Home News సంపూర్ణ సమాజ సంఘటనే ధ్యేయంగా ఆర్.ఎస్.ఎస్ కృషి

సంపూర్ణ సమాజ సంఘటనే ధ్యేయంగా ఆర్.ఎస్.ఎస్ కృషి

0
SHARE

– త్రిలోక్‌

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘము (RSS) ప్రారంభించి నేటికి 98 సంవ‌త్స‌రాల‌వుతుంది. ఒక సంస్థ ఇంత సుదీర్ఘ కాలంగా మనగల్గుతున్న‌ది అంటే గొప్ప విషయమే. 1925 విజయదశమి రోజున డాక్టర్ హెడ్గేవార్ గారు ఆర్‌.ఎస్‌.ఎస్ ను ప్రారంభించారు. ఏదైనా ఒక సంస్థ ఎక్కువ రోజులు సమాజంలో ఆదరించబడుతుందంటే అది ఆ సమాజం అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంద‌ని అర్ధం.  అదేవిదంగా ఒక సంస్థ సుదీర్ఘ కాలంగా నడుస్తుందంటే ఆ సంస్థ లో వుండే అతి చిన్న కేంద్రం  బలంగా ఉండాలి ఆ చిన్న కేంద్రం ఆ సంస్థ సిద్ధాంతాన్నీ ప్రతిభింబించే విధంగా ఉండాలి. తద్వారా ఆ సమాజ వికాసానికి ఉపయోగపడ గలగాలి. అప్పుడు ఆ సంస్థ ఎక్కువ కాలం మనగల్గుతుంది. RSS అతి చిన్న కేంద్రం శాఖ.

సంఘ శాఖలలో బోధించే ముఖ్యమైన విషయమేమిటంటే – భారతదేశం ఒక హిందూ రాష్ట్రం (దేశం). వ్యక్తుల మధ్య ఉండే సంబంధాలు, వారు ప్రవర్తించే తీరుతెన్నుల ద్వారా ప్రస్ఫుటమయ్యే ఐక్యత అనే బలమైన అవగాహనతో భారతదేశం పరిఢవిల్లింది. భారతదేశ సంస్కృతి, జ్ఞానాలను ఒక పరంపరగా తరతరాలకు అందించే సంప్రదాయమున్నది. అది హిందూ సంస్కృతిగా గుర్తింపబడుతున్నది. ఈ విలువలను, ప్రతీకలను రక్షించుకోవడం, పెంపు చేయడమే అత్యంత ప్రాధాన్యంవహించే కార్యం. భారతదేశ చరిత్ర, సంస్కృతి పట్ల గౌరవం కలిగి ఉండడం, అది అనుసరణీయమైందనే భావనను వ్యాప్తి చేయడం, ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక కాలానికి తగ్గట్టుగా మలచుకోవడం దేశహితమే ప్రధానం అనే భావన అలవరుచుకోవటంలో కీలకం. భారతదేశ ఐక్యత, సమగ్రత అనే శ్రేష్టభావన దీన్నుంచే లభిస్తుంది. ఇదే అఖండ భారత్ లేదా జాతీయ సమగ్రతా భావ సందేశం. సమాజంలో కులం, మతం, ధనం ఆధారంగా తారతమ్యాలు కానీ, పక్షపాతాలుకానీ ఉండకూడదని సంఘం విశ్వసిస్తుంది. హిందూ సంస్కృతిలో ఎంతో వైవిధ్యం ఉంటుంది. అది ఒక గర్వకారణం కూడా. ఆ ప్రాతిపదికపైనే ప్రపంచ స్థాయిలో పరస్పర సహకారం, గౌరవం, శాంతి సాధించటం ముఖ్యమనే సందేశాన్నిస్తుంది సంఘం. ఈ మౌలిక సమన్వయ సూత్రాలే హిందూ రాష్ట్రానికి ఆధారం. ఇవన్నీ శాఖలో సులభంగా వివరించబడతాయి. భారతదేశ ఘనమైన వారసత్వాతం నుంచి, ప్రశస్తమైన శాస్త్రీయ అవగాహన నుండి సంఘం స్ఫూర్తి పొందుతుంది. సమాజంలో వచ్చే మార్పులన్నింటినీ సందర్భోచితంగా అన్వయించుకునే శక్తి కల్గివుంది. కాబట్టే ఆధునికంగా వుండగలుగుతున్నది. తర్వాత తరాలతో కూడా సర్దుబాటులో సమస్యలు లేకుండా సంబంధాలు దృఢపరుచుకోగల్గుతున్నది.

సమాజసేవకు ‘శాఖా పద్ధతి’ ఒక జగన్నాథ రథం వంటిది. అందరూ కలిసి లాగటం ప్రారంభించిన తర్వాత ఎవరూ దీనిని ఆపలేరు. అయితే, తన ఆలోచనలతో, విధానాలతో సమాజంపై ఆధిపత్యం చలాయించాలనే కోరిక సంఘానికి ఎన్నడూ లేదు. సమాజపు అవసరాలను గుర్తించటమే కాక స్పందించే గుణాన్ని కలిగివుంది. వ్యక్తితో వ్యక్తి పరిచయం ద్వారా మాత్రమే సంఘాన్ని నిర్మించడం, సమాజంతో కలపడం అనే ప్రక్రియ అద్భుతం. ప్రతి వ్యక్తికి ప్రత్యేక గుర్తింపు నివ్వడమే కాకుండా ప్రతి వ్యక్తినీ కలుపుకొని పోవడానికి ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతాయి. ఈ స్పష్టమైన విధానమే అన్ని వర్గాలవారు సంఘంతో కలిసిపోవడానికి బలమైన కారణమవుతున్నది. ఎలాగైతే వివిధ మార్గాలలో ప్రయాణిస్తున్న వారు వారి  గమ్యాలకు చేరేలా ట్రాఫిక్ రూల్స్ ఉపయోగపడ్తాయో, అలాగే సంఘ క్రమశిక్షణ కూడా విభిన్న వర్గాల వారు కలిసి పని చేసేలా, కలిసి ముందుకు సాగేలా చేస్తుంది. అందుచేతనే RSS సామాన్య ప్రజల సంస్థగా తయారుకాగలిగింది. ఒకరినుంచి మరొకరికి దేశంలో చాలా సహజంగా నిదానంగా  వేగంగా విస్తరించింది.

సంస్థ ఆలోచన ధోరణి  సామాన్య ప్రజల సాధారణతకు, నిరాడంబరతకు దగ్గరగా ఉంటుంది. దేశంలో, సమాజంలో మార్పు రావాలంటే   సామాన్య ప్రజల ద్వారానే సాధ్యం అని సంఘ ప్రగాఢ నమ్మ‌కం. సాధారణ ప్రజలకు అర్థమయ్యే సామాన్య అంశాలు, అవసరమైన విలువలు గురించే సంఘం ఆలోచిస్తుంది. అందుకే ఒక సారి సంఘంలో చేరిన వ్యక్తి తన జీవితాంతం స్వయంసేవక్ గా మిగిలిపోవాలని  కోరుకుంటాడు.

సంఘ ఆలోచన చాలా సరళమైనది, స్పష్టమయినది.  “మంచిగా వుండు, ఇతరులకు మంచి చేసే చర్యల ద్వారా ఆ మంచిని సమాజానికంతటికి పంచు”. అందుకే ఈ ఆధునిక కాలంలో కూడా  జీవితపు విలువలు నేర్చుకోవడం కోసం తమ పిల్లలు RSS  శాఖకు హాజరవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. స్వయంగా అనేక మంది తల్లి తండ్రులు తమ పిల్లలను శాఖకు తీసుకువచ్చి వదిలి వెళ్తున్నారు. శాఖకు వెళ్తున్న తమ పిల్లలు వారి నిజ జీవితంలో ఆచరించే మంచి నడవడిక  దేశభక్తి చూసి వాళ్ళ హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి.

సంఘం ప్రారంభించిన తొలి  నాటి నుండి నేటి వరకు అనేక మంది  దేశభక్తుల హృదయాలను గొప్ప గొప్ప సామాజిక కార్యకర్తల హృదయాలను సంఘం జయిస్తూ వచ్చింది. కుల, వర్గ, ప్రాంత  రాజకీయ పరిధులను అతిక్రమించి సంఘాన్ని ప్రారంభించిన  డాక్టర్ జీ పని తీరు ఎంతో అద్భుతం . అన్ని దృక్పధాలకు చెందిన జాతీయ నాయకులకు సంఘాన్ని పరిచయం చేయడానికి వారు  ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. నాగపూర్‌లో మొట్టమొదటి శాఖ ప్రారంభమైన మొహితేవాడ మైదానంలోని శాఖకు నాటి కేంద్ర అసెంబ్లీ స్పీకరు శ్రీ విఠల్ భాయ్ పటేల్ సందర్శించి “ఇంతవరకు ఎక్కడ చూసినా చైతన్యం లేని సంస్థలే నాకు కనిపించాయి, కానీ ఇక్కడ మాత్రం దేశభక్తి ప్రపూరితులు, సాహనశీలురైన ధీరులను మొదటిసారిగా చూస్తున్నాను” అని ప్రశంసించారు. ఆదే విధంగా 1933లో నాగపూర్‌లో జరిగిన మహారాష్ట్ర సాహిత్య సమ్మేళనానికి అధ్యక్షత వహించిన శ్రీ కృష్ణాజీ ప్రభాకర ఖాదిల్కర్ తన కార్యక్రమాల్లో కొంత తీరిక చేసుకొని మరికొందరు సాహితీవేత్తలతో పాటు వచ్చి సంఘ తరుణ శిబిరాన్ని సందర్శించి “మేము పదాల మధ్య కొట్టుమిట్టాడే రచయితలం, ఇక్క‌డ  మాకు కనిపిస్తున్నది సజీవమైన దైవీశక్తి” అన్నారు.  అదే పరంపరను నేటికి  కొనసాగిస్తూ సంఘం నిర్వహించే కార్యక్రమాలలో అనేక మందిని ఆహ్వానిస్తూ వస్తుంది. 2016 జనవరి 3న పూణేలో “శివశక్తి సంఘం” పేరుతో సంఘం ఒక పెద్ద  కార్యక్రమాన్ని నిర్వహించింది. సమాజంలో ఉన్న వివిధ వర్గాల వారిని నుండి అనేక మంది ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 80,554 మంది గణవేషధారులైన స్వయంసేవకులు’, కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘ సర్ సంఘచాలక్ మోహన్ జీ భగవత్  గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమాన్నీ చూడడానికి వచ్చిన స్త్రీలు పురుషులు కలిపి  1,58,772 మంది పాల్గొన్న అతి పెద్ద సభ. ఈ సభలో విభిన్న సంప్రదాయాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. పూణేలోని మహారాష్ట్ర కాస్మోపాలిటన్ ఎడ్యుకేషన్ సొసైట్ కార్యదర్శి లతీఫ్ మగ్దుం, పూర్వ వైస్ ఛాన్స్లర్ డా॥ ఎస్.ఎన్. పఠాన్, ఇస్లామిక్ రచయిత, పండితుడైన అనీష్ చిస్తే, ముంబైలోని విల్సన్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ॥ అన్నా ప్రతిమా జి. నికెల్దే లాంటి విద్యావేత్తలను, పండితులను, కాలేవాడి మదర్సా ట్రస్టీ అయిన గుల్జార్ షేక్, పూణే దపోడికి చెందిన మౌలానా షకీయుద్దీన్, పూణె రవివార్పేట్ మౌలానా షౌకత్, ఫాదర్ ఫ్రాన్సిస్ డెబ్రిటో  సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతీరావు ఫులే కుటుంబ  4వ తరం వారసుడు 43 ఏళ్ళ స్వయంసేవక్ నితిన్రాంచంద్ర ఫులే” లాంటి గొప్ప గొప్ప వాళ్ళు అందరూ  హాజరయ్యారు. అతిథులందరూ RSS చేస్తున్న కార్యక్రమాల పై , ఎన్నో ప్రశంసలు కురిపించారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో సంఘం నిరంతరం మంచి సంబంధాలు కలిగిఉంటుంది.

సంఘ ఆలోచన న ప్రకారంగా “హిందూ” అనే శబ్దం ఏ మతానికీ సంబంధించింది కాదు, అది భారత జాతీయతకు సంబంధించినది. అది అందరిని కలుపుకుని పోయేది. అన్ని వర్గాల వారిని, అన్ని విశ్వాసాల వారిని ఒక ఆత్మీయ ఆలింగనంలో కలిపివుంచే ఒక మహత్తర శబ్దం. RSS దృష్టిలో సామాజిక  మార్పు అనేది దీర్ఘకాలిక ప్రక్రియ, అది సమాజం యొక్క  సంసిద్ధత, సమాజ వాస్తవిక అంచనా ఆధారంగా జరగాలి. అప్పుడే మార్పు స్థిరంగా ఉంటుంది. అందుకే ఆకస్మిక, యాదృచ్ఛిక మార్పులను సంఘం  విశ్వసించదు. సంఘ కార్యకలాపాలన్నీ ప్రణాళికాబద్దంగా, అనుభవంతో కూడిన మార్గదర్శనంతో, విశ్వాసంతో, వాస్తవిక ఆచరణాత్మక విధానంతో కూడి ఉంటాయి. సంఘానికి బయట చాలామంది తమ ఆసక్తి మేరకు సమాజం కోసం, దేశం కోసం ఏదో చేయాలనే తపనతోనే ఉంటారు. కానీ చాలాసార్లు ఒక వేదిక దొరకదు. సంఘంలో అలాంటి వేదికలు చాలా ఉన్నాయి. తమ వృత్తిని, తాము ఉంటున్న ప్రదేశాలను వదలకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమాజ కార్యం చేయవచ్చు. చాలా మంది రాజకీయాలలోకి రాకుండా సమాజంలో స్పష్టమయిన, అర్థవంతమయిన మార్పు రావాలనే తపనతో పని చేస్తుంటారు, అలాంటి వారికి సంఘం ఒక మంచి కార్యరంగం. వారు సంఘంలో, దాని అనుబంధ సంస్థలలో నిజాయితీగా జరుగుతున్న మంచి పనులను చూసి తమ కార్యానికి అనువైన క్షేత్రంగా సంఘాన్ని ఎంచుకుంటున్నారు. ఈ కార్యానికి అనుకూలమైన వాతావరణాన్ని నిర్మించడానికి అవసరమైన కార్యకర్తలను తయారుచేసేందుకు సంఘ పనిచేస్తోంది. సంఘ  కార్యకర్తలు చేస్తున్న కార్యక్రమాలు సమాజంలో చూపుతున్న ప్రభావాన్ని బట్టి మనల్ని, మన కుటుంబాలను, దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఆనందమయంగా మార్చగలిగిన మార్గం సంఘ శాఖ అని ఋజువవుతోంది. ప్రస్తుత కాలపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మనమంతా ఈ పవిత్ర, ఉన్నత కార్యంలో  మన భాగస్వామ్యం పెరగాలి. భారతదేశపు మూల తత్వమే RSS సిద్ధాంతం. అది క్రింది శ్లోకం పై ఆధారపడి ఉంది.

ఓం సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయా
సర్వే భద్రాణి పశ్యంతు
మాకశ్చిద్ దుఃఖ భాగ్భవేత్ఓం
శాంతిః శాంతిః శాంతిః
ఓం, అందరూ సుఖంగా ఉందురుగాక, అందరూ ఆరోగ్యంగా ఉందురు గాక, అందరూ శుభప్రదమైనవే జూతురు గాక, ఎవ్వరూ ఏవిధంగాను బాధపడకుందురు గాక.. ఓం శాంతి శాంతి శాంతి….