జాతీయ ఐక్యత, సమైక్యత భావనను స్వయంగా అనుభూతి చెందడానికి తృతీయ వర్ష సంఘ్ శిక్షా వర్గ ఒక అవకాశమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య అన్నారు. నాగ్‌పూర్‌లోని రేషింబాగ్‌లోని స్మృతి మందిర్ ప్రాంగణంలోని మహర్షి వ్యాస్ సభా గృహంలో మంగళవారం జరిగిన ప్రారంభోత్సవంలో శిక్షా వర్గలో శిక్షణ పొందడానికి వచ్చిన వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఈ తృతీయవర్ష వర్గలో పాల్గొనడం ప్రతి స్వయంసేవకుని చిరకాల కోరిక అని ఆయన అన్నారు. ధైర్యం (సహనం, సాహసం) , క్షమ (క్షమించే గుణం), స్వీయ నిగ్రహాన్ని కలిగి ఉన్న సమ్యమ్, అస్తేయం (దొంగతనానికి పాల్పడకపోవడం), శౌచం (శుభ్రత), ఇంద్రియ నిగ్రహం (ఇంద్రియాలపై నియంత్రణ), విద్యా (నిజమైన జ్ఞానం), సత్యం (కోపంపై విజయం) లాంటి మౌలిక విలువలు శిక్షావర్గలోనే కాదు, జీవితాంతం పాటిస్తూనే ఉండాలని అన్నారు.
స్వయంసేవక్ కు ఉండవలసిన లక్ష్యం పట్ల రాజీలేని నిబద్ధత, సైద్ధాంతిక స్పష్టత, అందరి పట్ల స్నేహభావం, కష్టించడం, క్రమశిక్షణ వంటి లక్షణాలను గుర్తుచేసిన ఆయన వర్గ సమయంలో ఇవి సాధన చేయాలన్నారు. శారీరక వ్యాయామ సంబంధిత కార్యకలాపాల్లో, ముఖ్యంగా యోగా ఆసనాలలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంలో శిక్షార్ధులు శ్రద్ధ చూపాలన్నారు. అలాగే సంఘ నిర్వహించే వివిధ కార్యకలాపాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
పూర్తి భక్తితో వర్గలో పాల్గొనాలని పిలుపునిచ్చిన శ్రీ భాగయ్య జీ వర్గను ‘సాధన’ తో పోల్చారు. శిక్షార్ధులంతా వర్గ ను విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ వర్గలో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా 40 నుంచి 65 ఏళ్ల మధ్య స్వయంసేవకులు ఎంపికయ్యారు. ఈ ఏడాది వర్గలో మొత్తం 852 శిక్షార్ధులు పాల్గొంటున్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రెసిడెంట్ శ్రీ గోవింద్ జీ శర్మ వర్గ సర్వధికారిగా, హర్యానా ప్రాంత కార్యవాహ శ్రీ సుభాష్ జీ అహుజా, వర్గ కార్యవాహగా వ్యవహరిస్తారు.