బ్రిటీష్ రాజ్యంలో వారి అరాచకాలకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ ఇచ్చిన సందేశాలకు ప్రభావితమై ఎందరో తెలుగు మహిళలు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ.. బ్రిటీష్ పాలకులకు దేశం నుంచి వెళ్లగొట్టాలనే గట్టి నిర్ణయంతో ముందుకు సాగారు. అలాంటివారిలో మాగంటి అన్నపూర్ణాదేవి, దువ్వూరి సుబ్బమ్మ గాంధీజీ ప్రశంసలు పొందిన వనితలు.
మాగంటి అన్నపూర్ణాదేవి
ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో డబ్బులకోసం రచయితగా మారిన ఈమె.. గాంధీ సందేశాలతో ప్రభావితమై స్వాతంత్య్ర పారాటంలో ప్రముఖ పాత్ర పోషించి, వీరవనితగా చరిత్రలో నిలిచింది. అంతేకాదు… గాంధీజి పిలుపునిచ్చిన ‘విదేశీ వస్తు బహిష్కరణ’లో భాగంగా తాను కొనుగోలు చేసిన చీరల్ని సైతం తగలబెట్టేసింది. ఈ విధంగా స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఈమె చేసిన సాహసాలను గాంధీజి మెచ్చుకుని, ఆమెని మెచ్చుకున్నారు.
1900లో మధ్యతరగతి కుటుంబలో అన్నపూర్ణాదేవి జన్మించింది. పాఠశాల విద్యలతోపాటు బెంగాలీ భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించింది. బెంగాలీ నుండి తెలుగులోకి అనేక అనువాదాలు చేసింది. తన చదువుకు అవరమైన ధనం సంపాదించుకోవడం కోసం 1917లో (తన 17వ యేట) ‘సీతారామ’ అనే పుస్తకాన్ని ప్రచురించింది.
ఆర్థికసమస్యలతో బాధపడుతున్నప్పటికీ. మహాత్మాగాంధీ ఇచ్చిన సందేశాలకు ప్రభావితమై, 1200 రూపాయల ఖరీదైన చీరలన్నీ (అమెరికా ప్రయాణం కోసం కొనుకున్నవి) తగులబెట్టేసింది. అంతేకాదు.. విదేశీవస్తు బహిష్కరణ బలోపేతం చేసేందుకు ఏలూరులో మోహన్‌దాస్ ఖద్దర్ పరిశ్రమ స్థాపించింది. స్వాతంత్య్రంపై ప్రజలకు చైతన్యం కలిపించేదుకు ఆంధ్ర దేశమంతటా పర్యటించింది. తన కార్యదీక్ష, సత్ప్రవర్తనల ద్వారా అందరి మన్ననలూ పొందింది. స్వాతంత్య్రోద్యమంలో ఆమె పోషించిన పాత్రకు ఆశ్చర్యపోయిన గాంధీ. ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.
దువ్వూరి సుబ్బమ్మ
స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన మొట్టమొదటి ఆంధ్ర మహిళ, సమాజసేవిక, స్త్రీ జనోద్దరణకు కృషి చేసిన మహిళ.
సుబ్బమ్మ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపుర మండలం ద్రాక్షారామం గ్రామంలో 1880 సంవత్సరం నవంబరు నెలలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. కాకినాడలో జరిగిన రాజకీయ సమావేశంలో పాల్గొని సుబ్బమ్మ స్వాతంత్య్రోద్యం వైపు అడుగులు వేసింది. సంపూర్ణ స్వాతంత్య్రమే లక్ష్యమంటూ అనర్గళంగా మాట్లాడింది. ఈమె 1922 సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమంలో ప్రముఖ ప్రాత వహించింది. అంతే కాకుండా ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నది. ఒక సన్నివేశంలో ఆంగ్లేయులు ఆమెను నిర్బంధించి, క్షమాణ చెబితే విడిచి పెడతా మన్నప్పుడు ”నా కాలి గోరు కూడా అలా చేయదు” అని నిస్సంకోచంగా చెప్పిన ధైర్యవంతురాలు. ఒకసారి పెద్దాపురంలో వన భోజనాల పేరుతో ఒక రాజకీయ సభ ఏర్పాటు చేశారని,అందులో సుబ్బమ్మ పాల్గొటుందని తెలుసుకున్న ఆంగ్లేయ పోలీసులు అక్కడ దాడిచేశారు. దీనితో ఆగ్రహించిన సుబ్బమ్మ వారిపై విరుచుకుపడింది. ఆమెను చూసి మిగిలిన వారు ధైర్యం తెచ్చుకొని వారు కూడా పోలీసులపై విరుచుకు పడ్డారు.
సుబ్బమ్మ మహాత్మాగాంధీ గారి ఆదేశాలపై ఖద్దరు ధరించడమేకాక, స్వయంగా నేసిన ఖద్దరు బట్టల్ని ఊరూరా తిరిగి అమ్మింది. విరాళాలు సేకరించి స్త్రీలకు విద్య నేర్పింది. వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. రాజమండ్రిలో సనాతన స్త్రీవిద్యాలయమనే బాలికల పాఠశాలను స్థాపించింది. ఈమెకు ‘దేశ బాంధవి’ అనే బిరుదు ఇచ్చారు.
– రమేష్‌చంద్ర