Home News ఆధ్యాత్మిక విప్లవ సారథి శ్రీరామానుజులు

ఆధ్యాత్మిక విప్లవ సారథి శ్రీరామానుజులు

0
SHARE

ఏప్రిల్ 26, వైశాఖ శుక్ల షష్ఠి – శ్రీరామానుజాచార్య జయంతి 

మనం ఇప్పుడు చెబుతున్న సామాజిక సమరసతకు ఆనాడే బాటలు పరచిన గొప్ప సమరసతా వారధి శ్రీ రామానుజులు. విశిష్టాద్వైతం బోధించి భక్తి ఉద్యమాన్ని రగుల్కొల్పిన గొప్ప ఆధ్యాత్మిక విప్లవ సారథి శ్రీరామానుజులు.

శ్రీ రామానుజులు పింగళనామ (కలియుగం శాలివాహనశకం 4118, క్రీ.శ.1017) సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష పంచమి రోజున కాంతిమతి కేశవాచార్యు లకు, భూతపురి నేటి శ్రీపెరంబుదూరులో (ఇది చెన్నైకి 25కిమీ దూరం) జన్మించారు. వీరిని ఆదిశేష అవతారం గా భావిస్తారు.

ఆధ్యాత్మిక విప్లవం :

బాల్యమునుండే మెండైన ఆధ్యాత్మిక విప్లవ భావాలు వీరి సొంతం. గురువైన యాదవ ప్రకాశకులతో విభేదించి తన విశిష్టాద్వైతమును నెగ్గించుకున్న ప్రతిభాశాలి రామానుజులు. విశిష్టాద్వైతం ప్రకారం కుల భేదం లేకుండా ఎవరైనా శ్రీమన్నారాయణుని పూజించుటకు అర్హులే. కుల భేదాలు, పట్టింపులు అధికంగా ఉన్న ఆకాలంలోనే గురువుతో విభేదించి గురుకులంలో ఇలాంటి సిద్ధాంతాన్ని ప్రకటించారంటేనే రామానుజుల విప్లవ భావజాలమును మనం గమనించవచ్చు.

అందరికీ మోక్షం లభించెటట్లైతే నేను నరకానికి వెళ్లడానికి సిద్దం

యుక్తవయసులొ యామునాచార్యుల వద్ద విద్యను అభ్యసించిన అనంతరం మంత్రోపదేశం కోసం శ్రీరంగం లోని గోష్టీపూర్ణులు అనే గురువును ఆశ్రయిస్తారు. వీరు శ్రీపెరంబుదూరు నుండి మేల్కోటే వరకు కాలినడకన రామానుజులవారిని 18సార్లు తన వద్దకు తిప్పుకుని, పరీక్షించి చివరకు ఓం నమోనారాయణాయ అనే అష్టాక్ష‌రీ మంత్రోపదేశం చేస్తారు. ఈ మంత్రం మోక్షప్రదాయిని కనుక రహస్యంగా ఉంచాలని గొష్టీపూర్ణులు ఆదేశిస్తారు. కానీ దాన్ని గురువు నుండి విన్న వెంటనే బయటికి వచ్చి మేల్కోటే గుడి గోపురం పైకి ఎక్కి అందరికీ వినబడేట్లు, అందరూ ఉచ్చరించేట్లు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఉచ్చరిస్తారు. వెంటనే పరుగున వచ్చిన గురువు నీవు నరకానికి పోతావేమో అంటే అందరికీ మోక్షం లభిస్తూంటే నేను ఒకడిని నరకానికి వెళ్లడానికైనా సిద్దం అంటారు. ఇంతకన్నా ఆధ్యాత్మిక విప్లవ భావాలకు నిదర్శనం ఇంకేమి కావాలి.

కులం కన్నా గుణం ముఖ్యం

ఈ విషయం భగవద్రామానుజులు తన జీవితంలో అడుగడునా నిరూపించారు. రామానుజుల బాల్యంలో కంచీపూర్ణుడు అనే భక్తుడు రోజూ కాలినడకన కాంచీపురం నుండి శ్రీపెరంబుదూరు మీదుగా ఎక్కడో దూరాన ఉన్న దేవాలయానికీ వెళ్ళి పూజలు చేసి వస్తుండేవారు. ఇది ప్రతిరోజూ గమనించిన రామానుజులు ఒకరోజు కంచీపూర్ణులను ఇంటికి పిలిచి భోజనం పెట్టి కాళ్లు నొక్కడానికి సిద్ధపడతారు. అంతలో కంచీపూర్ణుడు నేను నిమ్న కులస్థుడిని బ్రాహ్మణులైన మీరు నాకాళ్ళు పట్టడం తగదు అంటాడు. అంతలో రామానుజులు భగవంతుని భక్తి శ్రద్ధలతో సెవించేవారు. అందరూ తనకు గురు సమానులే అంటూ కంచీపూర్ణుల కాళ్లు పడతారు.

మరో సందర్భం లో… మల్లుడు అనే శిష్యుని తత్వఙ్ఞానిగా చేయడం, తాను ప్రతిరోజూ స్నానం చేసి మెట్లు ఎక్కేటపుడు శిశ్యులంతా చూస్తుండగా మూలధనుర్ధరుని భుజం ఆసరాగా చేసుకుని మెట్లు ఎక్కడం, స్వామికి ధరింపజేసే ధోవతిని చక్కగా ఉతికి తెచ్చే చాకలిని శ్రీరంగంలోని గర్భగుడిలోకి తీసుకెళ్ళి రంగనాథుని దర్శనం చేయించడం… ఇలా ఒకటేమిటి.. వారి జీవితంలో అడుగడుగునా సామాజిక సమరసత దర్శనం ఇస్తుంది.

తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు ఇవి :-

ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో , మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రథ‌మ కర్తవ్యం.

దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం , మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.

మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది ఒప్పో , తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యపడవలసిన పనిలేదు.

ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు , తమకు కీడు జరిగినా , పదిమందికి జరిగే మేలుకై , తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు.

ఆలయ వ్యవస్థల సశక్తీకరణ

వీరు దేశంలోని శ్రీరంగం, తిరుమల సహా అనేక చోట్ల దేవాలయాలలోని పూజా విధానాలను ఆలయ వ్యవస్థలను సశక్తీకరణ గావించారు. తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా ఏకాంగి వ్యవస్థను ఏర్పరచారు. తర్వాతి కాలంలో ఇదే జియ్యర్ల వ్యవస్థగా మారింది. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని భగవద్రామానుజులే నిర్మించారని ప్రతీతి. నాటి యాదవరాజు అక్కడి ఆలయపూజారులకు అగ్రహారమిచ్చి దానికి రామానుజపురం అని నామకరణం చేశారు. అదే నేటి తిరుపతిగా మారింది.

శ్రీరంగంలో తన జీవితకాలంలో ఎక్కువభాగం గడిపిన భగవద్రామానుజులు శ్రీరంగనాథుని చేరి తనను రప్పించుకొమని ప్రార్థించి 1137వ సంవత్సరం(ఇది కూడా పింగళ నామ సంవత్సరమే) మాఘశుధ్ధ దశమినాడు పరమపదం చేరారు.

రామానుజుని సమతా మూర్తి (statue of equality)

రామానుజుల స్పూర్తి అందించడానికి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి వారి దివ్య సాకేతం శంషాబాద్ ఆశ్రమంలో 108అడుగుల భవ్య రామానుజుల సమతా మూర్తి నిర్మాణం జరుగుచున్నది. అదేవిధంగా శ్రీరంగం ఆలయాన్ని సందర్శించినపుడు కూడా మనం రామానుజుల విశేషాలు తెలుసుకోవచ్చు.
భగవద్రామానుజులు ఆచరించి చూపిన సామాజిక సమరసతను అందరమూ పాటిద్దాం.

This article was first published in 2020