Home Telugu Articles దేశ విభజన విషాద గాథ – II

దేశ విభజన విషాద గాథ – II

0
SHARE

—  హెచ్. వి. శేషాద్రి

16ఆగస్ట్1946– ప్రత్యక్షచర్య  

జిన్నా హిందువులమీద జిహాద్ ప్రకటించాడు. సింద్, బెంగాల్ ప్రదేశాల్లో/రాష్ట్రాల్లో, 16ఆగస్ట్ సెలవు ప్రకటించి మరీ, జిహాదీ మూకలు హిందువులను దొరికినవారిని దొరికినట్టే ఊచకోతకి గురిచేసారు. ఈ రాష్ట్రాల్లో, 70%పొలీసులు ముస్లిములైనందువల్ల, వారు ఆ మూకలతో కలిసిపోయారు. బెంగాల్లో ప్రధాని సుహ్రావర్ది పాల్గొన్న సమావేశంలో, వక్తలందరూ హిందువులపై జిహాద్ చేయమని పిలుపునిచ్చారు. హిందువులు ఎదురుతిరగగానే, సైన్యాన్ని రప్పించారు. ఒక్క కలకత్తా మహానగరంలోనే 10000 స్త్రీపురుషులని చంపేశారు, 15000మంది గాయపడ్డారు, 1లక్షకిపైగా ప్రజలు నిర్వాసితులయారు.

తరువాత నౌఖలిలో మారణకాండ మొదలు పెట్టారు. ఒక విదేశీ వనిత మిస్ మ్యురల్ లెస్టర్ 6నవంబర్1946 ఒక క్యాంపు నుంచి వ్రాసింది, “స్త్రీలు తమ భర్తలు హత్యచేయబడటం చూడడమే కాక, ఆ స్త్రీలనే బలవంతంగా మతమార్పిడి చేసి, వారి భర్తలను చంపినవారితోనే వారికి పెళ్లిళ్లు చేసారు. ముల్లాలు, మౌల్వీలు జిహాదీలతో పాటు ఉండి, మతమార్పిడిలు చేయించారు”. సుచేత, ఆచార్య కృపలానీలు గవర్నర్ ను కలిసి సామూహిక హత్యలు, మతమార్పిడుల గురించి చెప్పగా, ముస్లిముల కన్నా హిందూ స్త్రీలు అందంగా ఉంటారు కాబట్టి అది సహజమే అన్నాడు.

ఇట్లా ధ్వంసమైన ప్రదేశాలకు మొదట చేరుకున్నవారు శ్యామప్రసాద్ ముఖర్జీ. ఆయన హిందువుల రక్షణ కోసం పాటుపడ్డారు. అల్లర్లు బెంగాల్ నుంచి బిహార్ కు పాకాయి, అయితే వ్యత్యాసం ఏమిటoటే, బెంగాల్ ప్రభుత్వం జిహాదీలకు తోడ్పడగా, బిహార్లో అలా జరగలేదు. లీగ్ `ప్రత్యక్షచర్య’ కాశ్మీరుకి, NWFPకి చేరుకుంది. ఖాల్సా అనే గ్రామంలో, సుదీర్ఘ పోరాటం తరువాత, హిందూ-సిక్ఖు పురుషులందరూ హత్యకు గురికాగా, శ్రీమతి లాజవంతి ముందు నడవగా తమ మానరక్షణకై 74మంది స్త్రీలు బావిలో దూకి ఆత్మాహుతి చేసుకున్నారు.

చర్చిల్-జిన్నా కూటమి

చర్చిల్-జిన్నాలు మారుపేర్లతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపారు, అవి1982లో బయటపడ్డాయి. ఇంగ్లాండ్ రాణి, రాజు పాకిస్తాన్ ఏర్పాటుకి సుముఖంగానే ఉన్నారని తన ఇంగ్లాండ్ యాత్రలో జిన్నా గ్రహించాడు.

22మార్చ్1947, మౌంట్.బాటన్ భారత్ ఆగమనం

గాంధీగారు మౌంట్ బాటన్ తో తమ మొదటి సమావేశంలోనే దేశవిభజన వ్యతిరేకించారు. కాబినెట్ రద్దు చేసి, జిన్నా పూర్తి ముస్లిం సభ్యులతో తన సొంత కాబినెట్ ఏర్పరచుకోవచ్చని గాంధీ ప్రతిపాదించారు. కేంద్రంలో జరుగుతున్న సంఘటనలు గాంధీగారికి తెలియడంలేదని నెహ్రూ అన్నాడు. తన ప్రతిపాదనకు అంగీకారం కుదరట్లేదు కాబట్టి, తాను తప్పుకుంటానని, కాంగ్రెస్ CWCయే తదుపరి చర్చలు చేస్తుందని వైస్రాయ్ కి గాంధి లేఖ వ్రాసారు.

స్పష్టమైన విభజనతో రెండు  వేర్వేరు దేశాలు ఏర్పాటుకి తాను సుముఖమేనని సర్దార్ పటేల్ చెప్పారు, నెహ్రూ, రాజేంద్రప్రసాద్ విభజనకి అంగీకారం తెలిపారు. ముస్లిముల ప్రయోజనం దృష్ట్యా గాంధీగారి ప్రతిపాదనే సరైనదని మౌలానా అన్నారు.

శ్యామప్రసాద్ ముఖర్జీ పశ్చిమబెంగాల్, తూర్పు పంజాబ్ భారత్ లో ఉంచడానికి, హిందువులను జాగృతపరచడానికి ఎంతో ప్రయాసపడ్డారు. ముస్లింలీగ్ లాహోర్ తీర్మానానికి అనుగుణంగానే ఈ సూచన ఉందని రాజేంద్రప్రసాద్ జిన్నాకి గుర్తు చేసారు. ఇంతలోనే, తూర్పు-పశ్చిమ పాకిస్తాన్ ను కలుపుతూ, 800మైళ్ళ కారిడార్/దారి ఉండాలని జిన్నా కొత్త డిమాండ్ లేవనెత్తాడు.

వి.పి. మీనన్ విభజనకి ముసాయిదా ప్రణాళిక తయారు చేసారు. కొద్దిరోజులముందే గాంధీగారు వైస్రాయ్ మౌంట్ బాటన్ తో, “కాంగ్రెస్ నాతో లేకపోవచ్చు, కానీ భారత ప్రజలు నాతో ఉన్నారు” అన్నారు. తరువాత ఆయనే ఒక బహిరంగ సభలో, “వైస్రాయ్ కి విభజన ఇష్టంలేదు, కానీ హిందూ-ముస్లిములు కలిసి జీవించలేకపోతున్నారు కాబట్టి, తప్పనిససరై ఒప్పుకుంటున్నారు” అన్నారు. “నన్ను ముక్కలు చేసి తరువాత దేశాన్ని ముక్కలు చేయండి” అన్న ఆయన ఆ సంగతి గుర్తు చేస్తే, “ప్రజాభిప్రాయం నాకు వ్యతిరేకంగా ఉంటే, నేను బలవంతంగా దాన్ని మార్చగలనా?” అన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా ఆజాద్, విభజన తాత్కాలికమే అనే ఆశతో, విభజన తీర్మానం చేస్తున్నానని అన్నారు. పురుషోత్తం దాస్ టాండన్ చివరిదాకా కూడా, “ఇంకా కొంతకాలం బ్రిటిష్ పాలన ఉంటే నష్టమేమీ లేదు, కాని మన లక్ష్యమైన అఖండ భారత్ ను మనం పోగొట్టుకోలేము. అవసరం వస్తే బ్రిటిషువారితోపాటు, లీగ్ తో కూడా పోరాడుదాము, దేశాన్ని రక్షించుకుందాము” అని కరతాళధ్వనుల మధ్య అన్నారు. కానీ గాంధీగారు, విభజన వైపే మొగ్గు చూపారు. గాంధీగారు తన ప్రసంగంలో “సమయముంటే నేను మాత్రం ఒప్పుకుంటానా? వేరే ప్రత్యామ్నాయ నాయకత్వం లేనప్పుడు, ఇప్పటి కాంగ్రెస్ నాయకత్వాన్ని సవాలుచేసి, ప్రజలకు కాంగ్రెస్ పైన ఉన్న నమ్మకాన్ని చెడగొట్టలేను. ఈ రోజు నాకా శక్తి లేదు, ఉంటే తిరుగుబాటు చేసేవాడిని” అన్నారు. అయితే నెహ్రు `మోస్లి’తో అన్నమాట మనం గుర్తు తెచ్చుకోవాలి, `గాంధీగారు చెప్పిఉంటే, పోరాడుతూనే ఎదురుచూస్తూ ఉండేవాళ్ళం.’

త్వరిత నిర్ణయం వెనుక కారణం – తిరుగుబాటు భయం

దేశవిభజన జూన్ 1948 నుంచి ఆగస్ట్1947కి, అంటే ఏకంగా పది నెలలు ముందుకి జరిపారు. దాదాపు భారతీయ అధికారులందరూ విభజనకి వ్యతిరేకులే. భారతీయ నావికాదళంలో జరిగిన తిరుగుబాటుతో, దేశంలో ఉద్రేకపూరితమైన వాతావరణం ఉంది. మోస్లీ వ్రాసారు – “మే1947లో భారతవిభజన ప్రకటించి, జూన్ దాకా సైన్యవిభజన మాట ఎత్తలేదు.  జూన్ చివరిదాకా `సరిహద్దు కమిషన్’ను ఏర్పాటు చేయలేదు. స్వాతంత్ర్యం వచ్చిన రెండు రోజులు తర్వాత దాకా, ప్రజలు ఎటువైపు ఉంటారో వారికి తెలియనియ్యకుండా అంధకారంలో ఉంచారు.”

రాడ్ క్లిఫ్ సరిహద్దు కమిషన్

17ఆగస్ట్ దాకా తమ ఉత్తర్వులని ఇవ్వకుండా పొడిగించి, సమస్యను మరింత జటిలం చేసింది ప్రభుత్వం. సిరిల్ రాడ్ క్లిఫ్ తూర్పు-పశ్చిమ దిక్కులు రెండువైపులా సరిహద్దు కమిషన్ ఏక అధ్యక్షుడు. ఒకే సభ్యుడున్న కమిషన్ కి ఒప్పుకుని కాంగ్రెస్ మళ్ళీ పొరపాటు చేసింది. కమిషన్ లో ఇతర సభ్యులు ఎవరనేది కూడా గోప్యంగా ఉంచారు. ముస్లింలీగ్, నగరాల్లోని ముస్లిముల సంఖ్య గురించి తప్పుడు లెక్ఖలు చూపించింది. అసలుకంటే సంఖ్య ఎక్కువచేసి చూపింది. పంజాబ్ కమిషన్ సభ్యులు ఎం.సి.మహాజన్, తేజ్ సింగ్ `లాహోర్’ నగరం భారతదేశoలోనే ఉంటుందని ఎంత ధీమాగా ఉన్నారంటే, వారు స్వయంగా కూడా భారత్ కి వలసవచ్చే ఏర్పాట్ల చేసుకోలేదు. ముస్లిములు 25% మాత్రమే ఉన్న లాహోర్ పాకిస్తాన్ కి ఇచ్చేసారు. సాగునీటి కాలువల వ్యవస్థ, చాలా సారవంతమైన పంటభూములు, చారిత్రక సిక్ఖు గురుద్వారాలు ఉన్న మహాపట్టణం లాహోరును పాకిస్తాన్ కు బహుమతిగా ఇచ్చేసారు. ఒక్క దెబ్బతో 40%ప్రజలు నిర్వాసితులు అయ్యారు. హిందువులకి రూ.4000కోట్ల నష్టం జరిగితే, ముస్లిములు ఏమాత్రం నష్టపోలేదు. ఇదే విషాద కధ చిట్టగాంగ్ హిల్స్ కూడా జరిగింది, హిందువులు అత్యధిక సంఖ్యలో ఉన్న చిట్టగాంగ్, తూర్పు పాకిస్తాన్ కు ఇచ్చేసారు.  19%జనాభా నిష్పత్తి ఉంటే 23% భూభాగం పాకిస్తాన్ కు లభించింది.

.

మహాప్రళయం

 “ఎటువంటి రక్తపాతం, అల్లర్లు ఉండవని నేను హామీ ఇస్తున్నాను, నేను సైనికుణ్ణి, సామాన్య పౌరుణ్ణి కాదు”అంటూ మౌంట్ బాటన్  ప్రగల్భాలు పలికాడు. భారతచరిత్రలో ఎన్నడూ ఎవరూ చూడని మహాప్రళయం సంభవించింది. కాంగ్రెస్ నిరాకరించిన జనాభా బదలాయింపు మొదలైంది. జనం కుటుంబాలతో మూటాముల్లె సర్దుకుని ఎడ్లబండ్లలో, కాలినడకన ప్రయాణమై వస్తుంటే, వేలాది మందిని చంపేసి, దోపిడీ చేసారు.  ప్రపంచచరిత్రలో అంతకుముందు కనీవినీ ఎరుగని అతిపెద్ద జనాభా మార్పిడి ఇది. రాజధాని ఢిల్లీలో అతి ప్రమాదకర పరిస్థితి ఉత్పన్నమౌతోంది. ఢిల్లీలో ప్రతి 4వ వ్యక్తి, పాకిస్తాన్ నుంచి భారతానికి  వచ్చిన హిందూ లేక సిక్ఖు కాందిశీకుడే. అలా దిక్కులేనివాళ్లైన వారు ముస్లిముల మీద, కాంగ్రెస్ మీద ఆగ్రహంగా ఉన్నారు. 

వారి సహాయానికి ఆర్ఎస్ఎస్

పోలీసుల్లో ఎక్కువ శాతం ముస్లిములే. ‘హిందూ అధికారులను హత్యచేసి, పాకిస్తాన్ జెండాను ఢిల్లీ ఎర్రకోట మీద 10సెప్టెంబర్1947నఎగరవేసే కుట్ర గురించి ఆర్ఎస్ఎస్ యువకార్యకర్తలు పటేల్, నెహ్రులకు సమయానికి హెచ్చరించగలిగారని నాకు తెలిసింది’ అని భారతరత్న భగవాన్ దాస్  చెప్పారు. లక్షలాది హిందువులను చంపి, మిగతావాళ్ళ మతంమార్చాలని కుట్ర జరిగింది. రూ.55కోట్లు అదనంగా పాకిస్తాన్ కు ఇవ్వాలని పట్టుబట్టి గాంధీగారు నిరాహారదీక్ష మొదలుపెట్టారు.

ఆ కాలంలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు చూపిన ధైర్యం, సేవాతత్పరత గురించి ఏ.ఎన్.బాలి ఇలా అన్నారు – “పశ్చిమ పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రతి కాందిశీకుడు, భారతలో ఎక్కడున్నా, ఆర్ఎస్ఎస్ వారికి ఎల్లప్పుడూ ఋణపడిఉంటారు. కాందిశీకులను అందరూ దిక్కులేనివారిలా వదిలేస్తే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రం ఎనలేని సహాయం చేశారు.”

విలీనం- సమీకృతం

600 రాజ్యాలు భారతరాజ్యంలో విలీనమయ్యాయి. కాశ్మీర్ ను పాకిస్తాన్ లో కలపమని మౌంట్ బాటన్, మహారాజా హరిసింగ్ కి చెప్పినా, 1947 అక్టోబర్ 17న గురూజీ గోల్వాల్కర్ కాశ్మీరును భారత్ లో విలీనం చేయమని మహారాజుని ఒప్పించారు. అక్టోబర్ 23న, జనరల్ అక్బర్ ఖాన్ సేన ముందుండి నడిపించగా, పాకిస్తాన్ తెగలు కాశ్మీరును ఆక్రమించాయి. బ్రిటిష్ సైన్యాధికారులు, మహారాజా హరిసింగ్ కు ఎదురు తిరిగి, గిల్గిట్ పర్వత ప్రాంతాన్ని పాకిస్తాన్ కు అప్పజెప్పారు. భారతీయ వాయుసేన విమానాలు దిగడానికి వీలుగా ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు సమయానికి శ్రీనగర్ విమానాశ్రయంలో మంచును తొలగించారు. నవంబర్ 21న, కాశ్మీర్ అంశాన్ని నెహ్రు ఐక్యరాజ్యసమితి (UN)కి తీసుకెళ్ళారు.

హైదరాబాద్

రజాకార్ నాయకుడు కాసిం రిజ్వీ, భారతదేశానికి- హిందువులకి వ్యతిరేకంగా విషపూరిత ప్రచారం చేసాడు. 2లక్షల రజాకార్లు, 40,000 హైదరాబాద్ రాజ్య సైన్యంలో ఉన్నవారు కలిసి దాడికి దిగారు. రజాకార్లు కమ్యూనిష్టులలో కూడా కలిసిపోయారు.  హైదరాబాద్ లోకి ప్రవేశించిన భారతీయ సేన జరిపిన `ఆపరేషన్ పోలో’ కేవలం 108గంటల్లో ముగిసింది.

ఉదయపూర్ మహారాజు వ్యక్తిత్వం

పశ్చిమాన జోధపుర్, తూర్పున ఇందోర్, భోపాల్ రాజ్యాలున్న ఉదయపూర్ రాజ్యం పాకిస్తాన్ లో కలిస్తే తప్ప  పాకిస్తాన్లో కలవాలన్న భోపాల్ నవాబు కోరిక తీరదు. ఉదయపూర్ రాజు, “నా పూర్వీకులే నా భవిత నిర్ణయించారు. వారే మెచ్చుకోలుకి లొంగిపోయి ఉంటే, హైదరాబాద్ అంత పెద్ద రాజ్యం మాకుండేది. వాళ్ళు లొంగలేదు, నేనూ అంతే; నేను భారత దేశంలోనే ఉంటాను” అన్నారు.

దేశ విభజన నిజంగా అనివార్యమా?

నావికాదళ తిరుగుబాటు మరియు భారత సైన్య విచారణల(INA)వల్ల, భారత సైన్యంలో, భారత అనుకూల స్పందన బాగా పెరిగింది.  ఇవన్నీ సర్వసైన్యాధికారి CIC క్లాడ్ ఆచిన్లెక్ ను పెద్ద సంశయంలో నేట్టేసాయి.

  • బ్రిటిష్ పార్లమెంట్`హౌస్ అఫ్ కామన్స్’లో స్టాఫోర్డ్ క్రిప్స్ మాట్లాడుతూ, “భారత్ వదిలిరాకపోతే, ప్రత్యామ్నాయంగా భారీ సంఖ్యలో సైన్యాన్ని, పాలనా యంత్రాంగాన్ని పెంచాలి. బ్రిటిష్ జాతీయ విధానం మరియు అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా అది రాజకీయంగా సులభం కాదు.”
  • INA విచారణలు,నావికాదళ తిరుగుబాటు వల్ల, భారత సైన్యంలో జాతీయ భావాల స్పందన బాగా పెరగడంతో, బ్రిటిషువారు ఏమవుతుందో అని భయభ్రాంతులయారు. ఏదేమైనా దేశాన్ని విభజించి వదిలి వెళ్లిపోవాలనే నిశ్చయానికొచ్చారు.
  • వైస్రాయ్ గా భారత్ రావడానికి ఎలా ఒప్పుకున్నాడో మౌంట్.బాట్టెన్ వివరిస్తూ, “భారతలో మనపని అయిపొయింది. అక్కడి పరిస్థితి గందరగోళంగా అధ్వాన్నంగా ఉంది, నువ్వు వెళ్లి అన్నీ ఒక కొలిక్కి తేవాలి” అని ప్రధాని చర్చిల్ అన్నారని చెప్పాడు.
  • ముస్లింలీగ్ కూడా బలహీనంగానే ఉండేది. ఢిల్లీ ముస్లిములు పటేల్ గారితో “మీరు లీగ్ కి వ్యతిరేకంగా ధృడంగా నిలబడండి, మీ వెనుక మేముంటాము, లీగ్ మరింత బలహీనపడుతుంది.ముస్లిములు కాంగ్రెస్ వైపే వస్తారు” అని చెప్పేవారు. ఎందుకంటే ముస్లింలీగ్లో మొదటినుంచి అష్రఫీలు బలంగా ఉండేవారు, వారికి నిమ్నవర్గాల స్థానిక ముస్లిములపట్ల చిన్నచూపు ఉండేది.
  • 1949 న్యుయోర్క్ నగరంలో నెహ్రూ ఒప్పుకున్నారు, “విభజనానంతర భయంకర పరిణామాలు తెలిసుంటే, విభజన అంగీకరించేవాళ్ళం కాదు.” కాంగ్రెస్ నాయకత్వం అప్పటికే పోరాటాలతో అలసిపోయింది. ముస్లిముల మధ్యనున్న విభేదాలను ఎలా రాజకీయంగా ఉపయోగించుకోవాలో కాంగ్రెస్ కి తెలియలేదు. గాంధేయ పద్ధతులు  బ్రిటిషువారితో కొంత సత్ఫలితాలనే ఇచ్చినా, ముస్లిం వేర్పాటువాదుల హిందూ-వ్యతిరేక క్రూర పైశాచిక దాడులముందు పనిచేయలేదు.

ఎందుకు మనం ఓడిపోయాము?

  1. కాంగ్రెస్ లో సైద్ధాంతిక బలం లేకపోవడం. జాతీయవాదభావం లేక, దేశం అంటే కేవలం భౌగోళిక ప్రాంతాలు, రాజకీయాలు మాత్రమే అనుకోవడం ప్రధాన కారణం.
  2. జాతీయ నిబద్ధత లేకపోవడం- స్వాతంత్ర్యం -స్వరాజ్యం ఎందుకు అనే విషయం మర్చిపోయారు. స్వాతంత్ర్య సమర స్ఫూర్తి, ఆదార్శాలు, ఆకాంక్షలు అన్నీ గాలికొదిలేశారు.
  3. అన్నదమ్ములమధ్య విబేధాలు, విభజన లాగా చూసారు. కానీ తల్లిని ముక్కలు చేస్తారా?
  4. జాతీయ సమైక్యత, సమగ్రతల కన్నా, ముస్లిం సంతుష్టీకరణ ఎక్కువైంది. హిందూ-ముస్లిం ఐక్యత లేకపోతే స్వాతంత్ర్యం అఖర్లేదు అన్నారు. దానికి బదులుగా, `మీరు మాతో కలిస్తే, మీతో పాటు; మీరు మాతో కలవకపోతే, మీరు లేకున్నా మేము ముందుకి వెళ్తాము; మీరు మమ్మల్ని వ్యతిరేకిస్తే, మిమ్మల్ని దాటుకుని వెళ్తాము’ అనే విధానం ఉండాల్సింది.
  5. ప్రఖ్యాత చరిత్రకారుడు `అర్నాల్డ్ టోయన్బీ’, “అసలు పాకిస్తాన్ ఏంటి? భారతదేశాన్ని పూర్తిగా పరాజితను చేయాలన్న 1200సంవత్సరాల ముస్లిముల కలను మొదటిసారి 20వ శతాబ్దంలో సాధించారు” అన్నారు.
  6. శరత్ చంద్ర చటర్జీ ఇలా వ్రాసారు – “అమెరికన్లు తమ స్వాతంత్ర్యం కోసం పోరాడినప్పుడు, సగంపైగా ప్రజలు బ్రిటిషువారితోనే ఉన్నారు. ఐరిష్ పోరాటంలో, నిజానికి ఎంతమంది పోరాటంలో పాల్గొన్నారు? ఎంతమంది ఏ పోరాటంలో ఉన్నారని సంఖ్య లెక్కపెట్టుకోవడంకాదు, ఆ ధ్యేయసాధనకై చేసిన తపస్సు, దాని తేజస్సు-తీక్షణతలపై తప్పొప్పుల నిర్ణయం జరుగుతుంది. ‘హిందూ-ముస్లిం ఐక్యత లేకుండా, స్వరాజ్యం లేదు అనడం’ హిందువులకి ఘోర అవమానం”.
  7. డా. రామమనోహర్ లోహియా ఇలా అంటారు, “క్షీణించిన కాంగ్రెస్ నాయకత్వం, భయంకరమైన మతఘర్షణలు, విభజనకు కారణమైనాయి. యువ నాయకత్వం ఉంటె దేశవిభజన జరిగి ఉండేది కాదు. ఆ సమయంలో ఏ ఒక్క నాయకుడు జైల్లో లేడు. విభజన కాలంలో నేను ఏమీ చేయలేదని చాలా బాధపడుతున్నాను.”
  8. 1960లో లియోనార్డ్ మోస్లితో మాట్లాడుతూ నెహ్రూ ఇలా అన్నారు – “ మేము అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నాము, అలసిపోయాము. మళ్ళి జైలుకి వెళ్ళే ఓపికలేదు. మాకు అఖండ అవిభాజిత భారతం కావాలని అడిగితే, జైలుకి వెళ్ళేవాళ్లము.” (లియోనార్డ్ మోస్లి `ది బ్రిటిష్ రాజ్’ నుంచి).

 

(భారత విభజనకి దారితీసిన ఘటనల సంక్షిప్త చరిత్ర ఇది.  హెచ్. వి. శేషాద్రిగారి ఇంగ్లీషు గ్రంథం `Tragic Story of Partition’ ఆధారం. )

 

అనువాదం: ప్రదక్షిణ

 

సౌజన్యం: https://arisebharat.com.