Home News కేంద్ర బడ్జెట్ పై స్వదేశీ జాగరణ్ మంచ్ హర్షం

కేంద్ర బడ్జెట్ పై స్వదేశీ జాగరణ్ మంచ్ హర్షం

0
SHARE

-డా. అశ్విని మహాజన్,

ఈ శతాబ్దపు అత్యంత దారుణమైన మహమ్మారి వల్ల ఎంతో బలహీనపడిన ఆర్ధిక వ్యవస్థ తిరిగి పుంజుకునేందుకు ఉపయోగపడే బడ్జెట్ ను రూపొందించినందుకు స్వదేశీ జాగరణ్ మంచ్ కేంద్ర ఆర్ధిక మంత్రిని అభినందిస్తున్నది. వచ్చే ఏడాదికి 6.8 శాతం ద్రవ్య లోటు ఏర్పడే అవకాశం ఉన్నా స్థూల జాతీయోత్పత్తి బాగా పెరుగుతుంది. అలాగే కోవిడ్ మహమ్మారి మూలంగా, గత రెండు దశాబ్దాలుగా చైనా వస్తువుల దిగుమతుల మూలంగా దెబ్బతిన్న ఉపాధి రంగం కూడా చక్కబడుతుంది.

కోవిడ్ కాలంలో ఉపాధి కోల్పోయినవారికి చేయూత నిచ్చేందుకు ప్రభుత్వం ఉచ్చితంగా ఆహారం, ఇతర నిత్యవసర వస్తువులు సరఫరా చేసేందుకు తీసుకున్న చొరవను స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రశంసిస్తోంది.

మౌలిక సదుపాయాల రంగానికి మరిన్ని నిధులు కేటాయించడం, కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ ల అమలు, చైనా దిగుమతుల మూలంగా మూతపడిన పరిశ్రమలను పునరుద్ధరించడానికి ప్రయత్నం, ఆరోగ్య రంగానికి ఎన్నడూ లేనంతగా 137శాతం నిధులు కేటాయించడం, పరిశోధన, అభివృద్ధి రంగానికి అదనపు ఆర్ధిక వనరులు అందించడం వంటివి ప్రస్తుత బడ్జెట్ లో ఎన్నదగిన కొన్ని అంశాలు.

అభివృద్ధి చెందుతున్న దేశమైనప్పటికీ కోవిడ్ మహమ్మారిని భారత్ ఎదుర్కొన్న తీరు అద్భుతం. ఇదేమాదిరిగా ఆర్ధిక వ్యవస్థను తిరిగి అభివృద్ధి మార్గం పట్టించడంలో మనం విజయం సాధిస్తామని జాగరణ్ మంచ్ భావిస్తోంది.

ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహకాలు (production Linked incentive)ల రూపంలో 1.97 లక్షల రూపాయలను ప్రకటించడం దేశంలో ఉత్పత్తి రంగపు పునరుజ్జీవానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే అభివృద్ధి సంస్థ (Development financial institution)ను స్థాపించడానికి 20వేల కోట్ల రూపాయలు కేటాయించడం కూడా ప్రశంసనీయమైన నిర్ణయం.

2020-21 బడ్జెట్ లో కేటాయించిన 4.12లక్షల కోట్ల రూపాయల మూలధన వ్యయాన్ని ఏకంగా 5.54 లక్షల కోట్ల రూపాయలకు పెంచడం ఆహ్వానించదగిన విషయం. రోడ్ల నిమానానికి 1.08 లక్షల కోట్లు, రైల్వేలకు 1.07 లక్షల కోట్లు, అలాగే మెట్రో, నౌకాశ్రయాలు, పెట్రోలియం, సహజవాయువు వంటి రంగాలకు మూలధన వ్యయాన్ని పెంచడం కూడా మంచి నిర్ణయం.

అయితే ప్రభుత్వరంగ సంస్థలు బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, పవన్ హాన్స్, భారత్ యర్త్ మూవర్శ్ మొదలైన వాటి నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించాలని నిర్ణయించడం మాత్రం ఆందోళన కలిగించే విషయం. ప్రభుత్వం ఈ విషయంలో మరోసారి పునరాలోచించుకోవాలి. అలాగే ప్రభుత్వ బ్యాంకులు, బీమా కంపెనీలను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం కూడా మంచిది కాదు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కంటే ఈ సంస్థల పనితీరును మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ప్రజల పన్నులతో ఏర్పాటుచేసిన ఈ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ సరికాదు. ప్రజా పెట్టుబడులను (ఈక్విటీ అమ్మకాలు) ఆహ్వానించడం ద్వారా వీటిని బలోపేతం చేయడం మంచి మార్గం అవుతుంది.

బీమా రంగంలో ఇప్పుడున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) 49శాతం నుంచి 74శాతానికి పెంచడం కూడా ఆందోళన కలిగించే విషయం. ఆర్ధిక రంగంలో విదేశీ కంపెనీలకు స్థానం కల్పించడం అంతా వివేకవంతమైన పని కాదు. దీనివల్ల దేశ ఆర్ధిక వ్యవస్థపై విదేశీ సంస్థల ప్రభావం, పట్టు పెరిగి దేశాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

-జాతీయ కన్వీనర్, స్వదేశీ జాగరణ్ మంచ్