‘సంస్థానాల సమస్య ఎంత జటిలం అయ్యింది అంటే కేవలం నువ్వు మాత్రమే వాటికి పరిష్కారం చేయగలవు’ అని మహాత్మా గాంధీ సర్దార్ పటేల్ తో అన్నారు. బ్రిటిష్ వారు భారత దేశాన్ని వదిలి వెళుతూ 550 పైగా స్వతంత్ర సంస్థానాల సమస్యను ఇచ్చిపోయారు. అత్యంత క్లిష్టమైన అలాంటి సమయంలో సర్దార్ పటేల్ ఒక పోరాట యోధునిలా నిలబడ్డారు. ఉక్కు మనిషి సర్దార్ పటేల్ లో రాజకీయ సూక్ష్మ బుద్ధి ఒక పార్శ్వం అయితే, కార్యాన్ని సాధించడానికి కావలసిన చతురత మరో పార్శం. వాటితోనే ఆయన 500 పైగా ఉన్న చిన్న చిన్న సంస్థానాలను ఏకీకృతం చేశారు.
భారత రాజ్యాంగంలోని మొదటి అధిరకరణం ప్రకారం, ‘ఇండియా అంటే భారత్ , రాష్ట్రాల యూనియన్”. బ్రిటిష్ వలస రాజ్య పతనం తరువాత రాజకీయంగా దేశ ఐక్యతను సాధించడంలో సర్దార్ పటేల్ ను మించిన వారు ఎవరు లేరు అని అనవచ్చు.
1947లో స్వాతంత్రానికి పూర్వం దేశంలోని 48 శాతం భూభాగం, 28 శాతం జనాభాతో 555 సంస్థానాలు ఉండేవి. చట్టపరంగా అవి బ్రిటిష్ ఇండియా లో భాగం కాదు, దాంతో పాటు అక్కడి నివసించే ప్రజల మీద ఎలాంటి బ్రిటిష్ అజమాయిషీ ఉండేది కాదు. కాని, నిజానికి ఆవి బ్రిటిష్ రాజ్యానికి లోబడి ఉండేవి.
ఇండియా ఇండిపెండెన్స్ ఆక్ట్, 1947, ప్రకారం భారత దేశంలోని సంస్థానాలు బ్రిటిష సార్వభౌమాదికరం నుండి విముక్తి పొందినవి. దాని కారణంగా ప్రతి సంస్థానాదిపతులకు భారత్ దేశంతో లేదా పాకిస్తాన్ తో కలవడం, లేదా సర్వ స్వతంత్రంగా ఉండే అవకాశం కల్పించబడింది. ఒక విధంగా ఈ సంస్థానాదిపతుల అందరిని బ్రిటిష్ సామ్రాజ్యానికి సామంతులుగానే పిలువవచ్చు. 1857 లో జరిగిన “తిరుగుబాటు” సమయంలో చాల సంస్థానాలు బ్రిటిష్ వారికే సహకరించాయి. భయంకరమైన ప్రళయంలో తాము కొట్టుకుపోకుండా ఈ సంస్థానలే కాపాడాయని స్వయంగా లార్డ్ కానింగ్ అంగీకరించాడు.
జూన్ 27, 1947 లో కొత్తగా ఏర్పడిన సంస్థానాల పాలనా విభాగానికి ఆయన మంత్రిగా నియమించబడినారు. వారికి తోడుగా సెక్రటరీ వి పి మీనన్ కి సంస్థానాదిపతులతో చర్చించే బాద్యతను అప్పగించారు. వారిద్దరు కలిసి ఒక విలీన పత్రాన్ని రూపొందించారు. దాని అనుగుణంగా సంస్థానాదిపతులు వారి దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార, వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వానికి దాఖలు చేస్తున్నట్టు అంగీకారిస్తూ సంతకాలు చేశారు.
భారత యూనియన్ లో విలీనం అయ్యేట్లుగా పటేల్ ఎల్లపుడు సంస్థానదిపతులులో దేశ భక్తిని మేల్కొల్పేవాడు. విలీనానికి విరుద్ధంగా వ్యవహరిస్తే సంస్థానంలో అరాచకత్వం ఏర్పడే అవకాశం ఉంటుందని హెచ్చరించేవారు. భారత దేశంలో విలీనం అయిన అట్టి సంస్థానాల కుటుంబాలకు ప్రభుత్వం తరుపున కొంత రాజ భరణాన్ని ఇవ్వడం అనే నూతన విధానాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది.
సంస్థానాలతో విలీన పత్రాలపై ఒప్పందం గురుంచి జరిగిన చర్చలు ఉత్కంఠభరితంగా సాగినవి. వ్యవహార నీతికి సంబందించిన అన్ని ప్రయోగాలు ఉపయోగించడం జరిగింది. దేశ ఐక్యతను సాధించే క్రమంలో రాజ్యాంగ పరమైన చర్చలు, ప్రయోజనాలు, దేశభక్తి తట్టి లేపడం, హెచ్చరికలు, ఆఖరికి సైనిక బలాల ప్రయోగం లాంటివి కూడా జరిగినవి.
నిజాం పాలనలోని హైదరాబాద్ – ఆపరేషన్ పోలో
గోవాలోని పోర్చుగీస్, పాకిస్తాన్ సహకారంతో హైదరాబాద్ సంస్థానం ఆయుధాలు సమకూర్చుకోవడం లాంటివి, మత కల్లోలాలు సృష్టించడం పరిస్థితిలు విషమ స్థాయికి చేరడం ఆందోళన కలిగించిన అంశాలు. పాకిస్తాన్ కు అనుకూలంగా ఉండటానికి హైదరాబాద్ నిజాం మొగ్గు చూపడం, పాకిస్తాన్ సహకారంతో హైదరాబాద్ ఆయుధ సంపత్తి ని పెంచుకొనే ప్రయత్నాలు భారత ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. హైదరాబాద్ సంస్థానం, భారత మధ్య విలీన చర్చల సమయంలో విలీనంపై సర్దార్ పటేల్ మాటలు “స్వతంత్ర హైదరాబాద్ అంటే భారత్ హృదయంలో పుండులాంటిది. దాన్ని శాస్త్ర చికిత్స ద్వారానే నిర్మూలించాలి”. బల ప్రయోగం నిర్ణయం అయిన తరువాత దానికి ఆపరేషన్ పోలో గా నామకరణం చేశారు. సెప్టెంబర్ 13 నుండి 18 వరకు అంటే కేవలం 5 రోజుల్లో యుద్ధం ముగిసినప్పటికీ అది ఎంతో కీలకమైనది. దానికి కారణం శక్తివంతమైన హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయడమే.