భారతీయ హిందూ కుటుంబ వ్యవస్థతోనే ఆత్మీయ సమాజ నిర్మాణం అవుతుందని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీ దేవేందర్ జీ అన్నారు.
వరంగల్ విభాగ్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు కాళేశ్వరంలోని శ్రీ ఆది ముక్తీశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సహల్ కార్యక్రమంలో పాల్గొన్న ఖండ ఆపై స్థాయి కార్యకర్తల కుటుంబాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. హిందుత్వానికి ఆధారం కుటుంబ వ్యవస్థ అని, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్లనే ప్రపంచంలోని అనేక దేశాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఈ పరిస్థితి మన దేశంలో కూడా మొదలైందని, అన్నదమ్ముల మధ్య ప్రేమ, ఆప్యాయతలు తగ్గిపోతున్నాయని, భార్యాభర్తల మధ్య అనురాగం కరువు అవుతుందన్నారు. భౌతిక సుఖాలే సర్వస్వం అనే భావన భారతీయ సమాజంలో కూడా క్రమక్రమంగా పెరుగుతోందన్నారు. ఆస్తుల కోసం తల్లిదండ్రులను అనాధాశ్రమాలలో చేర్పించే వారు ఎక్కువయ్యారని, మన అలవాట్లు, ఆచార వ్యవహారాలు ,చదువు ఈరోజు మన సంస్కృతికి వ్యతిరేకంగా తయారయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
భారతీయ కుటుంబ వ్యవస్థ నిలదొక్కుకోవాలంటే భజన్, భోజన్, భాష ,భూష ,భవన్, బ్రమన్ అనే ఆరు విషయాలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని మార్గదర్శనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ .ఎస్. ఎస్ వరంగల్ విభాగ్ సంఘచాలక్ మాననీయ శ్రీ చిలకమారిసంజీవ, వరంగల్ మహానగర్ సహ సంఘచాలక్ మాననీయ డాక్టర్ బందెల మోహన్ రావు పాల్గొన్నారు.
వరంగల్ విభాగ్ లోని 129 మంది ఖండ ఆపై స్థాయి కార్యకర్తల 450మంది కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన, ఆ తరువాత కన్నెపల్లి పంప్ హౌస్ చివరగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయ సందర్శనతో సహల్ ముగిసింది.