నవయుగ భారతి ప్రచురించిన “స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య” గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్ స్కూల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు , ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత కార్యకారిణి సభ్యులు శ్రీ వి. భాగయ్య, హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, ఆర్.ఎస్.ఎస్ తెలంగాణ ప్రాంత సంఘ చాలక్ శ్రీ దక్షిణా మూర్తి, నవయుగ భారతి అధ్యక్షులు బాలేంద్ర గారు, పుస్తక రచయిత శ్రీ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాగయ్య గారు మాట్లాడుతూ సోమయ్య గారిలో ఉన్న ఆదర్శవంతమైన వ్యక్తిత్వం, సామాజిక సృహా, నిరాడంబరత విశిష్టమైనవి అని అన్నారు. వారి మాటల్లో స్పష్టత, విషయం పట్ల లోతైన అవగాహనతో మాట్లాడేవారని తెలిపారు.
అనంతరం శ్రీ వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ.. శ్రీ సోమయ్య గారు సంఘ విస్తరణతో పాటు వ్యక్తిగతంగా కూడా తన ఎదుగుదలకు సహకరించారని తెలిపారు. ఆయన జీవితాన్ని పుస్తక రూపంలో తీసుకురావడం, ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత సోమపల్లి సోమయ్య గారు, దుర్గప్రసాద్ గారు తన జీవితంలో రుణపడాల్సిన వ్యక్తులని అన్నారు. ఒక వ్యక్తిగా సంస్కారాన్ని, క్రమశిక్షణను, జాతీయభావాన్ని అలవర్చుకోవడానికి ఆర్.ఎస్.ఎస్ సాహిత్యం, సంపర్కమే దోహదపడిందని ఆయన అన్నారు. దుర్గప్రసాద్, సోమయ్య గార్ల సన్నిహిత్యం వల్ల ప్రేరణ, స్ఫూర్తి, మార్గదర్శనం లభించిందని తెలిపారు. శ్రీ సోమయ్య గారి కార్యదక్షత, , అంకిత భావం, జాతీయభావం, క్రమశిక్షణ ఆదర్శవంతం అని అన్నారు. సమాజానికి, నేటి తరానికి ఉపయోగపడే ఒక మంచి వ్యక్తి జీవిత చరిత్రను, ఆయన ఆలోచలను పుస్తక రూపంలో తీసుకువచ్చిన నవయుగ భారతికి ఈ సందర్భంగా ఆయన కృతజ్క్షతలు తెలిపారు.
దేశ చరిత్రను, సంసృతిని కాపాడడం, అన్ని వర్గాల ప్రజల బాగోగులు చూడడం దేశ రక్షణే అవుతుందని, ఆ పనే సర్వశ్రేష్టమన్నారు. మాతృభాష పట్ల వారి మమకారాన్ని మరోసారి స్పష్టం చేస్తూ, ప్రజా వ్యవహరాల్లో, పాలనా పరమైన విధానాల్లో మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నూతన జాతీయ విద్యా విధాన ప్రాముఖ్యతను ఆయన సంక్షిప్తంగా వివరించారు.