Home News స్వధర్మం ఆధారంగా స్వతంత్రం: ఆర్.ఎస్.ఎస్ శిక్షావర్గ ముగింపు సభలో వక్తలు

స్వధర్మం ఆధారంగా స్వతంత్రం: ఆర్.ఎస్.ఎస్ శిక్షావర్గ ముగింపు సభలో వక్తలు

0
SHARE

“స్వధర్మం ఆధారంగా స్వతంత్రం ఏర్పరచుకునే సమయం ఆసన్నమయింది. ఈ అపూర్వమైన కార్యంలో ప్రతిఒక్కరు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అప్పుడు భవ్యమైన భారతం నిర్మాణమవుతుంది. ప్రపంచంలోని అన్ని రంగాల్లో భారత్ తృతీయ ప్రత్యామ్నాయాన్ని చూపించగలదని నిరూపితమవుతోంది’’ అని ఆర్.ఎస్.ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్ శ్రీ నడింపల్లి ఆయుష్ అన్నారు. స్వాతంత్ర్యం సాధించిన తరువాత ప్రారంభం కావలసిన ఈ స్వతంత్ర సాధన ప్రక్రియ 75 సంవత్సరాలు ఆలస్యమైనా ఇప్పుడు త్వరిత గతిన సాగుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భాగ్యనగర్ శివారులో ఉన్న అన్నోజీగుడాలో జరిగిన ఆర్ ఎస్ ఎస్ శిక్షవర్గ (శిక్షణ శిబిరం) ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఇందులో వరంగల్ అదనపు కలెక్టర్ గా పదవీ విరమణ చేసిన శ్రీ రావుల మహేందర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్న పోర్చుగీసు, డచ్, స్పానిష్, బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తులు భారత్ పైన కూడా దాడి చేసినా, భారతీయ సాంస్కృతిక మూల శక్తి ముందు తలవంచక తప్పలేదని ఆయుష్ గుర్తుచేశారు. అందుకనే ఈ అస్తిత్వాన్ని నాశనం చేయడానికి, స్వాభిమానాన్ని దెబ్బకొట్టడానికి బ్రిటిష్ వారు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. ఈ దేశం ఎవరిదీ కాదని, ఇది వైరుధ్యాలు కలిగిన ఒక ఉపఖండమని, ఇక్కడ ఎలాంటి జ్ఞానం లేదని, సామాజిక, ఆర్ధిక వ్యవస్థలు తమ భిక్షేనని వాళ్ళు ప్రచారం చేశారు. అదే నిజమని క్రమంగా భారతీయులే నమ్మారు. కానీ బ్రిటిష్ వారి ఈ కుతంత్రాన్ని వారు ప్రవేశపెట్టిన విద్య ద్వారానే తిప్పి కొట్టారు సావర్కర్, అరవింద ఘోష్ మొదలైనవారు. ఈ మహా పురుషులను ప్రఖర జాతీయవాదులుగా తీర్చిదిద్దడంలో వారి తల్లుల పాత్ర ప్రముఖమైనది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ జాతీయవాద ధోరణి అణచివేతకు గురైంది. `హిందూ’ అనే పదం కూడా వాడకూడనిది అయింది. కానీ సంఘ స్వయంసేవకుల నిరంతర ప్రయత్నం మూలంగా మార్పు వచ్చింది. ఒకప్పుడు సోమనాథ ఆలయ పునర్నిర్మాణానికి అభ్యంతరాలు వ్యక్తమైతే ఇప్పుడు అయోధ్యలో రామమందిర భూమి పూజలో ప్రధాని స్వయంగా పాల్గొన్నారు. ఈ మార్పును మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి అందరూ తమవంతు బాధ్యత నిర్వర్తించాలని ఆయుష్ కోరారు.

అంతకుముందు మాట్లాడిన ముఖ్య అతిధి రావుల మహేందర్ రెడ్డి ఆర్ ఎస్ ఎస్ కార్యం చాలా ప్రత్యేకమైనది, విశిష్టమైనదని అన్నారు. సంఘటిత భావం చాలా బలమైనదని, దానిని పెంపొందించేందుకు ప్రతిఒక్కరు రోజులో కనీసం అరగంట వెచ్చించాలని పిలుపునిచ్చారు.

20 రోజులపాటు జరిగిన శిక్షావర్గ (శిక్షణ కార్యక్రమం)లో వివిధ జిల్లాలకు చెందిన ఎంపిక చేసిన కార్యకర్తలు పాల్గొన్నారు. 18-30 మధ్య వయస్సు కలిగిన మొత్తం 117 మంది ఈ వర్గలో శిక్షణ పొందారు. వీరిలో 58మంది విద్యార్ధులు, 57 మంది ఉద్యోగులు ఉన్నారు. కార్యక్రమం ప్రారంభంలో శిక్షార్ధులు ప్రదర్శించిన శారీరిక్ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో తెలంగాణా ప్రాంత సహ సంఘచాలక్ శ్రీ సుందర రెడ్డి, వర్గ సర్వాధికారి శ్రీ విజయానంద్ లు కూడా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో పురప్రముఖులు, మహిళలు, పెద్దలు విచ్చేశారు.