ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఓ పాస్టర్ నిరుద్యోగులను నిలువునా ముంచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదుగురు నిరుద్యోగుల వద్ద ఏకంగా 27 లక్షలు కాజేసి ఇప్పుడు తనకేమీ తెలియదని బుకాయిస్తున్నాడు. దీంతో మనస్థాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ మండలంలోని అవంతిపురం గ్రామానికి చెందిన చిలమెల్ల పూలమ్మ ప్రతి ఆదివారం ప్రార్ధన చేసేందుకు పట్టణంలోని సుందర్ నగర్ చర్చి కి వెళ్ళేది. ఈమెకు కళ్లు లేని కుమార్తె ఉంది. చర్చి పాస్టర్ గా ఉన్న ఆనంద్ పాల్ ఆమెను మాయమాటలతో నమ్మించాడు. మీ కుమార్తెకు కంటి ఆపరేషన్ చేయించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పాడు. అది విశ్వసించిన పూలమ్మ భర్త మరణించడంతో వచ్చిన డబ్బుతో పాటు తను కూలి చేసి కూడబెట్టిన ఏడు లక్షల రూపాయలను రెండు దఫాలుగా ఆనంద్ పాల్ కు ముట్టజెప్పింది. దానికి ఆనంద్ పాల్ ప్రామిసరీ నోటు కూడా వ్రాసిచ్చాడు. మూడేళ్లు గడచినా ఉద్యోగం రాకపోవడంతో ఇటీవల పూలమ్మ పాస్టర్ ను నిలదీసింది. రేపు మాపు అంటూ కొంతకాలం వెళ్ళదీసిన పాస్టర్ చివరకు “నా దగ్గర డబ్బులు లేవు. ఏం చేసుకుంటావో చేసుకో” పొమ్మన్నాడు.
ఈ విషయమై ఫిబ్రవరి 29న బాధితురాలు మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఆనంద్ పాల్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన పూలమ్మ పురుగుల మందు తాగింది. ఆమెను గుర్తించిన కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అయితే ఈ సంఘటన తర్వాత పాస్టర్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రాసాగాయి. పూలమ్మ దగ్గరే కాకుండా పట్టణానికి చెందిన బంటు శివ, ధన్వాడ భాస్కర్, బంటు హరి, మల్లె బోయిన మురళి అనే నిరుద్యోగుల వద్ద కూడా ఒక్కొక్కరి నుండి 5 లక్షల చొప్పున మొత్తం 20 లక్షలు గుంజినట్లు బాధితులు పేర్కొంటున్నారు. జగదీష్ అనే వ్యక్తిని ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా పాస్టర్ ఆనంద్ పాల్ నిరుద్యోగులకు పరిచయం చేసి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సదరు పాస్టర్ ఆనంద పాల్ పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసు శాఖను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
VSKANDHRA సౌజన్యంతో …
మరిన్ని వార్తలు, విశేషాల కోసం Samachara Bharati యాప్ ను క్లిక్ చెయ్యండి.