Home News వికసిత భారత్ కోసం స్వదేశీ పరిజ్ఞానం

వికసిత భారత్ కోసం స్వదేశీ పరిజ్ఞానం

0
SHARE

(ఫిబ్రవరి 28- జాతీయ సైన్స్ దినోత్సవం )

భారతీయ శాస్త్రవేత్త సర్ సి.వి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు

1928 ఫిబ్రవరి 28వ తేదీ భారతదేశం గర్వించదగ్గ రోజు. ప్రపంచ విజ్ఞాన శాస్త్ర యవనికపై భారతదేశ కీర్తి పతాకం ఎగరవేయబడిన రోజు. ఆచార్య చంద్రశేఖర వెంకట రామన్ అద్భుత ఆవిష్కరణ చేసిన రోజు. విదేశీ పరిపాలనలో మగ్గుతున్న ఆ సమయంలో భారత దేశము నుంచి అటువంటి అద్భుతం ఆవిష్కరించబడడం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. ఆ ఆవిష్కరణ శ్వేత జాతీయతరుడైన వ్యక్తి సైన్స్ లో మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతిని అందుకొనేలా చేసింది. అది సైన్స్ లో ఆసియాలోనే మొట్టమొదటి నోబెల్ బహుమతి అవుతుంది కూడా ఎవరూ ఊహించి ఉండరు. 1930లో రామన్ ఎఫెక్ట్ గా పిలవబడిన ఆ ఆవిష్కరణకు నోబెల్ బహుమతి ప్రకటించగానే యావత్ భారతం పులికించిపోయింది.

ఆ విధమైన అధ్భుత ఆవిష్కరణకు కారణభూతమైన నేపధ్యాన్ని ఈ జాతి స్మరించుకోవలసిన అవసరం ఉంది. మన భారత ప్రభుత్వం రామన్ ఎఫెక్ట్ కనుగొనబడిన ఆరోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా 1986 లో ప్రకటించడం 1987 నుండి జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం వికసిత భారత్ కోసం స్వదేశీ పరిజ్ఞానం అనే థీమ్ తో జాతీయ సైన్స్ దినోత్సవము నిర్వహించుకోబడుతోంది.

స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల పూర్తి అయినా స్వతంత్ర భారతంలో సైన్స్ లో నోబెల్ బహుమతిని సాధించలేకపోవడం ఒక రకంగా లోటే. అయితే విదేశాలలో స్థిరపడిన భారతీయులు ఆ ఘనత సాధించడం ఒక విధంగా ఊరటనిచ్చే అంశం. 1928 ఫిబ్రవరి 28న జరిగిన అద్భుత ఆవిష్కరణకు నేపథ్యాన్ని ఒకసారి స్మరించుకోవలసిన అవసరం ఉంది.మన దేశం ఎంతో ప్రాచీనమైన దేశం. చక్కటి నాగరికత వెల్లివిరిసిన దేశం. బంగారు పక్షిగా పిలవబడిన దేశం జ్ఞాన భూమిగా కొలవబడిన దేశం. ప్రపంచంలో లోని అనేక జాతుల వారు భారతదేశానికి జ్ఞాన సమపార్జన కోసం విచ్చేశారు.మానవ సమగ్ర వికాసానికి కావలసిన జ్ఞానాన్ని – విజ్ఞానాన్ని ఈ దేశము ఆవిష్కరించుకుంది. కేవలం మానవ సమగ్ర వికాసమే కాకుండా ప్రకృతి తో మమేకమవుతూ ప్రకృతి మనుగడకు, వికాసానికి విఘాతం కలుగని విజ్ఞానాన్ని ఆవిష్కరించుకున్న దేశం మనది. అయితే వరుస విదేశీ దురాక్రమణల కారణంగా భారతదేశము బానిసత్వాన్ని చూసింది. ఆధునిక విజ్ఞాన జైత్రయాత్ర మొదలయ్యాక భారతదేశంలో ఉండే విజ్ఞానాన్ని చిన్నచూపు చూడడం మొదలైంది. భారతీయులను చిన్నచూపు చూడడం మొదలైంది. ఆధునిక విజ్ఞానం లో నిష్ణాతులైనప్పటికీ భారతీయులను కేవలము జాతి కారణంగా వివక్షకు గురి చేశారు. భారతీయులకు విజ్ఞాన శాస్త్రములో నడకే రాదు పరుగు ఎలా సాధించగలరు అని అవహేళనకు గురి చేశారు. భారతీయులకు విజ్ఞాన శాస్త్ర దృక్పథమే లేదు అటువంటివారికి విజ్ఞాన శాస్త్ర బోధనలో ఉద్యోగాలు ఇవ్వడం కలలో కూడా ఊహించలేము అని వివక్షకు గురి చేశారు.

డాక్టర్ మహేంద్ర లాల్ సర్కార్ గొప్ప అల్లోపతి వైద్యుడు, విద్యాధికుడు. బ్రిటిష్ ఆలోచనలకు అనుగుణంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి. ఆయన అల్లోపతి వైద్యంలో ఎంతో నిష్ణాతుడు ఎన్నో చక్కటి పరిశోధనలు గావించేవాడు కాబట్టి తమలాగా ఆలోచిస్తూ తమ విజ్ఞానాన్ని మాత్రమే అధ్యయనం చేస్తు, దానిని ప్రశంసించే మహేంద్ర లాల్ సర్కార్ ను బ్రిటిష్ ప్రభుత్వము కలకత్తా బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శిగా కూడా నియమించుకుంది. ఆయన ఆంగ్ల విద్యాధికుడు కావడంతో ఇతర సంప్రదాయ వైద్య పధ్ధతులను విజ్ఞానంగా భావించేవాడు కాదు తూలనాడేవాడు. ఆ సమయంలో చలామణిలో ఉన్న హోమియోపతి వైద్యం పట్ల చాలా చులకన భావన కలిగి ఉండేవారు. అయితే ఒక సందర్భంలో ఆయన ఒక రోగికి వైద్యం చేస్తే ఫలించలేదు. అదే సమయంలో తన మిత్రుడు ఇచ్చిన హోమియోపతి మందు ఫలించడం ఆయన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన ఆ హోమియోపతి మందు పైన హోమియోపతి వైద్యంపైన పరిశోధనగావించి దానిలో కూడా కొంత విజ్ఞానం దాగి ఉంది అని ఒక ప్రకటన చేశాడు. ఈ ప్రకటన బ్రిటిష్ వారికి కంటగింపుగా మారింది. బ్రిటన్ కు జర్మనీకు జాతి వైరం నడుస్తున్న సమయం అది. జర్మనీలో ఉద్భవించిన హోమియోపతి వైద్యాన్ని ఇంగ్లీషు వైద్యము నేర్చుకున్న మహేంద్ర లాల్ సర్కార్ ప్రశంసించడాన్ని సహించలేకపోయారు ఆయనని బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ నుంచి తొలగించారు. అంతేకాకుండా ఆయన ఎటువంటి పరిశోధనలు చేయకుండా నిరోధించారు. అటువంటి వివక్ష పూరిత సమయంలో మహేంద్ర లాల్ సర్కార్ భారతీయులలో విజ్ఞాన శాస్త్ర తృష్ణను పెంచడం తద్వారా భారతదేశ సమగ్ర వికాసంకోసం ఒక సంస్థ ను నెలకొల్పారు. భారతీయుల చేత భారతీయుల కోసమే నడుపబడే ఆ విజ్ఞాన శాస్త్ర సంస్థే మన దేశానికి విజ్ఞాన శాస్త్ర రంగంలో నోబెల్ బహుమతిని సాధించి పెట్టింది. 1876లో సంపూర్ణ స్వదేశీ మరియు విశుద్ధ జాతీయ భావాలు అనే ఆశయంతో ప్రారంభించబడిన Indian Association for Cultivation of Science ( IACS ) సైన్స్ లో ప్రపంచానికి మొట్టమొదటి శ్వేత జాతీయతర నోబెల్ బహుమతి గ్రహీతను అందించింది. ఆ సంస్థ గురించిన విస్తృతమైన చర్చ ఈరోజు మన దేశంలో జరగాల్సిన అవసరం ఉంది. ఆ సంస్థ ప్రారంభించబడిన నేపథ్యాన్ని కూడా స్మరించుకోవలసిన అవసరం ఉంది. బ్రిటిష్ నుంచి చిల్లిగవ్వ తీసుకోకుండా పూర్తిగా స్వదేశీ నిధులతో జాతీయ భావాలతో ఆ సంస్థ ప్రారంభించబడడానికి గల కారణం భారతీయులు విజ్ఞాన శాస్త్రానికి పనికిరారు అని బ్రిటిష్ వారు మన పట్ల చూపించిన వివక్ష మాత్రమే. భారతదేశ స్వాతంత్ర్య సముపార్జనలో కీలక భూమిక పోషించిన జాతీయ కాంగ్రెస్ ప్రారంభించడానికి తొమ్మిది సంవత్సరాల పూర్వమే విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి తద్వారా భార తీయ సమగ్ర వికాసము లక్ష్యముగా ఒక విజ్ఞాన శాస్త్ర సంస్థ ప్రారంభించబడడం ఈ దేశంలో స్వదేశీ భావాలకు ఆద్యంగా నిలిచింది. స్వత్వాన్ని కాపాడుకోవడం కోసం విజ్ఞాన శాస్త్ర రంగంలో జరిగినటువంటి కృషిని ఈ జాతి పెద్దగా స్మరించుకోకపోవడం దురదృష్టం. మన స్వత్వాన్ని కాపాడుకోవడం కోసం భారతీయ జ్ఞాన పరంపరను పరిరక్షించుకుంటూ ఆధునిక విజ్ఞానంలో మేము ఎవరికీ తీసి కట్టు కాదు అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వడం కోసం అనేకమంది శాస్త్రవేత్తలు వలసవాద సమయంలో ఎంతో కృషి చేశారు.

విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు కొన్ని రోజుల ఆపుకోవచ్చు స్వ రాజ్య సాధన జరిగితీరాలనే ( Science can wait but Swaraj cannot ) శంఖారావాన్ని పూరించారు ఆచార్య ప్రపుల్ల చంద్ర రే.
బ్రిటిష్ ప్రభుత్వం ఆయనని విజ్ఞాన శాస్త్ర ముసుగులో ఉన్న విప్లవకారుడు అని ప్రకటించారు. భారతీయులు విజ్ఞాన శాస్త్ర దృక్పధములు లేని వారు అని అవహేళన చేసి తనకి ఉద్యోగాన్ని ఇవ్వడానికి నిరాకరించిన బ్రిటిష్ దురహంకారానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసిన మొట్టమొదటి సత్యాగ్రహి డాక్టర్ జగదీష్ చంద్రబోస్. ఇంగ్లండ్ లో మాస్టర్స్ డిగ్రీ లో అత్యుత్తమ ఫలితం సాధించి భారతదేశానికి వచ్చి కలకత్తాలో ఆచార్యుడిగా బోధించుటకు అవకాశం కల్పించండి అని అప్లై చేసుకుంటే ఆయన అప్లికేషన్ ని బ్రిటిష్ అధికారులు తిరస్కరించారు. జగదీష్ చంద్రబోస్ అనే నీకు విజ్ఞాన శాస్త్ర అవగాహన లేదు కాబట్టి ఉద్యోగాన్ని తిరస్కరిస్తున్నాము అని కాకుండా భారతీయులు ఎవరికీ విజ్ఞాన శాస్త్ర అవగాహన లేదు అని చెప్పి ఆయన అప్లికేషన్ తిరస్కరించారు. ఆ సమయంలో భారత్ దేశంలో వికసించిన విజ్ఞానం పైన పరిశోధనలు చేసి ఆధునిక విజ్ఞానాన్ని దానితో మేళవించి తద్వారా ప్రపంచ యవనిక పైన భారతీయ విజ్ఞాన శాస్త్ర పతాకాన్ని రెపరెపలాడించే ప్రయత్నం చేశారు దేశభక్తులైన మన శాస్త్రవేత్తలు. ఆచార్య ప్రఫుల్ల చంద్రరే వ్రాసిన హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ గ్రంధం, మహేంద్ర లాల్ సర్కార్ నెలకొల్పిన ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ , మొక్కలకు ప్రాణం ఉందని నిరూపించిన ఆచార్య జగదీష్ చంద్రబోస్ ప్రయోగం అన్నిటి ఉద్దేశము ఒక్కటే. మన స్వత్వాన్ని కాపాడుకోవడం. మనస్వత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనుకునే ప్రయత్నంలో భాగంగానే వారు పరిశోధనలు చేశారు, సంస్థలు నెలకొల్పారు. ఆ పరంపరను కొనసాగిస్తూనే చంద్రశేఖర్ వెంకట రామన్ ఆడిటర్ జనరల్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నప్పటికీ డా. మహేంద్ర లాల్ సర్కార్ ప్రారంభించిన ఆ ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే సంస్థ లో సాయం సమయంలో పరిశోధనలు గావించి అధ్భుతాన్ని ఆవిష్కరించారు. అతి తక్కువ వనరులతో తన ప్రయోగాన్ని సాధించి చూపించారు. ఈ శాస్త్రవేత్తలు అందరి ఉద్దేశం ఒక్కటే భారతీయ జ్ఞానపరంపర భారతీయ ప్రజ్ఞను ప్రపంచానికి చాటి చెప్పడం. వలసవాద సమయములో ఎన్నో వివక్షలకు అవహేళనలకు గురవుతున్న సందర్భంలో చిల్లిగవ్వ ఆశించకుండా తమ సంపూర్ణ సమయాన్ని విజ్ఞాన శాస్త్ర పరిశోధనల కోసం వెచ్చించి దేశభక్తి భావనలతో రంగరించి భారతీయ ప్రజ్ఞను ప్రపంచానికి చాటి చెప్పారు ఆనాటి మన భారతీయ శాస్త్రవేత్తలు. కనుకనే చంద్రశేఖర వెంకట రామన్ కుటుంబంలోనే జన్మించి అమెరికా పౌరుడిగా స్థిరపడి నోబెల్ బహుమతి పొందిన సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ ను భారత దేశంలో విజ్ఞాన శాస్త్రమంలో ఏ సమయము అత్యుత్తమ సమయము అని ప్రశ్నించగా ఆయన ఇచ్చిన సమాధానము 1920 దశకం అని చెప్పారు. ఆ సమయంలోనే భారత దేశంలో అద్భుతమైన విజ్ఞాన శాస్త్ర పరిశోధనలకు గావించబడ్డాయి ఆ సమయమే భారతీయ విజ్ఞాన శాస్త్రానికి అత్యుత్తమ సమయంగా ఆయన పేర్కొనడం జరిగింది. వివక్షను ఎదుర్కొంటున్న ఆ సమయంలో భారతీయ ప్రజ్ఞను ప్రపంచానికి చాటి చెప్పాలన్న దార్శనిక శాస్త్రవేత్తల కృషి సంకల్పము అటువంటి అత్యుత్తమ ఫలితాలను అందించి పెట్టింది అని ఆయన చెప్పారు.
స్వాతంత్ర్య అనంతరము విజ్ఞాన శాస్త్ర పరిశోధనల పైన దృష్టి కొనసాగుతూనే వచ్చింది. విక్రమ్ సారాభాయ్, హోమీ జహంగీర్ బాబా వంటి అనేకమంది శాస్త్రవేత్తలు భారతీయ విజ్ఞాన శాస్త్ర రంగాన్ని సుదృఢం చేశారు. దాన్ని కారణంగానే ఈరోజు ప్రపంచ దేశాలలో భారతీయ విజ్ఞాన శాస్త్ర రంగం ప్రశంసలందుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. మన భారత ప్రధాని ఆత్మ నిర్భర భారతదేశం అని పిలుపునిచ్చారు.విజ్ఞాన శాస్త్ర రంగంలో స్వదేశీ భావనలు స్వాతంత్ర్యానికి పూర్వమే రూపుదిద్దుకున్నాయి ఆ స్వదేశీ భావనల కారణంగానే భారతదేశం స్వీయ పరిజ్ఞానాలను అభివృద్ధి పరచుకుని అటు రక్షణ రంగంలో, అంతరిక్ష రంగంలో, కమ్యూనికేషన్ల రంగంలో, ఫార్మా రంగంలో వ్యవసాయంలో ముందుకు సాగుతూ అద్భుత ఫలితాలు సృష్టిస్తోంది.ఏ దేశము కూడా మరొక దేశాన్ని అభివృద్ధి పరచడానికి సహకరించదు.తమ పరిజ్ఞానాన్ని ఉచితంగా , ఉదారంగా బదిలీ చేయదు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అది వ్యక్తి అయినా సమాజమైన దేశమైనా భగవద్గీతలోని ఉధ్ధరేత్ ఆత్మానాత్మానం శ్లోకం తెలిపే సత్య మీదే. విజ్ఞాన శాస్త్ర పరిశోధనలలో మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. దాని కారణంగానే మనం అభివృద్ధి పథాన ముందుకు సాగగలం.వికసిత భారత్ గా ఉద్భవించగలం.అయితే వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే విజ్ఞాన శాస్త్ర పరిశోధనలకు నిధులు పెంచుకోవలసిన అవసరం ఉంది. ఆ దిశగా మన ప్రభుత్వాలు విద్యావేత్తలు శాస్త్రవేత్తలు మేధావులు సమాజము ఆలోచించాలి. కలిసి పయనించాలి. వికసిత్ భారత లక్ష్య సాధన కోసం అవసరమైన స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవడం కోసం సంకల్పించాలి.

వికసితభారత్ కోసం స్వదేశీ పరిజ్ఞానం అనే థీమ్ తో నిర్వహించుకుంటున్న ఈ జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవ శుభ సందర్భంగా ప్రపంచంలోని 75 మంది అత్యుత్తమ భారతీయ శాస్త్రవేత్తలు భారతదేశంలో పరిశోధనల గావించడానికి సుముఖత వ్యక్తం చేసి భారతదేశానికి వస్తామని ప్రకటించడం శుభపరిణామం. మన దేశ సమగ్ర, సుస్థిర అభివృద్ధి కోసం స్వీయ పరిజ్ఞానాన్ని వికసింప చేసుకోవడం ఈరోజు మన ముందున్న లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా అందరూ కృషిచేయాలి.స్వదేశీ విజ్ఞాన శాస్త్ర ఉద్యమ శంఖారావం పూరించాలి.

జై భారత్ – జై విజ్ఞాన్

కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి
జాతీయ పాలకమండలి సభ్యుడు – విజ్ఞాన భారతి