Home News విద్యార్థులు చ‌దువుకు దూరం కాకుడ‌దు… ఓ ఉపాధ్యాయురాలి వినూత్న ప్ర‌య‌త్నం

విద్యార్థులు చ‌దువుకు దూరం కాకుడ‌దు… ఓ ఉపాధ్యాయురాలి వినూత్న ప్ర‌య‌త్నం

0
SHARE

ప్ర‌స్తుత కాలంలో పిల్ల‌ల త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను ప్రైవేటు పాఠ‌శాల‌లో చేర్పించ‌డానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లకు తీసుకురావాల‌ని సంక‌ల్పం ఒక ఉపాధ్యాయురాలికి క‌లిగింది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు వ‌చ్చే విద్యార్థుల‌కు మంచి విద్య‌ను అందించాల‌నే త‌ప‌న ఆ ఉపాధ్యాయురాలికి ఒక వినూత్న ఆలోచ‌న త‌ట్టేలా చేసింది. విద్యార్థులు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుకునేలా ఎన్నో ఆస‌క్తిక‌ర అంశాల‌ను ప్ర‌వేశ‌పెట్టి, క‌రోనా స‌మ‌యంలో విద్యార్థులు చ‌దువుకు దూరం అవ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో ఊళ్లో ఉన్న గోడ‌ల‌పై పాఠ్యాంశాల‌ను స్వ‌యంగా తానే రాసి పిల్ల‌ల‌కు చ‌దువుపై ఆస‌క్తిని పెంచే విధంగా చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని పెద్ద‌ప‌ల్లి జిల్లా పుట్ట‌పల్లి పాఠ‌శాల‌లో ప్ర‌స్తుతం ప్ర‌ధానోపాధ్యాయురాలి ఉన్న ఎస్‌.భాగ‌ల‌క్ష్మి గారు విద్యార్థుల‌కు చ‌దువుపై ఆస‌క్తిని క‌న‌బ‌ర్చ‌డానికి చేసిన వివిధ కార్య‌క్ర‌మాల గురించి తెలుసుకుందాం

ఎస్‌.భాగ్యలక్ష్మి గారు డిఎస్సీ 2008 ఎస్జీటిగా ఉద్యోగం పొందారు. 2013లో పెద్దపల్లి మండలంలోని MPPS పుట్టపల్లి పాఠశాలకు ఉపాధ్యాయురాలిగా వ‌చ్చారు. ప్ర‌స్తుతం అదే పాఠ‌శాల‌కు ప్ర‌ధానోపాధ్యాయులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆమె ఊళ్లోకి ఉపాధ్యాయురాలిగా వ‌చ్చిన‌ప్పుడు గ్రామంలోని విద్యార్థుల త‌ల్లిదండ్రులు గ్రామానికి కొంత దూరంలో ప్రైవేటు పాఠ‌శాల‌లు, ఇంగ్లీష్ మీడియం పాఠ‌శాల‌ల‌కు పంపేవారు. ఈ క్ర‌మంలో భాగ్య‌ల‌క్ష్మి గారికి గ్రామంలోని విద్యార్థులంద‌రిని గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తీసుకురావాల‌నే సంక‌ల్పం క‌లిగింది. అప్ప‌టి నుంచి ఆ దిశ‌గా ప్ర‌ణాళిక‌లు చేస్తూ గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను ప్రైవేటు పాఠ‌శాల‌ల కంటే ధీటుగా త‌యారు చేయాల‌నే ధృడ సంక‌ల్పంతో విద్యార్థుల‌కు చ‌దువు ప‌ట్ల ఆస‌క్తి పెంచే విధంగా గ్రామంలో అనేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. విద్యార్థులు ఎట్టి ప‌రిస్థితుల్లో చదువుకు దూరం కాకుడ‌ద‌నే ఉద్దేశంతో గ్రామంలోని గోడ‌ల‌పై పాఠ్యాంశాల‌ను వివిధ ర‌కాల బొమ్మ‌ల‌ను అందంగా త‌న సొంత ఖ‌ర్చుల‌తో పెయింటింగ్ వేయించారు. అలాగే మండ‌ల విధ్యాధికారి (ఎం.ఈ.వో) గారి స‌హ‌కారంతో పాఠ‌శాల‌లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించారు.

పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు హజరు కావ‌వ‌లే ఉద్దేశంతో పాఠశాల అంటే ఆసక్తి పెరగడానికి పాఠ్యాంశాలను సాంప్రదాయ బోధనా పద్ధతుల్లో కాకుండా ఆట, పాటలతో, TLM ఉపయోగించి బోధన చేశారు. అదే విధంగా విద్యార్థులకు ప్రతిరోజు ఆట పాటలు, క్విజ్ వంటి కార్యక్రమాలు నిర్వహించి వారికి చ‌దువు ప‌ట్ల ఆస‌క్తి పెంచారు. జాతీయ పండుగలు, ప్రముఖ పండుగల సందర్భంగా విద్యార్థులకు ఆ పండుగల ప్రాముఖ్యత తెలుపుతూ, వారితో నాటికలు వేయించారు. పిల్ల‌లు కూడా ప్రతి రోజూ పాఠశాలకు హజర‌వుతూ ప్రతి కార్యక్రమంలో ఉత్స‌హంగా పాల్గొంటూ విద్యాభ్యాసం చేశేవారు. ఇలా పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహన్ని నింపడానికి ప్రాథ‌మిక స్థాయి విద్యార్థులు అయినప్పటికి కూడా వారిలో సృజనాత్మకతను వెలికితీసే విధంగా సైన్స్‌ఫేర్‌, కలర్స్ డే, ఫుడ్ ఫెస్టివల్స్, నృత్యాలు, కార్డ్స్ తయారుచేయడం వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వ‌హించారు.


ఇలా పాఠశాలలో జరిగే అన్ని కార్యక్రమాలను, Activity based learning చూసి గ్రామంలోని తల్లిదండ్రులు ప్ర‌భుత్వ పాఠశాలపై నమ్మకంతో వారి పిల్లలను ప్రభుత్వ‌ పాఠశాలకు పంపిస్తున్నారు. భాగ్య‌ల‌క్ష్మి గారి చొర‌వ వ‌ల్ల ఇప్పుడు గ్రామంలోని ఏ విద్యార్థి కూడా బయట పాఠశాలలకు వెళ్ళడం లేదు.

ప్రాథమిక విద్య అభ్యసించిన తర్వాత ప్రాథ‌మికోన్న‌త‌, ఉన్న‌త పాఠ‌శాల‌లు(UPS, HS) దూరంగా ఉండడం ద్వారా నడిచి వెళ్ళే పరిస్థి తి లేనందున ఆడపిల్లలు చదువు ఆపేసే పరిస్థితి వచ్చింది. అప్పుడు తల్లిదండ్రుల కోరిక మేరకు గురుకులాలకు ప్రవేశ పరీక్షకు విద్యార్థుల‌ను స‌న్న‌ద్ధం చేయించారు. అలా ప్రతి సంవత్సరం విద్యార్థులకు ప‌రీక్ష‌ల కోసం త‌యారు చేస్తూ 3 నెలల ముందుగానే ప‌రీక్ష‌ల‌కు అవసర‌మైన పుస్త‌కాల‌ను, మెటిరియ‌ల్ ను ఇస్తూ పరీక్షలు రాయించడం జరుగుతోంది. సంవత్సరం మా పాఠశాల నుండి 4 వ తరగతి నుండి 5వ తరగతికి ఎంపిక అవుతున్నారు. ఇప్పుడు గ్రామంలో ఇంటి ఇంటికి గురుకులాలో చదివే పిల్లలు ఉన్నారు.

కేవలం గురుకులారే కాకుండా విద్యార్థులను అన్ని రంగాల్లో వారి సామర్థ్యాలను బట్టి ప్రోత్సహిస్తున్నారు. కే. మహిదర్ అనే విద్యార్థి ప్రైవేట్ పాఠశాల నుండి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చేరాడు. అత‌ని సామర్థ్యాలను పరీక్షించిన తర్వాత అతనికి ఆట‌ల ప‌ట్ల ఆసక్తి ఉన్నట్టు గమనించి, ఆ విద్యార్థికి పాఠ‌శాల‌లోనే నెల రోజుల పాటు ఫిజిక‌ల్ ఇవెంట్స్‌లో నైపుణ్యం క‌ల్పించి స్పోర్ట్స్ స్కూల్ కు సిద్ధం చేయించారు. ఆ విద్యార్థి ని మండ‌ల‌, జిల్లా స్థాయి ఎంపిక పోటీల‌కు తీసుకెళ్లి అభ్యాసం చేయించారు. అలా ప్ర‌స్తుతం ఆ విద్యార్థి కరీంనగర్ స్పోర్ట్స్ పాఠ‌శాల‌లో ప్రవేశం పొందాడు. అదే విధంగా K. అరవింద్ అనే విద్యార్థి రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో ప్రవేశం పొందాడు.

పాఠశాల విద్యార్థులతో గ్రామంలో పాటలు, నృత్యాలు ప్రదర్శింప చేసి ప్రజలకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై అనగా సభ కల్పించడం వంటి చైత‌న్య వంత‌మైన కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హించారు.

పాఠశాలలో నిర్వహించే వినూత్న కార్యక్రమాలను గుర్తించిన పై అధికారులు 2019 సంవ‌త్స‌రానికి గాను గాను పెద్దపల్లి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో భాగ్య‌ల‌క్ష్మి గారిని స‌త్క‌రించారు.

గత సంవత్సర‌ కాలంగా కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు పాఠశాల ప్రత్యక్ష బోధనకు దూరమైనారు. TV పాఠాలు వచ్చినప్పటికిని వారి సందేహాలు నివృత్తి చేయడానికి Zoom ద్వారా ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు కూడా నిర్వహించారు. ఇవి పిల్లలకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. కాని స్మార్ట్ ఫోన్లు అంద‌రికీ అందుబాటులో లేక కొంతమంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఆన్‌లైన్ క్లాసులు కూడా 3–5 వరకు మాత్రమే రావడం… 1,2 తరగతుల విద్యార్థులు చ‌దువుకు దూరమై రోడ్లపై ఆడడం గ‌మ‌నించిన భాగ్య‌ల‌క్ష్మి గారు ఈ విషయాన్ని సహ ఉపాధ్యాయురాలు P. మాధవి గారు, SMC చైర్మెన్ తో చర్చించి విద్యార్థులు కనీస ప్రాథమిక విద్యా భావనలు మరచి పోకూడదనే ఉద్దేశంతో గ్రామ కూడళ్ళ వద్ద, విద్యార్థులు లు ఎక్కడైతే ఎక్కువగా ఆడుకుంటారో ఆ ప్ర‌దేశాల్లోని గోడల పైన వర్ణమాల, గుణింతాలు, అంకెలు, ఎక్కాలు(టేబుల్స్), ఆకారాలు , రంగులు, కూర‌గాయ‌లు, పండ్లు, వాహ‌నాల‌ పేర్లు రాయ‌డం,
ఇంగ్లీష్ గ్రామ‌ర్ విష‌యాల‌ను పిల్ల‌ల‌కు అర్థ‌మ‌య్యే విధంగా వాటిని పెయింట్స్‌తో గోడలపైన స్వయంగా తానే రాసి ఒక వినూత్న ప‌ద్ద‌తిని ప్రారంభించింది. ఇప్పుడు పిల్ల‌లు వారి ఇంటి వ‌ద్ద గోడ‌ల‌పై రాసిన పాఠ్యాంశాల‌ను చూసి చ‌క్క‌గా చ‌దువుకుంటున్నారు. దీని వ‌ల్ల విద్యార్థులు రోడ్ల‌పై ఆడుకోకుండా చ‌దువు ప‌ట్ల ఆస‌క్తిని పెంచుకుంటున్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా త‌మ పిల్ల‌లు ఆడుతూ, పాడుతూనే విద్యాభ్యాసం చేస్తున్నారనే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.