రాజు మహా విష్ణువు ప్రతినిదిగా రాజ్యానికి, ప్రజలకు సంరక్షకుడిగా వ్యవహరించాలన్నది ప్రాచీన రాజనీతి సూత్రం. రాజు నిరంకుశుడిగా మారకుండా, ప్రజలను పీడించకుండా నివారించడానికే ఈ ఏర్పాటు చేశారు. అందుకనే భూమి, ఇతర సాధన సంపత్తికి రాజు యజమాని కాదని, కేవలం సంరక్షకుడు మాత్రమేనని అన్నారు. కానీ విదేశీ సామ్రాజ్యవాద పాలకుల కాలంలో ఈ రాచరిక వ్యవస్థ, సంప్రదాయాన్ని పూర్తిగా నాశనం చేసి, అసలు రాచరికమే అన్యాయపురితమైన, ఘోరమైన వ్యవస్థ అంటూ ప్రచారం చేశారు. ఆవిధంగా తమ అధికారానికి అడ్డురాకుండా రాజులను తొలగించారు. కానీ `పద్మనాభ దాసులుగా’ పేరుపెట్టుకుని, రాజ్యానికి కేవలం సంరక్షకులుగా, ఆ సనాతన రాచరిక వ్యవస్థకు గుర్తుగా నిలిచారు ట్రావెన్కోర్ రాజులు.
ప్రపంచ చరిత్రను చూస్తే యూరోపియన్ల ఓడించిన మొదటి ఆసియా దేశంగా జపాన్ పేరు గాంచింది. అదే మన భారతదేశ చరిత్రను చూసినట్లయితే కొంతమంది మేధావులు చరిత్రను వక్రీకరిస్తూ ప్రచారం చేశారు. భారతదేశం మోసాలకు, లొంగుబాట్లకు, ఓటములతో నిండినదని పాశ్చాత్య కథనాల్లో పేర్కొన్నారు. కానీ భారతదేశం యుగాల కాలం నుంచి ఎంతో పరాక్రమంతో, ఓర్పుతో, ధైర్యసాహసాలతో వ్యవహరించింది. యూరోపియన్ లపై భారతీయుల పోరాటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. వాటిలో కోలాచేల్ యుద్ధం భారతదేశ ప్రతిష్టకు, పరాక్రమానికి గుర్తుగా నిలిచింది.
దక్షిణ భారత్ లోని ఒక చిన్న భూభాగంలో పూర్వపు ట్రావెన్కోర్ రాజ్యం ఉండేది. ప్రస్తుత కేరళ దక్షిణంలో ఈ రాజ్యం ఉంది. ఇక్కడ జరిగినటువంటి సంస్కరణలు, యుద్ధాలు, సాధించినటువంటి విజయాలు భారతదేశ చరిత్రలోనే మొదటి విజయాలుగా చరిత్ర చెబుతోంది.
మార్తాండవర్మ 1729 లో సంస్థానానికి రాజుగా సింహాసనాన్ని అధిష్టించాడు. (తరువాతి కాలంలో ట్రావెన్కోర్ సంస్థానానికి రాజయ్యాడు). అదే సమయంలో ట్రావన్కోర్ సంస్థానంలో రాజ కుటుంబీకులయిన థంపిస్, ఎట్టు వేట్టిల్ కి మధ్య జరిగిన అంతర్గత పోరులో థంపిస్ కుటుంబీకులు మాతృస్వామ్య వ్యవస్థ ఆధారంగా ట్రావెన్కోర్ సింహాసనాన్ని దక్కించుకున్నారు. అయితే ఎట్టూ వెట్టిల్ పిళ్ళై లతో సుదీర్ఘంగా జరిగిన గొడవలతో మార్తాండవర్మ తన రాజభవనం నుండి పారిపోవలసి వచ్చింది. ఆ సమయంలో అతను అనేక హత్యాయత్నాలను తప్పించుకున్నాడు. చివరికి వ్యూహాలతో తన ఉనికిని సవాలు చేసే నాయర్లను, వారి శక్తి కేంద్రాలను ఓడించాడు.
ఇదే సమయంలో కేరళ ఉత్తర దిక్కున మలబారు ప్రాంతం దాదాపు డచ్ వలసరాజ్యాల శక్తులచే ఆక్రమించబడింది. వాణిజ్యం, సామ్రాజ్యవాద ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కొచ్చి, ఇతర దక్షిణ ప్రాంతాల్లో విస్తరించేందుకు డచ్ వారు అనేక మార్గాలను అన్వేషించారు. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన మార్తాండవర్మ పొరుగు రాజ్యాలైన ఎలదయతు స్వరూపం, డచ్ ఆక్రమణలో ఉన్న కయంకుళం రాజ్యాలను ఏకం చేసి వ్యూహాత్మకంగా డచ్ వారిపై యుద్ధాల ద్వారా వెనాడ్ ను స్వాధీనం చేసుకుని, తిరువితంకుర్ అనే ట్రావెన్ కోర్ అనే కొత్త రాజ్య వంశాన్ని స్థాపించాడు. మార్తాండవర్మ విస్తరణ విధానం ఈ ప్రాంతంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య ప్రయోజనాలను ప్రమాదంలో పడేసింది. అప్పటికే మార్తాండవర్మ తో ఒప్పందం కుదుర్చుకున్న బ్రిటిష్ వారు మలబార్ తీరంలో మిరియాల వ్యాపారం చేసే హక్కులను పొందుతారని డచ్ వారు భయపడ్డారు.
ప్రతిస్పందనగా కాయాంకుళం పై ఆదిపత్యాన్ని వదులుకోవాలని డచ్ గవర్నర్ సిలోన్ గుస్టుఫ్ వెల్లెం వాన్ మార్తాండవర్మకు లేఖ రాశాడు. డచ్ గవర్నర్ కు తిరిగి రాసిన లేఖలో ట్రావెన్కోర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, అది డచ్ కి సంబంధించినది కాదని మార్తాండవర్మ ఘాటుగా స్పందించాడు.
తరువాత ఇరువురి మధ్య జరిగిన సమావేశంలో కయాంకుళం రాజ్యాన్ని తిరిగి ఇచ్చేయాలని, లేకపోతే దాడి చేస్తానని డచ్ గవర్నర్ అన్నాడు. దీనిపై స్పందించిన మార్తాండవర్మ “నేను కూడా యూరప్ దండయాత్ర చేయాలనుకుంటున్నానని” గవర్నర్ కి చురకలు అంటించాడు.
కొద్దిరోజుల తర్వాత డచ్ కెప్టెన్ యుస్టాచియస్ డి లనొయ్ నేతృత్వంలో వచ్చిన డచ్ నావికా దళాలు ట్రావెన్కోర్ పై దాడి చేయడానికి కోలాచెల్ అనే అనే ప్రాంతంలో ఫిరంగి దళాలతో దిగాయి. డచ్ వారు పద్మనాభపురం వరకు భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. కళుక్లం (పద్మనాభపురం) కోటను ముట్టడించారు. త్రివేండ్రంలో ఉన్న మార్తాండవర్మ , అతని ప్రధాన మంత్రి రమయ్యన్ దలావ, నాయర్ సేన పదాతిదళం, అశ్విక దళం, ఫిరంగి దళాలతో డచ్ వారు కలుక్కం కోటను స్వాధీనం చేసుకోకుండా అడ్డుకున్నారు. ట్రావెన్కోర్ సైన్యం చేసిన ఎదురుదాడికి భయపడి డచ్ వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి దాక్కోవలసిన పరిస్థితిని మార్తాండవర్మ సృష్టించాడు.
సర్వ సైన్యాధికారి తను పిళ్ళై నేతృత్వంలో నాయర్ సైన్యం చేసిన ఎదురుదాడికి డచ్ నావికాదళం తట్టుకోలేక రణరంగం నుండి పారిపోయింది. ఈ దాడిలో తీవ్రంగా నష్టపోయింది. డచ్ నౌకలు కొచ్చిన్ కి తిరిగి పయన మయ్యాయి. 389 మస్కెట్లు (తుపాకులు), కొన్ని ఫిరంగులను వదిలేసి వెళ్లారు. చివరికి 1741, ఆగస్ట్ 14న డచ్ సైన్యం మహారాజా మార్తాండవర్మ ముందు లొంగిపోయింది. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక నిర్ణయాత్మక, అపూర్వ విజయం. 24 మంది అధికారులతో సహా అనేక మంది డచ్ సైనికులు బందీలుగా చిక్కారు.
బందీలుగా చిక్కిన వారిలో డచ్చి కెప్టెన్ యుస్తాచియస్ డి లనొయి, అతని ఉప సైన్యాధ్యక్షుడు డోనాడి ఉన్నారు. ఎంతో దూరదృష్టి, వ్యూహాత్మక నైపుణ్యం కలిగిన మార్తాండ వర్మ డచ్ కెప్టెన్ డి లనోయిని ట్రావెన్కోర్ సైనిక అధికారిగా నియమించదమెకాక `వాలియా కపిథాన్’ అనే బిరుదును కూడా ప్రదానం చేశారు. అతని పని నాయర్ దళానికి శిక్షణనిచ్చి, ఆధునీకరించి, భవిష్య దాడులను ఎదుర్కొనేలా వారిని సిద్ధం చేయడం.
మార్తాండవర్మ ఆధ్వర్యంలో ట్రావెన్కోర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. రాజ్యంలో అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకు వచ్చారు. గతంలో రామవర్మ కాలంలో పాడైపోయిన పద్మనాభ స్వామి ఆలయాన్ని మార్తాండవర్మ పునర్నిర్మించాడు. దక్షిణ భారతదేశంలోనే ఎదురులేని సైనిక శక్తిగా ట్రావెన్కోర్ అవతరించింది.
సైనిక అధికారి వైకోమ్ పద్మనాభం ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ ని ఓడించారు. వీర వేలు తంబి ధవళ నేతృత్వంలో నాయర్ సైన్యం బ్రిటిష్ వారిపై పోరాడి ఈస్టిండియా కంపెనీకి భారీ నష్టాన్ని కలిగించింది. తత్ఫలితంగా బ్రిటిష్ వారు నాయర్ ప్రమాదకరమైనవారుగా వర్గీకరించి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ నుంచి చాలా కాలం పాటు నిషేదించారు. తదనంతరం 1818 లో ట్రావెన్కోర్ నాయర్ బ్రిగేడ్ గా పునర్వ్యవస్థీకరించారు. స్వాతంత్ర్యానంతరం 9 వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ( 1వ ట్రావెన్కోర్) 16వ బెటాలియన్ (2వ ట్రావెన్కోర్) గా 1954 లో భారత సైన్యం లో విలీనం చేశారు.
మార్తాండవర్మ 20 సంవత్సరాల తన పరిపాలన అనంతరం ట్రావెన్కూర్ గతిని మార్చే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. అదే `త్రిపాది దానం’. తన రాజ్యాన్ని, సర్వ అధికారాలను తమ కులదైవమైన శ్రీ పద్మనాభ స్వామి వారికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. తమ వారసులను “పద్మనాభ దాస” అనే పేరుతో దేవుని సేవకులుగా ప్రకటించారు. పద్మనాభ స్వామి నిజమైన సంరక్షకుడిగా భావిస్తూ రాజ్య ఖజానాను `పండరం వాకా’గా ప్రకటించాడు. ఇప్పటికీ మహారాజా కుటుంబీకులు “పద్మనాభ దాస” పేరును ధరిస్తున్నారు. పౌర యుద్ధాలు, సామాజిక అశాంతి నుండి దేశాన్ని రక్షించడం, శాంతి, శ్రేయస్సు కాపాడటంతోపాటు ట్రావెన్కోర్ అభివృద్ధి, సంక్షేమంలో `త్రిపాది దానం’ కీలక పాత్ర పోషించిందని తర్వాత సంవత్సరాల్లో ఋజువైంది. 1756లో ప్రధానమంత్రి రామయ్యన్ దలవాన్ మరణించాడు. తరువాత మార్తాండవర్మ ఆరోగ్యం కూడా క్షీణించింది. ట్రావెన్కోర్ యువరాణి అశ్వతి తిరుణాల లక్ష్మీబాయి రాసిన `పద్మనాభ స్వామి క్షేత్రం’ అనే పుస్తకం ప్రకారం మరణానికి ముందు మార్తాండ వర్మ తన మేనల్లుడైన కార్తీక తిరునాళ్ రామవర్మను పిలిపించి తుది సూచనలు చేశారు. ప్రధానంగా అన్ని పూజలు, వేడుకలతో పాటు పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన ఇతర విషయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నాలు చేయకూడదని సూచించారు. రాష్ట్ర ఖర్చులు దాని ఆదాయాన్ని ఎప్పటికీ మించకూడదని, రాజ కుటుంబంలో ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోవాలని మార్తాండ వర్మ తన మేనల్లుడు కార్తీక తిరుణాల్ కు సూచించారు. మార్తాండవర్మ 1758 లో తన 53వ ఏట పరమపదించారు.
ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ శ్రీధర్ మీనన్ ట్రావెన్కోర్ సైన్యం గురించి వ్రాస్తూ” కోలాచెల్ యుద్ధం కేరళను జయించాలనే డచ్ వారి కలని ఎప్పటికప్పుడు ట్రావెన్కోర్ సైన్యం బద్దలు కొట్టింది ” అని అన్నారు.
Source: Organiser