Home Telugu Articles ఘనమైన వన జాతర – మేడారం సమ్మక్క సారక్క జాతర

ఘనమైన వన జాతర – మేడారం సమ్మక్క సారక్క జాతర

0
SHARE

తెలంగాణా కుంభమేళాగా పేరొందిన మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. అభయారణ్యం జనారణ్యంగా మారిపోతుంది. కొన్ని శతాబ్దాల నుంచి భక్తులు తండోప తండాలుగా ఆ గిరిజన తల్లులను కొలవడానికి వస్తూనే ఉన్నారు. ప్రతి రెండు సంవత్సరాకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి మనం కూడా తెలుసుకుందాం.

తెలంగాణా రాష్ట్రంలోని పూర్వపు వరంగల్‌ జిల్లా, ప్రస్తుత ములుగు జిల్లా తాడ్వాయి మండంలం  మేడారంలో ఈ జాతరని నిర్వహిస్తారు. ప్రతి రెండు సంవత్సరాకు ఒకసారి మాఘపౌర్ణమికి గిరిజన సంప్రదాయం ప్రకారం జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. ఈ జాతరను చూడడానికి మన రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. 1996 లో ఈ జాతరని అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది.

ఇక ఈ జాతరకు సంబంధించిన చరిత్రను పరిశీలిస్తే పగిడిద్దరాజు, సమ్మక్క భార్యాభర్తలు, వీరికి సారక్క, జంపన్న, నాగులమ్మ సంతానం, కాకతీయులతో జరిగిన యుద్ధంలో సారక్క, నాగులమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు చనిపోతారు. జంపన్న అక్కడ ఉన్న సంపంగ వాగులో దూకి చనిపోతాడు. అందుకే అక్కడ ఉండే వాగుకు జంపన్న వాగు అని పేరు. ఇక సమ్మక్క కాకతీయుతో యుద్ధం చేస్తూ రక్తపు ధారతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలకల గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యములోనే అదృశ్యమౌతుంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కాని ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుము గల భరిణె లభించినది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ద పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

అయితే కాకతీయుల దాడికి మరొక కథనం, కారణం చెపుతారు. తుగ్లక్‌ సేను ఈ ప్రాంతంపై దాడికి వస్తున్నప్పుడు ఈ విషయాన్ని కాకతీయ రాజుకు తెలియజెప్పి వారిని తుగ్లక్‌ సేనల్ని ఎదుర్కొనేందుకు పగిడిద్దరాజు సిద్ధమవుతుంటాడు. అయితే ఈ సమాచారం అందని కాకతి ప్రతాప రుద్రుడు పగిడిద్దరాజు స్వతంత్రం ప్రకటించు కోవాలనుకుంటున్నాడని పొరబడి తన సేనల్ని పంపుతాడు. ఒకవైపు తుగ్లక్‌ సేను, మరో వైపు కాకతి సేను. ఆ యుద్ధంలో పగిడిద్దరాజుతో సహా అంతా వీరమరణం పొందుతారు. ఇలా ఒక హిందూ రాజు మరొక హిందూ రాజుపై పొరపాటును దాడి చేయడం జరిగిందని కొందరు చరిత్రకారులు చెపుతున్నారు. 

అమ్మవారి జాతర మండలమెరిగే. గుడిమెలిగే. అమ్మవారి రాకలాంటి మూడు ఘట్టాతో జరుగుతుంది. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలకల గుట్టలో భరిణె రూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతని గద్దెపై ప్రతిష్టించే సమయంలో భక్తులు పూనకంతో ఊగి పోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతను ఇద్దరినీ తిరిగి యధా స్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యముగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత.

సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు. కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజంతా కలిసి జరుపుకుంటున్నారు. కోరినకోర్కెలను తీర్చే తల్లిగా ప్రజలు వారిని భావిస్తారు. వారి శౌర్యపరాక్రమాను కీర్తిస్తూ తమని చల్లగా చూడమని వేడుకుంటారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి బెల్లాన్ని సమర్పించడం. అదే అమ్మవారి ప్రసాదంగా భావిస్తారు. కోరికలు తీరిన భక్తులు తమ బరువుకు తగినంత బెల్లాన్ని (బంగారం) తూచి అమ్మవార్లకు సమర్పిస్తారు. ప్రజలంతా పేద, ధనిక బేధం లేకుండా ఎవరికి తోచిన రీతిలో వారు భక్తిశ్రద్ధతో జరుపుకునే ఈ జాతర సమాజ సమానత్వానికి, సమాజ ఐచ్చికతకు ఒక నిదర్శనం.