Home News దేశం గర్వించదగిన మేధావి శ్రీనివాస రామానుజన్

దేశం గర్వించదగిన మేధావి శ్రీనివాస రామానుజన్

0
SHARE

మనదేశంలో గణితశాస్త్ర చరిత్ర వేదకాలం నుంచే ప్రారంభమైంది. ప్రాచీన భారతీయులు గణితానికి సంబంధించిన సంఖ్యలను, దశాంశపద్థతి లాంటి ఎన్నో విషయాలను కనుక్కున్నారు. భారతీయ గణిత చరిత్ర ఆర్యభట్ట కాలం నుంచి భాస్కరాచార్యుని కాలం వరకు అప్రతిహతంగా సాగింది. ఆ తర్వాత విదేవీ దండయాత్రల వల్ల కాస్త గణితానికి సంబంధించిన నూతన ఆవిష్కరణలు మరుగునపడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ దేశంలో గణిత చరిత్రకు వన్నెలద్దినవాడు శ్రీనివాస రామానుజన్.

ఇతడు 1887 డిశంబరు 22న శ్రీనివాస అయ్యంగార్‌, కోయల అయ్యంగార్‌ దంపతులకు తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడు గ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు.. చిన్ననాటి నుండి రామానుజన్‌ అసాధారణ తెలివితేటలు చూపేవాడు. శ్రీనివాస రామానుజన్‌ బాల్యం నుంచి గణితం అంటే అభిరుచి కనబరుస్తూ తన ప్రతిభతో ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచేవాడు.
10వ తరగతి చదివే రోజులలో అతడు బీజగణితము, త్రికోణమితి, కలన గణితము, వైశ్లేషిక రేఖాగణితము మొదలగు వానిని అధ్యయనం చేశాడు. త్రికోణమితిని తన 12 సంవత్సరాల వయసులోనే పూర్తి చేశాడు.
శ్రీనివాస రామానుజన్‌ను ఎక్కువగా ప్రభావితం చేసినది కార్‌ వ్రాసిన ‘సినాప్సిస్‌’. దానిలో 6 వేలకు పైగా నిరూపణలు చేసిన సిద్ధాంతాలున్నాయి. అనేక సిద్ధాంతాలను తనకు తానుగా నిరూపించి తన ప్రతిభను ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేశాడు.
మొదటిసారిగా 1913 జనవరి 16 మకర సంక్రాంతి నాడు ప్రొఫెసర్‌. హార్ది కి రామానుజన్‌ స్వయంగా, తన అర్హతలు, గణితంలో గల ప్రావీణ్యత, సామర్థ్యాలను గురించి ఉత్తరం వ్రాశాడు. అది చూసి ప్రొఫెసర్‌ హార్డి రామానుజన్‌ను కేంబ్రిడ్డికి ఆహ్వానించారు.
లండన్‌లో కేంబ్రిడ్జిలో గల ట్రినిటి కాలేజిలో ప్రవేశించి, 1917 వరకు గణిత పరిశోధనలు చేశాడు. వీటి గురించి ప్రపంచ పత్రికల్లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. శుద్ధ గణిత శాస్త్రజ్ఞుల్లో శ్రీనివాస రామానుజన్‌ ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. ఈయన గణిత పరిశోధనలు ముఖ్యంగా సంఖ్యావాదానికి చెందినవి. 1918లో రాయల్‌ సోసైటీ ఆఫ్‌ ఇంగ్లాండు శ్రీనివాస రామానుజన్‌కు అత్యంత ప్రతిష్టాకరమైన ”ఫెలో ఆఫ్‌ రాయల్‌ సోసైటి” బిరుదునిచ్చి గౌరవించింది.
శ్రీనివాస రామానుజన్‌ సంఖ్య 1729 అని అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే దానిని రెండు ఘనాల మొత్తమని చెప్పారు. దానిని రెండు రకాలుగా రాయగల మిక్కిలి చిన్న సంఖ్య అది, రామానుజన్‌ π విలువను 3.141 చెప్పాడు. ప్రధాన సంఖ్యలపై రామానుజన్‌ యిచ్చిన వివరాలు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. రామానుజన్‌ ”సమున్నత సంయుక్త సంఖ్య” అనే భావనను ప్రవేశపెట్టారు. సంఖ్యల సర్వ సమానత్వాలు, సౌష్టవాలు, వాటి మధ్య సంబంధాలు అనే వాటిపై ఆయనకు గల జ్ఞానం మరో శాస్త్రవేత్తకు లేదని చెప్పవచ్చు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన చివరి రోజులలో రామానుజన్‌ మాక్‌-తీటా ఫంక్షన్ల్‌పై చేసిన పరిశోధనలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. 1916లో రామానుజన్‌ ప్రతిపాదించిన గణిత సూత్రాలు 1974లో డెల్జిన్‌ అనే ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త నిరూపించాడు. ఇది రామానుజన్‌ ఉహాశక్తికి ఒక ఉదాహరణ మాత్రమే. గణిత సూత్రాలు, గణిత ప్రవచనాలు, సిద్ధాంతాలు, నంబర్‌ థీరమ్స్‌ మొదలైన గణిత సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం శ్రీనివాస రామానుజన్‌ పేర తపాల బిళ్లను విడుదల చేసింది. ఆయన జన్మించిన డిశంబర్‌ 22 వ తేదీని జాతీయ గణిత దినోత్సవముగా నిర్ణయించింది.

ఈ విధంగా గణిత శాస్త్రానికి సేవ చేసినందుకు, అభివృద్ధి చేసినందుకు ”ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటి” బిరుదు రామానుజన్‌ను వరించింది. గణిత పరిశోధనలపై అవిశ్రాంతంగా పనిచేయడంతో శ్రీనివాస రామానుజన్‌ 32 సంవత్సరాల అతి చిన్న వయసులోనే 26 ఏప్రిల్‌ 1920న స్వర్గస్తులయ్యారు.