత్యంత తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంబేద్కర్స్’ఇండియా మిషన్ పేరిట సభలు ఏర్పాటు చేసి హిందూ మతం పట్ల వ్యతిరేక భావనలు నూరిపోస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల విజయనగరం జిల్లా  రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడికి అప్పగించాలని నిర్ణయించుకుంది. అయితే సిఐడి విభాగానికి అధిపతిగా ఉన్న పీవీ సునీల్ కుమార్, గతంలో ఒక సభలో క్రైస్తవమతాన్ని, బ్రిటిష్ పరిపాలనను కొనియాడేవిధంగా చేసిన ప్రసంగం  తాలూకు వీడియో బయటకు రావడంతో తీవ్ర దుమారం రేగింది. ఒక క్రైస్తవ పక్షపాతి ఇటువంటి కేసు అప్పగిస్తే నిష్పాక్షిక విచారణ ఎలా జరుగుతుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆ కేసును మరో విభాగానికి అప్పగించారు.

వివాదం అంతటితో సద్దుమణగలేదు. పీవీ సునీల్ కుమార్ క్రైస్తవుడు అంటూ మరో వాదన ఊపందుకుంది. సునీల్ కుమార్ క్రైస్తవుడు అయివుండి షెడ్యూల్డ్ కులాల కోటాలో సివిల్స్ ఎలా సాధించారని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల  పీవీ సునీల్ కుమార్ మీద కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు అందింది. అతను నిర్వహిస్తున్న ‘అంబేద్కర్స్ ఇండియా మిషన్’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభల్లో హిందూ మతం, ధర్మశాస్త్రాలు, పురాణాలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్టు మహారాష్ట్రకు చెందిన లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ అనే సంస్థతో పాటు నరసాపురం లోక్ సభ ఎంపీ రఘురామకృష్ణ రాజు  ఇటీవల కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది.

ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిగా ఉంటూ ఒక సంస్థను ఏర్పాటు చేయడం, ఏదైనా సంస్థలకు ప్రాతినిధ్యం వహించడం వంటివి చేయరాదని 1966 నాటి ‘పోలీస్ బలగాలు – హక్కుల నియంత్రణ’ చట్టంలోని సెక్షన్ 3 కింద చెబుతోంది. అంతేకాకుండా సంస్థ ఏర్పాటు చేసిన సభావేదికలపై నుండి మతాలపై విమర్శలు చేయడం, దూషించడం వంటివి కూడా పీవీ సునీల్ కుమార్ చేస్తున్నారని లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ తమ ఫిర్యాదులో పేర్కొంది. అందుకు సాక్ష్యంగా పీవీ సునీల్ కుమార్ కు చెందిన ‘అంబేద్కర్స్ ఇండియా మిషన్’ ఫెస్బుక్ పేజీ నుండి సేకరించిన వీడియో లింకులు కూడా జతచేసింది. వీటి ఆధారంగా పీవీ సునీల్ కుమార్ మీద ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153ఏ, 295ఏతో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కిందా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కిందా కఠిన చర్యలు తీసుకునేవిధంగా ఏపీ పోలీస్ శాఖను ఆదేశించాల్సిందిగా కోరింది.

లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ చేసిన ఫిర్యాదు తాలూకు కాపీలు సోషల్ మీడియా గ్రూపుల్లో సర్క్యూలేట్ కావడం మొదలైన కాసేపటికే అందులో పేర్కొన్న వీడియో లింకులు ‘అంబెడ్కర్స్ ఇండియా మిషన్’ ఫేస్బుక్ పేజీ నుండి డిలేట్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది

Source : https://twitter.com/LegalLro/status/1402915308864557067

ఆ వీడియోలలో ఏముంది?

పీవీ సునీల్ కుమార్ మీద ఫిర్యాదు నమోదైన వెంటనే సంబంధిత వీడియో లింకులు ‘అంబెడ్కర్స్ ఇండియా మిషన్’ ఫేస్బుక్ పేజీ నుండి డిలీట్ అయ్యాయని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటన చేసింది. దీంతో అసలు ఆ వీడియోలో ఏముంది? నిజంగా పీవీ సునీల్ కుమార్ ఎలాంటి తప్పు చేయకపోతే ఆ వీడియోలు ఎందుకు డిలీట్ అవుతాయి? వీడియోలు డిలీట్ చేసుకోవాల్సినంతగా పీవీ సునీల్ కుమార్ చేసిన ఆ వ్యాఖ్యలు ఏమిటి? అన్న ప్రశ్నలు అందరిలో మొదలయ్యాయి. ఈ క్రమంలో అంబేద్కర్స్ ఇండియా మిషన్ పేజీ నుండి డిలేట్ అయిన వీడియోలను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

పీవీ సునీల్ కుమార్ క్రైస్తవ్యం వ్యవహారం!
పీవీ సునీల్ కుమార్ గతంలో ‘గ్రీన్ వ్యాలీ’ అనే ఒక క్రైస్తవ మ్యాగజైన్ కు వ్యాసాలు రాసేవారని, వ్యాసాల ద్వారా క్రైస్తవ మతంలోని విలువలు అందరికీ అర్ధమయ్యే రీతిలో వివరించేవారని, క్రైస్తవ భావాలను ప్రమోట్ చేస్తున్న పీవీ సునీల్ కుమార్  అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో అంబెడ్కర్ వాదం పేరిట ఎస్సీలను హిందువులపైకి రెచ్చగొట్టడం తగదంటూ పీవీ సునీల్ కుమార్ తీరును ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఖండించింది.

హిందూ మతాన్ని, ధార్మిక గ్రంథాలను విమర్శించే క్రమంలో పీవీ సునీల్ కుమార్ స్వాతంత్ర్య సమరయోధుడు, మహాత్మా గాంధీని కూడా టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడం చుస్తే అతని హిందూ వ్యతిరేకత ఏపాటిదో అర్ధమవుతుంది. 2020 నవంబర్ 16న భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ‘అంబెడ్కర్స్ ఇండియా మిషన్’ ఫేస్బుక్ పేజీ ద్వారా లైవ్లోకి వచ్చిన పీవీ సునీల్ కుమార్, దాదాపు 40 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇందులో రాజ్యాంగం, రాజ్యాంగ విలువల, చరిత్ర గురించి చెబుతూనే మరోవైపు హిందూ ధర్మం మీదా, గ్రంధాల మీదా దుమ్మెత్తిపోశారు. అదే సమయంలో మహాత్మా గాంధీని అగ్రకులవాదిగా పేర్కొంటూ.. ‘అగ్రవర్ణాలకు సేవ చేయడమే శూద్రుల కర్తవ్యమ్’ అని చెప్పారని తెలిపారు. అంతేకాకుండా బహుశా నిత్యం భగవద్గీత చదివే అలవాటు ఉన్నందునే మహాత్మా గాంధీ అటువంటి భావజాలం కలిగివుండవచ్చనేమో అంటూ పీవీ సునీల్ కుమార్ చేసిన విమర్శలు వివాదాస్పదంగా మారాయి.

తాజాగా పీవీ సునీల్ కుమార్ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిని కోరడంతో ఈ అంశంలో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Source : NIJAM TODAY