Home Telugu స్వదేశీ జాగరణ్ మంచ్ : తీర్మానం – 2 , చైనా ప్రభావం నుంచి భారత్...

స్వదేశీ జాగరణ్ మంచ్ : తీర్మానం – 2 , చైనా ప్రభావం నుంచి భారత్ ను విముక్తం చేయాలి

0
SHARE

మే 20,21 లలో స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు గౌహతి లో జరిగాయి. వాటిలో ఆమోదించిన 2వ తీర్మానం

చైనా ప్రభావం నుంచి భారత్ ను విముక్తం చేయాలి

చైనా వల్ల మన ఆర్థిక వ్యవస్థకు, మన యువత ఉపాధి అవకాశాలకు, జాతీయ సమైక్యత , భద్రతలకు పెద్ద ముప్పు అని స్వదేశీ జాగరణ్ మంచ్ పదే పదే చెపుతూనే ఉంది. 1996-97 తరువాత 19 ఏళ్లలో చైనా నుంచి దిగుమతులు 78 రెట్లు పెరిగాయి. అవి మన దేశీయ ఉత్పత్తులలో 22 శాతం ఆక్రమించాయి. నేడు మనం చైనా నుండి పెద్ద ఎత్తున యంత్ర సామగ్రి , ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్  వస్తువులు, వినియోగవాద వస్తువులు, టైర్లు మొదలైనవన్నీ దిగుమతి చేసుకుంటున్నాము. ఈ భారీ దిగుమతులవల్ల మన దేశంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. దీనివల్ల యువత ఎక్కువగా ఉన్న మన దేశం జనాభా పరమైన లాభాన్ని పొందలేకపోతోంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని స్వదేశీ జాగరణ్ మంచ్ 2017 ను `చైనా ఉత్పత్తుల, పెట్టుబడుల, కంపెనీల వ్యతిరేక సంవత్సరం’ గా పాటించాలని, అలా చైనా దురాక్రమణను ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా సాగుతున్న స్వదేశీ జాగరన్ మంచ్ కార్యకలాపాలవల్ల  చైనా ఉత్పత్తులను బహిష్కరించి , స్వదేశీ వస్తువులను కొనుగోలుచేయవలసిన ఆవశ్యకతను ప్రజలకు తెలుస్తోంది. స్వదేశీ వస్తువులను కొనడం వల్ల దేశంలో ఉపాధి అవకాశాలు పరిరక్షింపబడతాయని మంచ్ తెలియజేస్తోంది. ఇప్పటి వరకు కోటి మంది భారతీయులు చైనా, ఇతర విదేశీ వస్తువులను బహిష్కరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

దేశంలో తయారయ్యే వస్తువులనే కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం కూడా నిర్ణయించడాన్ని స్వదేశ్ జాగరణ్ మంచ్ జాతీయ కౌన్సిల్ స్వాగతిస్తోంది. సాధారణ ఆర్థిక నిబంధనలు 2017 లోని 153వ అధికరణం ప్రకారం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చైనా తో పాటు ఇతర విదేశీ వస్తువుల కొనుగోలు తప్పకుండా తగ్గుతుంది . ఇదే విధానాన్ని దేశీయ ఉత్పత్తులకు కూడా వర్తింపచేయాలని స్వదేశ్ జాగరణ్ మంచ్ కోరుతోంది. అంటే ప్రభుత్వ విభాగాలు ఏవి విదేశీ సలహాదారులను నియమించుకోకూడదు. అలాగే విదేశీ సేవలను పొందకూడదు. దీనివల్ల విలువైన విదేశీమారక ద్రవ్యం ఆదా అవడమే కాక మన విధానాలపై విదేశీ ప్రభావం కూడా తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్నే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరించి అలాంటి నిబంధనలనే చేసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను ప్రోత్సహించవచ్చును.

ఈ సందర్భంగానే కేంద్ర ప్రభుత్వం `అమెరికా వస్తువుల కొనుగోలు చట్టం, 1933’ మాదిరిగానే `భారతీయ వస్తువుల కొనుగోలు చట్టం’ చేయాలని స్వదేశ్ జాగరణ్ మంచ్ జాతీయ కౌన్సిల్ కోరుతోంది. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నీ భారతీయ ఉత్పత్తులు, సేవలనే తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సివస్తుంది.

ప్రపంచ మార్కెట్ లను , ఆర్థిక వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకునే ఉద్దేశ్యంతో చైనా ప్రారంభించిన `వన్ బెల్ట్ , వన్ రోడ్’ విధానం పై భారత ప్రభుత్వం అనుసరించిన వైఖరిని స్వదేశీ జాగరణ్ మంచ్ అభినందిస్తోంది. ఆర్థిక పరంగా ప్రపంచం మొత్తాన్ని తన చేతిలోకి తీసుకోవాలన్న చైనా ప్రయత్నాలకు ప్రతిగా భారత ప్రభుత్వం కూడా తీవ్రమైన చైనా వ్యతిరేక విధానాన్ని అవలంబించాలి. కింది అంశాలపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలని జాతీయ కౌన్సిల్ కోరుతోంది –

  1. చైనా , ఇతర దేశాల నుండి దిగుమతులకు కొన్ని నియమాలను విధించాలి. నాసిరకమైన, నియమాలకు తగినవిధంగా లేని వస్తువులను నిషేధించాలి. ఇలాంటి విధానాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ సమర్ధిస్తోంది. అనేక దేశాలు ఇప్పటికే దీనిని ఉపయోగించుకుంటున్నాయి.
  2. `ప్రాంతీయ సమీకృత ఆర్థిక భాగస్వామ్యం’ (RCEP) తో సహా చైనాతో ఏ కొత్త వాణిజ్య ఒప్పందం చేసుకోరాదు.
  3. చైనా నిరంతరం రాజకీయ దాడులకు పాల్పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చైనా కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటూనే ఉన్నాయి. అవి తమకు చైనా ఉత్పత్తులు అవసరం లేదని ప్రకటించకపోగా చైనా పెట్టుబడికోసం అర్రులు చాస్తున్నాయి. చైనా పెట్టుబడులను ఆకర్షించడం కోసం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా ఆర్థిక సమావేశాలనే ఏర్పాటుచేస్తున్నాయి. ఈ ధోరణికి స్వస్తి చెప్పి చైనా కంపెనీలతో ఒప్పందాలను తక్షణం రద్దు చేసుకోవాలి.
  4. మన కంపెనీలను చైనా కంపెనీలు చేజిక్కించుకుంటున్నాయి. అలాగే చైనా కంపెనీలతో మన కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. దీనివల్ల మన కంపెనీలపై చైనా కంపెనీల ప్రభావం పెరిగిపోయింది. మన `స్టార్ట్ అప్’ కంపెనీలకు పెట్టుబడి కూడా చైనా నుండి రావడంతో అవి వారి చేతికే వెళిపోతున్నాయి. చాలా చైనా కంపెనీలు అక్కడి ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉంటాయన్న విషయాన్ని కూడా మనం మరచిపోకూడదు. చైనా కంపెనీల ప్రభావం పెరిగితే మన దేశపు సమైక్యత, వాణిజ్యం, పరిశ్రమలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందువల్ల భారతీయ కంపెనీలలో చైనా కంపెనీల పెట్టుబడులను పూర్తిగా నిషేధించాలి.
  5. ఈశాన్య రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాలలో నిర్మాణ రంగ కాంట్రాక్ట్ లను చైనా కంపెనీలు సొంతం చేసుకుంటున్నాయి. దీనివల్ల మన దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కనుక నిర్మాణ రంగ టెండర్లు చైనా కంపెనీలు వేయకుండా నిషేధించాలి.