పూరి జగన్నాథ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్ ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుండి లక్షలాది సంఖ్యలో మంది భక్తులు విచ్చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీమహాశిష్ణువు ఇంద్రద్యుమ్న మహారాజుకు కలలో కనిపించి పూరీ ఆలయాన్ని నిర్మించమని చెప్పారట. అలా నిర్మించిన ఆలయంలో ఇప్పటికీ సైన్స్ కు కూడా అంతుచిక్కని రహస్యాలెన్నో ఉన్నాయి.
ఎత్తైన పిరమిడ్
గణగణ మోగే గంటలు, బ్రహ్మాండమైన 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం, అద్భుతంగా చెక్కిన ఆలయంలోని చిత్రకళలు పూరీ జగన్నాథ్ ఆలయ ప్రత్యేకతలు. కృష్ణుడి జీవితాన్ని వివరంగా.. కళ్లకు కట్టినట్టు చూపించే స్తంభాలు, గోడలు.. ఆలయానికి మరింత శోభ తీసుకొస్తాయి. ఈ ఆలయాన్ని 1078లో పూరీలో నిర్మించారు. అయితే ఈ ఆలయం కూడా అన్ని ఆలయాల మాదిరిగానే.. గోపురం, దేవుడు, గంటలు, ప్రసాదం అన్నీ ఉన్నప్పటికీ.. అన్నింటికంటే చాలా ప్రత్యేకమైనది, విభిన్నమైనది.
గోపురంపై సుదర్శన చక్రం
ఈ ఆలయ గోపురానికి పైన కట్టిన పతాకం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. సాధారణంగా ఏ గుడికి కట్టిన జెండాలైనా.. గాలి ఎటువైపు ఉంటే.. అటువైపు వీస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం గాలిదిశకు వ్యతిరేకంగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. అలాగే 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు ఉండే సుదర్శన చక్రాన్ని కూడా ఈ ఆలయం పైభాగంలో ఏర్పాటు చేశారు. పూరీ పట్టణంలోని ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం దర్శనమిస్తుంది. మరో విశేషమేమిటంటే.. మీరు ఏ వైపు నుంచి చూసినా అది మీకు అభిముఖంగానే కనిపిస్తుంది.
సాగర కెరటాలు
సాధారణంగా సాగర తీర ప్రాంతాల్లో పగటిపూట గాలి సముద్రం వైపు నుంచి భూమివైపునకు ఉంటుంది. సాయంత్రం పూట గాలి నేలవైపు నుంచి సముద్రం వైపునకు వీస్తుంది. కానీ పూరీలో అంతా విభిన్నం. దీనికి వ్యతిరేకంగా గాలి వీస్తుండటం ఇక్కడి ప్రత్యేకత.
పక్షులు, విమానాలు ఎగరలేవు
జగన్నాథ ఆలయ పరిసర ప్రాంతాల్లో పక్షులు అస్సలు ఎగరవు. అది ఎందుకు అనేది ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కడం లేదు. విమానాలు కూడా ఇక్కడ ఎగరవు. ఇక్కడ ఏదో తెలియని అతీత శక్తి ఉందని.. అందుకే దీన్ని నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణించినట్లు పెద్దలు చెబుతారు. దీనికి కూడా ఎలాంటి సైంటిఫిక్ రీజన్ ఇప్పటికీ తెలియదు.
గోపురం నీడ
పూరీ జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం గోపురం నీడ ఏ మాత్రం కనిపించదు. అది పగలైనా, సాయంత్రమైనా.. రోజులో ఏ సమయంలోనూ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఇది దేవుడి కోరికనో లేదా నిర్మాణంలోని గొప్పదమో మరి.
అలల శబ్ధం
సింహ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశిస్తూ.. ఒక్క అడుగు గుడిలోపలికి పెట్టగానే.. సముద్రం నుంచి వచ్చే శబ్ధం ఏమాత్రం వినిపించదు. కానీ ఎప్పుడైతే బయటకు అడుగుపెడతారో వెంటనే చాలా క్లియర్ గా వినపడుతుంది. అయితే సాయంత్రంపూట ఈ రహస్యాన్ని అంత శ్రద్ధగా గమనించలేరు.
గొప్ప ఆలయనిర్మాణం
ఇద్దరు దేవుళ్ల సోదరి సుభద్రాదేవి ఆలయం లోపల ప్రశాంతత కావాలని కోరడం వల్ల ఇలా జరుగుతుందని ఆలయ పూజారులు చెబుతారు. అంతేకానీ దీనివెనక ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేవని వివరిస్తారు. జగన్నాథ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి. వీటిలో సింఘ ద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన ద్వారం. ఈ ద్వారం నుండి లోపలికి వెళ్లినప్పుడు మీరు శబ్ద తరంగాలను స్పష్టంగా వినొచ్చు. ద్వారం నుండి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్దం మీకు వినిపించదు. ఇదంతా భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది.
This article was first published in 2021