Home Telugu Articles పోర్చుగీసు ఆధిపత్యాన్ని అంతం చేయడంలో స్వయంసేవకుల బలిదానం

పోర్చుగీసు ఆధిపత్యాన్ని అంతం చేయడంలో స్వయంసేవకుల బలిదానం

0
SHARE

బ్రిటిష్ వారు వైదొలిగినంత మాత్రాన స్వాతంత్ర్య పోరాటం ముగిసిపోలేదు. 1954 ఆగస్ట్ 2వ తేదీన మిగిలి ఉన్న పోర్చుగీసు స్థావరలైన దాద్రా, నగార్ హవేలీలలోనికి వంద మంది సంఘ స్వయంసేవకులు జొరబడ్డారు. పుణే సంఘచాలక్ స్వర్గీయ వినాయకరావు ఆప్టే నేతృత్వంలో ఈ దాడి జరిగింది. ఆ బృందంలో అనేకమంది ప్రముఖులైన  సంఘకార్యకర్తలు ఉన్నారు. గొరిల్లా వ్యూహాన్నిరూపొందించి, సెల్వాసాలోని ప్రధాన పోలీసు కేంద్రకార్యాలయంపై  దాడి చేసి, అక్కడి 175 మంది సైనికులు భేషరతుగా లొంగి పోయేటట్లు చేశారు వారు. జాతీయ త్రివర్ణ పతాకం ఎగరవేశారు. ఆదే రోజన ఆ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారు. ఆ చారిత్రాత్మక సంఘటన రజతోత్సవం సందర్భంగా 1979 ఆగస్ట్ 2వ తేదీన సెల్వాసా ప్రజలు ఆ వందమంది స్వాతంత్ర్య వీరులను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. 1987లో  మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వారిని స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించి సత్కరించింది.

అప్పటికి ఇంకా గోవాపై పోర్చుగీసువారు ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది.  1955లో పనాజీ సచివాలయం మీద మొట్టమొదటి సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వ్యక్తి గోవాలో అధ్యాపకునిగా పనిచేస్తున్న ఒక స్వయంసేవక్. 1961 లో గోవా విముక్తం’ అయిన తరువాత కూడా మొత్తం 17 సం||లపాటు ఆయన లిస్భన్ జైలులో ఉన్నాడు. 1955లో గోవా విముక్తికై అన్ని రాజకీయపక్షాలు కలిసి సాగించిన జాతీయపోరాటంలో స్వయంసేవకులు ప్రధానపాత్ర నిర్వహించారు. దేశం నలుమూలలనుండి  వెల్లువలా వస్తున్న సత్యాగ్రహాలకు గోవా  సరిహద్దు వెంబడి భోజన వసతి సమకూర్చే కార్యాన్ని స్వయంసేవకులు తమ భుజస్కంధాలపై వెసుకున్నారు. సంఘానికి, జనసంఘనికి చెందిన ప్రముఖ కార్యకర్తలు అనేక సత్యాగ్రహ బృందాలకు నాయకత్వం వహించారు. వారిలో అనేకులు తుపాకి గుండ్ల  దెబ్బలుతిన్నారు. పోర్చుగీసు జైళ్ళలో అమానుష చిత్రహింసలను అనుభవించారు.

సత్యాగ్రహ బృందాలకు నాయకత్వం వహించిన ప్రముఖ స్వయంసేవకులలో మధ్యభారత్ బృందానికి నాయకత్వం వహించిన ఉజ్జయినికి చెందిన రాజాభావు మహంకాళ్ ఒకరు. సరిగ్గా సరిహద్దుల్లోనే పోర్చుగీస్ పోలీసులు తమ తుపాకులు, తూటాలతో ఈ సత్యాగ్రహాలకు ‘స్వాగతం’ పలుకడానికి సిద్దంగా ఉన్నారు.  రాజాభావు గోవా సరిహద్దువైపు సాగుతున్నంతలోనే సత్యాగ్రహుల మొదటి మూడు వరుసలపై కాల్పులు జరిగాయి. వారు గాయపడి నేలకూలారు. మూడు వరుసలలోఉన్న సాగర్ కు చెందిన సాహసి సహోదరాదేవి గాయపడి క్రిందపడిపోగానే  రాజాభావు ఆమె చేతులోని త్రివర్ణపతకాన్ని తానందుకుని ‘భారత మాతాకీ జయ్’ అని గర్జిస్తూ ముందుకు దూకారు. అంతలోనే దూసుకువచ్చిన ఒక బుల్లెట్ వారి కంటిని చీల్చుకుపోగా వారు నేలకూలారు. స్ప్రుహలో ఉన్న కొద్దిక్షణాలలోనే పతాకాన్ని, గాయపడిన సత్యగ్రహులను జాగ్రత్తగా చూసుకోమని ఇతరులకు ఆదేశాలు ఇచ్చారు. మరికొన్ని నిమిషాలలోనే మాతృభూమి స్వాతంత్ర్యసాధనా కార్యంలో అజరామరమైన ఘనతను సాధించుకున్న అమర వీరుల వరుసలో వారు కూడా చేరిపోయారు.

(ఆర్.యస్.యస్  ‘ఆకృతి దాల్చిన ఆదర్శం’ పుస్తకం నుండి  )