Home Telugu త్రిపుల్ తలాక్ మతపరంగా ముఖ్య ఆచారమా? కాదా?

త్రిపుల్ తలాక్ మతపరంగా ముఖ్య ఆచారమా? కాదా?

0
SHARE

ముమ్మారు తలాక్‌ పద్ధతిపై తేల్చనున్న సుప్రీం కోర్టు

  • విచారణ ప్రారంభం
  • ఈ పద్ధతి ఇస్లాంలో లేదని వాదన
  • సమస్య కానే కాదన్న ముస్లిం పర్సనల్‌ లా బోర్డు

ఇటీవల కాలంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన ముమ్మారు తలాక్‌ పద్ధతి రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టులో చరిత్రాత్మక విచారణ ప్రారంభమయింది. ఈ అంశంతో పాటు ముస్లింలలో ఆచారంగా వస్తున్న నిఖా హలాలపైనా దాఖలయిన పలు పిటిషన్లపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణను చేపట్టింది. ‘‘ముమ్మారు తలాక్‌ చెప్పే పద్ధతి మతపరమైన ముఖ్య ఆచారమా, ప్రాథమిక హక్కా’’ అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఎస్‌.ఖేహర్‌ నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో కూడిన ధర్మాసనం వెల్లడించింది. మతాన్ని ఆచరించడానికి రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమికహక్కులో ముమ్మారు తలాక్‌ పద్ధతి భాగమవుతుందా అన్న అంశాన్ని పరిశీలిస్తామంది. ఈ పద్ధతి మతపరంగా మౌలికమయినది అన్న నిర్ణయానికి వస్తే రాజ్యాంగబద్ధత అంశం జోలికి పోబోమని సుప్రీంకోర్టు పేర్కొంది. ముస్లింలలో బహుభార్యత్వ అంశాన్ని చర్చించే అవకాశాలు లేదని తెలిపింది. ముమ్మారు తలాక్‌ పద్ధతి అంశానికి, దానికి సంబంధం లేదని పేర్కొంది.

పిటిషనర్లలో ఒకరైన సాయ్‌రా బానో తరఫున సీనియర్‌ న్యాయవాది అమిత్‌ సింగ్‌ చద్దా ముమ్మారు తలాక్‌ పద్ధతికి వ్యతిరేకంగా వాదనలు ప్రారంభించారు. ఈ ఆచారం ఇస్లామ్‌కు మౌలికం కాదని పేర్కొన్నారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వంటి పొరుగుదేశాల్లో ఉన్న ఆచారాలను తన వాదనకు మద్దతుగా చూపించారు. వివిధ ఇస్లామిక్‌ దేశాల్లో ఈ అంశంపై అమల్లో ఉన్న చట్టాలను తాము నిశితంగా పరిశీలించాలనుకుంటున్నట్లు ధర్మాసనం ఈ సందర్భంగా చెప్పింది.

న్యాయవ్యవస్థ యంత్రాంగానికి సంబంధం లేకుండా విడాకులు మంజూరు చేసే కేసుల్లో పర్యవసానాలను పరిష్కరించేందుకు న్యాయపరమైన పర్యవేక్షణ ఉండాలని మరో పిటిషనర్‌ తరఫున హాజరయిన సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ చెప్పారు. ముమ్మారు తలాక్‌ పద్ధతి అంశం సమస్య కానేకాదని కోర్టుకు వ్యక్తిగత హోదాలో సహకరిస్తున్న కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ న్యాయవాది సల్మాన్‌ ఖుర్షీద్‌ పేర్కొంటూ భార్యా భర్తల మధ్య రాజీ ప్రయత్నాలు చేయనిదే తలాక్‌ పూర్తయినట్లు భావించరన్నారు. తలాక్‌కు దారి తీసే అంశాల చెల్లుబాటును నిర్ధారించే తీర్పేమీ లేదన్నారు. ఒకే విడతలో ముమ్మారు తలాక్‌ చెప్పిన తర్వాత రాజీ పడే అంశాన్ని చట్టపరంగా వ్యవస్థీకరించారా అని ధర్మాసనం ప్రశ్నించగా ఖుర్షీద్‌ లేదన్నారు. అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) తరఫున వాదనలు వినిపిస్తున్న కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ కూడా ఖుర్షీద్‌తో ఏకీభవించారు. తలాక్‌ అంశం సమస్య కాదన్నారు. వివేకవంతమైన ముస్లిం ఎవరూ కూడా పొద్దున్నే లేచి తలాక్‌, తలాక్‌, తలాక్‌ అని చెప్పరన్నారు.

ముస్లిం మహిళలు విడాకుల కారణంగా లేదా వారి భర్తలు ఇతర మరో పెళ్లి చేసుకోవడం కారణంగా లింగపరమైన వివక్షను ఎదుర్కొంటున్నారా అన్న అంశాన్నీ సుప్రీంకోర్టు పరిశీలించనుంది. ఈ పిటిషన్లపై ఇంకా పలువురు సీనియర్‌ న్యాయవాదులు తమ వాదనలు ప్రారంభించారు.

(ఈనాడు సౌజన్యంతో)