Home News దక్షిణ తీర ప్రాంతంలో భీభత్సం సృష్టించిన ఓఖి తుఫాను బాధితుల సేవలో ఆర్‌.ఎస్‌.ఎస్‌.

దక్షిణ తీర ప్రాంతంలో భీభత్సం సృష్టించిన ఓఖి తుఫాను బాధితుల సేవలో ఆర్‌.ఎస్‌.ఎస్‌.

0
SHARE

ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలు నవంబరు 30వ తేదీన తమ సహాయక చర్యలను ప్రారంభించారు. అదే రోజు ఓఖి తుఫాను మరింత తీవ్ర రూపం దాల్చింది. అయినప్పటికీ సంఘ కార్యకర్తలు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. తుఫాను కారణంగా అత్యంత ప్రభావితమైన కన్యాకుమారి ప్రాంతానికి మొదటగా వారు చేరుకుని పౌరులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

నవంబరు 29న వచ్చిన ఓఖి తుఫాను దక్షిణ భారతదేశంలోని కోస్తా ప్రాంతాలతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భీభత్సం సష్టించింది. వేలాది గ్రామాలు నీట మునిగాయి. తమను రక్షించే వారి కోసం బాధిత ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఎదురు చూశారు. తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు తమకు సహకారం కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. భారత నౌకాదళాలు రక్షణ చర్యలకు ఉపక్రమించాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో బాధితుల సహాయక చర్యల్లో పాల్గొన్న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌.ఎస్‌.ఎస్‌.) ఓఖి తుఫాను బాధితుల కోసం కూడా ముందుకు వచ్చింది. తన నిస్వార్థ సేవలను అందించింది. దేశ ప్రజల కోసం కుల, మతాలకు అతీతంగా ఎంతటి కష్టానికైనా సహిస్తామనే సందేశాన్ని సమాజానికి అందించింది.

నవంబరు 29, 2017న శ్రీలంకలో మొదలైన ఓఖి తుఫాను ఆయా రాష్ట్రాలలోని తీర ప్రాంతాలను బలంగా తాకింది. గంటకు 155 నుండి 165 కిలోమీటర్ల వేగంతో తీవ్రమైన గాలులు వీచాయి. హోరు గాలులతో గంటకు 165 నుండి 20 కిలోమీటర్ల వేగంతో తుఫాను తీరం దాటింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలోని సముద్ర తీర ప్రాంతాలు తుఫాను బారిన పడ్డాయి. భారత వాతావరణ విభాగం ఈ తుఫానుకు ‘ఓఖి’ అని నామకరణం చేసింది. తుఫానులలో అత్యంత బలీయమైన వాటిలో ఇది ఒకటని తెలిపింది. ఓఖి తుఫాను ధాటికి మూడు రాష్ట్రాల్లోని కోస్తా ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. కన్యాకుమారి ప్రాంతం తుఫాను భీభత్సానికి సాక్ష్యంగా నిలిచింది. గత 25 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత నష్టాన్ని సష్టించింది. 10 లక్షల అరటి తోటలు, లక్ష చెట్లు వేళ్ళతో సహా పెకిలి కూలిపోయాయి. రహదారులన్ని దెబ్బతిని రాకపోకలు స్తంభించాయి. కమ్యూనికేషన్‌ వ్యవస్థ కూడా పూర్తిగా నిలిచిపోయింది.

ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహాయ చర్యలు

ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలు నవంబరు 30వ తేదీన తమ సహాయక చర్యలను ప్రారంభించారు. ఓఖి తుఫాను బారిన పడిన తమిళనాడు, కేరళ ప్రాంతాలకు చేరుకున్నారు. అదే రోజు తుఫాను మరింత తీవ్ర రూపం దాల్చింది. అయినప్పటికీ సంఘ కార్యకర్తలు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. తుఫాను కారణంగా అత్యంత ప్రభావితమైన కన్యాకుమారి ప్రాంతానికి మొదటగా వారు చేరుకుని పౌరులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అనంతరం మొత్తం 100 బృందాలుగా విడిపోయారు. మొదటి పనిగా రోడ్లను, రవాణా మార్గాలను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బృందాలతో కలిసి రవాణా వ్యవస్థలను మెరుగుపరచడంలో సఫలీకతమయ్యారు. కన్యాకుమారి జిల్లాలోని సుచీంద్రం అనే పట్టణం చుట్టుపక్కల గల 21 గ్రామాలు నీటిలో చిక్కుకు పోయాయి. 4200 ఇండ్లు వరదలో మునిగి పోయాయి. ఆ విషయం తెలుసుకున్న స్వయం సేవకులు వెంటనే అక్కడికి చేరుకుని గ్రామస్తులకు ధైర్యాన్నిచ్చారు. వేలాది మంది ప్రజలను కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. చెన్నై మహానగర్‌ సంఘచాలక్‌ కళ్యాణ్‌ సింగ్జీ, సేవా భారతి తమిళనాడు అధ్యక్షులు రాబు మనోహర్లు వరద బాధితుల కోసం ఆహారం, ప్లాస్టిక్‌ చాపలు, కొవ్వొత్తులు, దోమల నివారణ పరికరాలు సేకరించారు. వాటిని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సహాయ కేంద్రాలకు తరలించి, బాధితులకు అందేలా ఏర్పాట్లు చేశారు.

ఆ సందర్భంలో సేవాభారతి కన్యాకుమారి ప్రాంత అధ్యక్షులు ఉన్నికష్ణన్‌ వ్యాఖ్యలు బాధితుల్లో నమ్మకాన్ని నింపాయి. కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం కాదు.. తుఫాను బాధితులు తిరిగి పునరావాసం పొందే వరకు తమ సహాయక చర్యలు కొనసాగుతాయని ఆయన అన్నారు. ఇందుకు ప్రతిఒక్కరూ వీలైనంత దాత్రుత్వాన్ని చూపాలని పిలుపునిచ్చారు. ఆహారం, ఇతర సామాగ్రిని విరివిగా దానం చేయాలని దాతలను కోరారు. సేవాభారతి ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను, మంచినీటిని, బిస్కెట్లు, పాలు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు సహాయక చర్యల్లో భాగంగా అందజేశారు.

జాలరుల రక్షణలో నౌకాదళం పాత్ర

తమిళనాడు, కేరళ కోస్తా ప్రాంతాల్లోని జాలరులు, మత్స్యకారులు ఓఖి తుఫాను కారణంగా సముద్రంలో చిక్కుకుపోయారు. వారి కోసం భారత నౌకాదళం, తీర రక్షక దళాలు, జాతీయ విపత్తుల నివారణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆపరేషన్‌ సహాయ్‌’ ప్రారంభించారు. తుఫానులో చిక్కుకున్న మత్స్యకారులను, వారి పడవలు, ఓడలను వెతికేందుకు చర్యలను చేపట్టారు. అంతేకాకుండా తుఫాను బారిన పడిన వారికి ఉపశమనం కలిగేలా కార్యక్రమాలను చేపట్టారు. ప్రారంభంలో ఆరు యుద్ధ నౌకలు మరో ఏడు బృందాలతో కలిసి కేరళలోని కొచ్చి తీరం నుండి మత్స్యకారులను వెతికేందుకు బయలుదేరాయి. అనంతరం మత్స్యకారులకు సహాయాన్ని అందించేందుకు ముందుకు రావాలని వ్యాపార నౌకలకు కూడా నౌకా దళం పిలుపునిచ్చింది. అలా నవంబరు 30వ తేదీన ఓ బోటుకు ఏడుగురు జాలరులు వేలాడుతూ ఐఎన్‌ఎస్‌ రాజా కంటపడ్డారు. త్రివేండ్రం నుండి 25 కిలోమీటర్ల దూరంలో వారు ఒంటరిగా ఉన్నారు. వెంటనే నౌకాదళం హెలికాప్టర్‌లో అక్కడకు చేరుకొని వారిని కాపాడి సహాయక కేంద్రానికి చేర్చింది. మరో 8 మందిని నౌకాదళ హెలికాప్టర్‌ గుర్తించి వారిని కూడా కాపాడింది. తుఫాను తీవ్రంగా ఉన్నప్పటికీ ఇలా మొత్తం 84 మంది మత్స్యకారులను భారత నావికా దళ అధికారులు కాపాడారు. డిసెంబర్‌ 4వ తేదీ వరకు సహాయక చర్యలను కొనసాగించాయి.

చిమ్మ చీకటిలో సైతం రక్షణ చర్యలు

రక్షణ చర్యల్లో నిమగ్నమైన భారత నావికా దళ హెలికాప్టర్లు సముద్ర జలాల్లో ఓ వ్యక్తి కనిపించాడు. అలలు భీకరరూపంలో ఉన్నాయి. ఆ వ్యక్తి ఉన్న పడవ బోల్తాపడి సముద్ర జలాల తాకిడికి మునిగిపోతూ ఉంది. అతడిని మత్స్యకారుడిగా నావిక దళం వారు గుర్తించారు. అయితే అప్పటికే ఆ ప్రాంతమంతా చిమ్మ చీకటిగా ఉంది. ఒకవేళ ఆ మత్స్యకారుడిని కాపాడాలంటే తీవ్రమైన అలల తాకిడిని, రాక్షస గాలులను తట్టుకొని నిలబడాలి. అదేం అంత తేలికైన విషయం కాదు. అందులోను ఓఖి తుఫాను ప్రభావంతో సముద్ర జలాలు అల్లకల్లోలంగా మారాయి. అలాంటి సందర్భంలో మత్స్యకారుడిని కాపాడాలనుకోవడం ఆత్మహత్యతో సమానమే అవుతోంది. అయినప్పటికీ ఎల్‌ హెచ్‌ ఎస్‌ పైలట్‌ కెప్టెన్‌ పి.రాజ్‌ కుమార్‌ ఎలాగైనా మత్స్యకారుడిని రక్షించాలని నిర్ణయించుకున్నారు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వెనుకాడలేదు. మిగిలిన కొద్ది నిమిషాలను సద్వినియోగం చేసుకొని మత్స్యకారుడిని కాపాడేందుకు భీకరమైన ఆ సముద్రం పై 10 అడుగుల ఎత్తు వరకు హెలికాప్టర్‌ను తీసుకెళ్ళి నిలిపాడు. వెంటనే నావికా దళానికి చెందిన గజ ఈతగాడు నీటిలోకి దూకి మత్స్యకారుడిని కాపాడారు. ఎటువంటి రాత్రి పరికరాలు అందుబాటులో లేకపోయినా నావిక దళం చేసిన సాహసం అనిర్వచనీయమైనదిగానే చెప్పుకోవచ్చు.

మానవతా దృక్పథం – విపత్తు ఉపశమనం

తుఫాను బాధితుల కోసం నిర్విరామ వెతుకులాట, రక్షణ కార్యక్రమాలతో పాటు భారత నావికా దళాలు తమ మానవతా ద క్పథాన్ని కూడా చాటుకున్నాయి. నావికా దళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ శార్ధూల్‌, ఐఎన్‌ఎస్‌ శారదా, ఐఎన్‌ఎస్‌ చెన్నయ్‌ ఉపశమనానికి కావలసిన సామాగ్రిని బాధితులకు అందజేశాయి. ప్రాణాలతో బయటపడిన వారిని తమ ప్రాంతానికి చేర్చేందుకు చిన్న చిన్న పడవలను వినియోగించుకున్నాయి. లక్షద్వీప్‌లోని ద్వీపాల మధ్య సహాయక చర్యలను అనుసంధానించడానికి కవరవట్టి నుండి 42బి హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచారు. విమానాల నౌక అయిన ఆదిత్య 5 వేల సురక్షిత తాగునీటి బాటిళ్ళను లక్షద్వీప్‌, మినికాయ్‌ ద్వీపాలకు మోసుకెళ్ళింది. బిత్ర ద్వీపంలోని తుఫాను బాధితులకు ఐఎన్‌ఎస్‌ త్రిఖండ్‌ ఆహారం, ఇతర ఉపశమన పదార్థాలను తీసుకెళ్ళింది.

మనసులు గెలుచుకున్న నిర్మలా సీతారామన్‌

కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ తన స్వరాష్ట్రమైన తమిళనాడులో ఓఖి తుఫాను బాధితులను పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజల కన్నీరు, ఆర్తనాదాలను చూసి చలించిపోయారు. వారి బాధను అర్థం చేసుకున్నారు. కేంద్ర రక్షణ శాఖ పదవి బాధ్యతలను చేపట్టిన కొద్ది కాలంలోనే ఓఖి తుఫాను సంభవించడం ఆమె నైపుణ్యానికి పరీక్షను పెట్టింది. అలా కేరళలో తుఫాను బాధితులను కలిసినప్పుడు స్థానికుల నుండి ఆగ్రహం వ్యక్తమైంది. ప్రజలలోని ఆవేదనను అర్థం చేసుకుంటూ ఆమె స్పదించారు. పోలీసులు హెచ్చరించినప్పటికీ ఆమె బాధితులను కలిసేందుకు భయపడలేదు. కేరళ ముఖ్యమంత్రి కూడా తుఫాను బాధితులను కలిసేందుకు జంకారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కాని ఆమె వారికి చెప్పిన మాటలు అందరి మనసులను గెలిచాయి. ‘సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారులను వెతికి ఇంటికి చేరుస్తాము. ఎటువంటి వైఫల్యాలు లేకుండా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మొత్తం 11 దళాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. యుద్ధ నౌకలు కూడా రంగంలో దిగాయి. మీరు మీ వలలు, పడవలు కోల్పోయారు. అందుకు మనం పరిష్కారాన్ని కనుక్కొందాం. మీ ఇంటి పెద్దలను, కుటుంబ సభ్యులను వెతకడం ప్రస్తుతం మన ముందున్న అత్యవసర విషయం. నేను మీ బాధను అర్థం చేసుకోగలను, ఎందుకంటే నేను కూడా ఓ తల్లినే. ఈ కష్ట కాలంలో నేను మీతోనే ఉంటాను’ అని వారికి ధైర్యం చెప్పి సహాయం చేశారు.

మోసం చేసిన చర్చి

తాము ప్రజలకు సేవా చేస్తున్నామని చెప్పుకుంటూ.. మతం మార్చే చర్చిలు ఓఖి తుఫాను సమయంలో ఎటువంటి సహాయక చర్యలు చేపట్టకపోవడం విడ్డూరం. దీనిపై కన్యాకుమారికి చెందిన జె.సెల్వరాజ్‌ అనే స్థానికుడు చేసిన వ్యాఖ్యలు చర్చిల రహస్య అజెండాను మరోమారు బయటపెట్టాయి. నేపాల్లో భూకంపం సంభవించినప్పుడు బైబిల్‌ చేతపెట్టి సహాయం చేస్తామని తన నిస్సిగ్గు తనాన్ని క్రైస్తవ మిషనరీలు చెప్పకనే చెప్పుకున్నాయి. సెల్వరాజ్‌ మాటల్లో చెప్పాలంటే ‘గత కొన్ని దశాబ్దాలుగా మేమంతా చర్చిని నమ్ముకొని జీవిస్తున్నాం. తమిళనాడులోని దక్షిణ జిల్లాల పాలన స్థానిక కమిటీల ఆధ్వర్యంలో జరుగుతుంది. వాటిని కాథలిక్‌ చర్చిలు నిర్వహించేవి. అవి రాజకీయ నిర్ణయాలు తీసుకోనప్పటికీ, ప్రజల నుండి పెద్ద మొత్తంలో సొమ్మును వసూలు చేసేవి. అయితే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం అవి స్పందించేవి కావు. ఓఖి తుఫాను వచ్చినప్పుడు కూడా చర్చిలు మౌనం వహించాయి. ఎటువంటి సహాయం చేయలేదు. అంతేకా చర్చి పండుగలను జరుపుకోవడంలో ఈ కమిటీలు బిజీగా ఉండేవి. సముద్రంలో ప్రజలు చనిపోతుంటే వారికి వేడుకలు అవసరమా? ఇక చర్చి మమ్మల్ని మోసం చేయజాలదు. ప్రస్తుతం మాకు రక్షకులు ఎవరో తెలిసింది. స్వయం సేవకులు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా మాకు సహకరించారు’ అని కంటతడి పెడుతూ అతను చెప్పిన తీరు మనస్సున్న ప్రతివ్యక్తిని ఆలోచింపచేస్తుంది.

(జాగృతి సౌజన్యం తో)