చైనా రాజధాని బీజింగ్ లోని తియనన్మన్ స్క్వేర్ లో 10,000 మందికి పైగా ప్రజాస్వామ్య ఉద్యమకారులను ప్రభుత్వం అత్యంత కిరాతకంగా చంపేసింది. వీరిలో ఎక్కువమంది విద్యార్థులు. తియనన్మన్ స్క్వేర్ ఘటనకు సంబంధించిన కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి –
జూన్ 3-4,1989:
– తియనన్మన్ స్క్వేర్ చైనా రాజధాని బీజింగ్ నగరం మధ్యలో ఉంది.
– తియనన్మన్ అంటే “శాంతి స్వర్గధామపు ద్వారం “ అని అర్ధం.
– 1989 లో కొన్ని వారాలపాటు నిరసన ప్రదర్శన తరువాత జూన్ 4 న చైనా దళాలు తియనన్మన్ స్క్వేర్ లో ప్రవేశించి ప్రజల మీద కాల్పులు జరిపాయి .
– కొన్ని వేల మంది చనిపోయుంటారని అంచనా.
– 10,000 మందిని అరెస్టు చేశారని అంచనా.
– ప్రదర్శనతో సంబంధం కలిగి ఉన్నారని కొన్ని డజన్ల మందిని ఉరి తీశారు.
ఘటనా క్రమం:-
ఏప్రిల్ 15,1989 – మాజీ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు హు యోబాంగ్ మరణం. కమ్యూనిజం నుండి ప్రజస్వామ్యం వైపు చైనాను నడపడానికి యోబాంగ్ కృషి చేశారు.
ఏప్రిల్ 18,1989 – కొన్ని వేల మంది విద్యార్థులు సంతాప యాత్రలో పాల్గొంటూ ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలని తియనన్మన్ స్క్వేర్ లో ప్రదర్శనలు చేశారు. ఆ తరువాత కొన్ని వారాలపాటు వేల మంది విద్యార్థులు ఈ ప్రదర్శనల్లో చేరారు.
మే 13 1989 – 100 మందికి పైగా విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. కొద్ది రోజులలోనే ఆ సంఖ్య వేలకు పెరిగింది.
మే, 19, 1989 – తియనన్మన్ స్క్వేర్ లో పదిన్నర లక్షలమంది ప్రదర్శనల్లో పాల్గొన్నారు. అక్కడకు వచ్చిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఝావో జియాంగ్ ప్రదర్శనలు వెంటనే ఆపాలంటూ నిరసనకారులను కోరారు.
మే 19 1989 – లీ ఫెంగ్ మార్షల్ లా విధించారు.
జూన్ 1,1989 – CNN సహ అన్ని అమెరికన్ న్యూస్ చానెళ్ల ప్రసరాలను బీజింగ్ లో నిషేధించారు. నిరసన ప్రదర్శనలు, చైనా దళాల వీడియో రికార్డింగ్ పై నిషేధం.
జూన్ 2,1989 – ప్రదర్శనకారులకు మద్దతుగా హౌ దేజియన్ నిర్వహించిన విభావరికి 10 వేల మందికి పైగా హాజరయ్యారు.
జూన్ 4,1989 – మధ్యరాత్రి 1:00 గం లకు అక్కడికి చేరుకున్న చైనా దళాలు ఒక రోజంతా విద్యార్థులు, ప్రజల పై కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. అధికారికంగా మరణాల సంఖ్య ఎప్పటికీ విడుదల చేయలేదు.
జూన్ 5,1989 – చైనా యుద్ధ ట్యాంకులకు ఒక వ్యక్తి ఏకంగా అడ్డుగా నిలబడ్డాడు. కొద్ది నిముషాల తరువాత చుట్టుపక్కల వారు అతన్ని పక్కకి లాగేశారు.
జూన్ 5,1999 – ఈ ఘటన సంతాప సభలో హాంకాంగ్ లో దాదాపు 70 వేల మంది పాల్గొన్నారు
జూన్ 1 1999 – ప్రదర్శనల సమయంలో జరిగిన సంఘటనలను వివరించే అమెరికా పత్రాలతో పాటు జాతీయ భద్రత అభిలేఖగారం ` తియనన్మన్ స్క్వేర్, 1989 : ది క్లాసిఫైడ్ హిస్టరీ’ అనే పత్రాలను ప్రచురించింది.
జనవరి, 2001 – ఇద్దరు చైనా రచయితలు ప్రచురించిన ` తియనన్మన్ స్క్వేర్’ అనే పత్రాలు వివాదాస్పదమయ్యాయి. ఆ దుర్ఘటనకు సంబంధించి వివిధ ఉపన్యాసాలు, వివిధ ప్రభుత్వ సమావేశాల వివరాలు, ప్రత్యక్ష సాక్షుల కధనాలు మొదలైన వివరాలన్నీ ఆ పత్రాల్లో ఉన్నాయి. అయితే ఈ పత్రాలు పూర్తిగా కల్పితమంటూ చైనా ప్రభుత్వం ప్రకటించింది.
ఫిబ్రవరి, 2006 – 17ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన తరువాత జర్నలిస్ట్ యు డాంగ్యూని ప్రభుత్వం విడుదల చేసింది. తియనన్మన్ స్క్వేర్ ప్రదర్శనల సమయంలో మావో జెడాంగ్ పోస్టర్ పై రంగు జల్లినందుకు అతన్ని అరెస్ట్ చేశారు.
జూన్, 4, 2009 – తియనన్మన్ స్క్వేర్ ప్రదర్శనలు జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హాంగ్ కాంగ్ లో వేలాదిమంది సభలు నిర్వహించారు. స్థానిక పత్రికా విలేకరులను తియనన్మన్ స్క్వేర్ లో ప్రవేశించకుండా ప్రభుత్వం అడ్డుకుంది. అలాగే విదేశీ వార్తా వెబ్ సైట్ లు, ట్విట్టర్ ను కూడా బ్లాక్ చేసింది.
ఏప్రిల్, 2011 – తియనన్మన్ స్క్వేర్ లో చైనా జాతీయ ప్రదర్శనశాల తిరిగి తెరిచారు. అయితే ప్రదర్శనశాలలో ఎక్కడ జూన్, 1989నాటి సంఘటనల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.
2012 – తియనన్మన్ స్క్వేర్ ప్రదర్శనలు నిర్వహించిన వారిలో ఒకరైన వుయెర్ కాక్సీ మళ్ళీ చైనాకు తిరిగిరావడం కోసం అమెరికా వాషింగ్టన్ లోని చైనా రాయబారకార్యాలయానికి అనుమతి కోసం వచ్చాడు. కానీ రాయబారకార్యాలయం అతనికి తలుపులు కూడా తెరవలేదు.
జూన్, 3, 2015 – తియనన్మన్ స్క్వేర్ ప్రదర్శనలు జరిగి 26ఏళ్ళు గడచిపోయిన తరువాత `ఆ ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు శిక్షలు’ అనుభవిస్తున్నవారిని విడుదల చేయాలంటూ ప్రభుత్వ అధికార ప్రతినిది ఒక ప్రకటన విడుదల చేశారు.
అక్టోబర్, 15, 2016 – శిక్ష అనుభవిస్తున్న చివరి ప్రదర్శనకారుడైన మియావో దేశున్ ను విడుదల చేస్తుందంటూ సాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన మానవహక్కుల సంస్థ డ్యూయి హువా వెల్లడించింది.
This article was first published in 2019