గ్రాహం స్టెయిన్స్.. ప్రపంచ ప్రఖ్యాత క్రైస్తవ మిషనరీగా ఇతడిని సెక్యులర్ మీడియా అభివర్ణిస్తుంటుంది. కానీ అతను కుష్టు వ్యాధిగ్రస్థుల సేవ పేరిట 1969లో భారతదేశానికి వచ్చిన ఆస్ట్రేలియన్ క్రైస్తవ మతప్రచారకుడు. దాదాపు 40 ఏళ్ల పాటు ఓడిశాలోని గిరిజన గ్రామాల్లో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు కొనసాగించిన ఇతడు గిరిజనులను మతం మారుస్తూ, వారిని తమ సంస్కృతీ సాంప్రదాయాలకు దూరం చేశాడు.1999లో స్థానికుల చేతిలో హత్యగావించబడ్డాడు.
ఇతడి హత్యతో అంతర్జాతీయంగా పెను దుమారం రేగింది. గిరిజనులకు, కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవ చేసినందుకు ఇతడిని హత్య చేశారంటూ క్రైస్తవ మిషనరీ సంస్థలు హిందూ సంఘాలపై ఆరోపణలు చేసాయి. అతడు మతప్రచారకుడు కానేకాదని, సేవకుడు మాత్రమేనని నమ్మబలికాయి.
ఇటీవల, సెప్టెంబర్ 2020లో పార్లమెంట్ సమావేశాల్లో ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్ట సవరణ బిల్లు ప్రవేశం సమయంలో ఎంపీ సత్యపాల్ సింగ్ గ్రాహం స్టెయిన్స్ మీద చేసిన వ్యాఖ్యలు కొందరికి కోపం తెప్పించాయి. గ్రాహం స్టెయిన్స్ హత్యను ఖండిస్తూనే, అతడు అనేక మంది గిరిజనులను మతం మార్చిన విషయం అప్పటి సీబీఐ, జస్టిస్ వాద్వా కమిషన్ విచారణలో తేలిందని ఎంపీ సత్యపాల్ సింగ్ మరోసారి గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలో హైదరాబాదుకు చెందిన ‘సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్’ అనే పరిశోధనాత్మక సంస్థ గ్రాహం స్టెయిన్స్ సేవ పేరిట సాగించిన మతమార్పిడి విధానాలను వెలుగులోకి తీసుకువచ్చింది. గ్రాహం స్టెయిన్స్ తాను భారతదేశంలో జీవించిన కాలంలో, తన మాతృదేశం ఆస్ట్రేలియా నుండి వెలువడే ‘టైడింగ్స్’ అనే ఒక మిషనరీ మాస పత్రికకు తన స్వహస్తాలతో, దేశంలో తాను సాగిస్తున్న మతమార్పిడి విధానాలను వివరిస్తూ వ్రాసిన లేఖలను ‘సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్’ సేకరించింది. దీంతో గ్రాహం స్టెయిన్స్ చేసిన ‘సేవ’ మరోసారి అగ్నిపరీక్షకు నిలిచింది.
నిజానికి ‘టైడింగ్స్’ మిషనరీ మాస పత్రిక ప్రస్తావన నేటిది కాదు. 1999లో గ్రాహం స్టెయిన్స్ హత్య అనంతరం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ వాద్వా కమిషన్, అతడు తరచూ ఆ పత్రికకు ఇక్కడి విషయాలు పూసగుచ్చినట్టు వివరిస్తున్న విషయాన్ని గ్రహించింది. అతడి లేఖలు ప్రచురితమైన పత్రిక కాపీలను విచారణ నిమిత్తం తమకు సమర్పించాల్సిందిగా అభ్యర్ధించినప్పటికీ, అసలు నిజం బయటపడుతుందనే కారణం చేత కావొచ్చు, ఆ సంస్థ యాజమాన్యం పట్టించుకోలేదు. అయినప్పటికీ జస్టిస్ వాద్వా కమిషన్ అతి కష్టం మీద ‘టైడింగ్’ మిషనరీ మాస పత్రికకు చెందిన కొన్ని కాపీలను సంపాదించగలిగింది. వాటి వివరాలను జస్టిస్ వాద్వా కమిషన్ తమ నివేదికలో పేర్కొంది.
అయితే తాజాగా ‘సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్’ మరొక అడుగు ముందుకు వేసి, గ్రాహం స్టెయిన్స్ లేఖలు ప్రచురితమైన ‘టైడింగ్స్’ మిషనరీ మాస పత్రికకు చెందిన మరికొన్ని కాపీలు సేకరించడంతో మరోసారి గ్రాహం స్టెయిన్స్ కార్యకలాపాలపై చర్చ ఊపందుకుంది.
గ్రాహం స్టెయిన్స్ లేఖల్లో ఏముందో వివరిస్తూ సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్ ప్రచురించిన నివేదికలోని కొన్ని ముఖ్య విషయాలను ఒకసారి పరిశీలిద్దాం..
జగన్నాథ రథయాత్రలో బైబిళ్లు పంపిణీ, క్రైస్తవ సాహిత్యం విక్రయం!
కేవలం సేవ చేసేందుకు మాత్రమే భారత్ వచ్చినట్టు చెప్పుకునే గ్రాహం స్టెయిన్స్.. తాను, తమ బృందంతో కలిసి ప్రపంచ ప్రఖ్యాత హిందూ ఉత్సవమైన జగన్నాథ రథయాత్ర సందర్భంగా బైబిళ్లు పంపిణీ చేసి, క్రైస్తవ సాహిత్యాన్ని విక్రయించినట్టు తాను వ్రాసిన లేఖలో పేర్కొన్నాడు. 1997, 1998 సంవత్సరాల్లో వరుసగా రెండేళ్ళూ జగన్నాథ రథయాత్ర సమయంలో గ్రాహం స్టెయిన్స్ ఈ చర్యలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఈ లేఖను ‘టైడింగ్స్’ పత్రిక రెండు విడతలుగా ప్రచురించింది.
ఒక మతానికి చెందిన పవిత్రమైన రథయాత్రలో తన మతాన్ని ప్రచారం చేయడం నేరం మాత్రమే కాదు అనైతికం కూడా! రాజ్యాంగం కల్పించిన (భారత పౌరులకు) ప్రాథమిక హక్కుల్లో ఒకటైన ‘మత స్వేచ్ఛ’ అనేది ప్రజామోదం, నైతికత, సమాజ శ్రేయస్సు వంటి విషయాలకు లోబడి ఉండాలన్న కనీస అంశాల లోబడి ఉంటుందనేది ప్రాథమిక సూత్రం.
అటవీ ప్రాంతంలో సామూహిక మతమార్పిళ్లు:
ఓడిశాలోని గిరిజన గ్రామాల్లోనూ, అటవీ ప్రాంతాల్లోనూ గ్రాహం స్టెయిన్స్ తాను సాగించిన సామూహిక మతమార్పడి కార్యకలాపాలను వివరిస్తూ తరచూ వ్రాసిన లేఖలను ‘టైడింగ్స్’ అనేకమార్లు ప్రచురించింది. ఎంతమందిని మతం మార్చాడో, ఎంతమంది గిరిజనులు తాను నిర్వహించే ‘అటవీ ప్రార్ధన’లకు క్రమం తప్పకుండా హాజరు అవుతున్నారో కచ్చితమైన లెక్కలు గ్రాహం స్టైన్స్ తన లేఖల్లో వివరించేవాడు. రామచంద్రాపురంలో మొదటి ‘అటవీ క్యాంప్’ ఏర్పాటు చేసినట్టు, దానికి 100 మందికి పైగా హాజరుకాగా, వారికి బాప్తిజం ఇచ్చినట్టు, ఆ క్యాంప్ విజయవంతం అయినట్టు గ్రాహం స్టెయిన్స్ తన లేఖల్లో పేర్కొన్నాడు. ఈ అటవీ క్యాంపుల్లో ప్రధానంగా బైబిల్ బోధనలు, క్రైస్తవ జీవన విధానం వంటివి వివరించడంతో పాటు ప్రార్ధనలు పేరిట రోగాలు నయం చేయటం, అద్భుతాలు జరిగిపోయినట్టు భ్రమ కల్పించడం వంటి కార్యకలాపాలకు పాల్పడేవాడు.
జస్టిస్ వాద్వా కమిషన్ ఎదుట బాధితుల వాంగ్మూలం:
గ్రాహం స్టెయిన్స్ హత్యానంతరం జస్టిస్ వాద్వా కమిషన్ అనేక మందిని విచారించి వారి నుండి వివరాలు సేకరించింది. ఈ క్రమంలో ఓడిశాలోని మయూరబంజ్, ఇతర ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు అనేక మందిని కమిషన్ విచారించింది.
స్థానికంగా ఉన్న గిరిజనులను వారి సంస్కృతీ సాంప్రదాయాల నుండి దూరం చేసే ప్రయత్నంలో భాగంగా.. అప్పడే క్రైస్తవంలోకి మారి, హఠాత్తుగా తమకు మంచి జరిగిందని, అద్భుతం చవిచూశామని, తమ రోగాలు నయం అయిపోయాయని ఒకరిద్దరి గిరిజనులతో సాక్ష్యం చెప్పించేవాడు గ్రాహం స్టెయిన్స్. వీరి ‘సాక్ష్యం’ ఆధారంగా ఇతర గిరిజనులను కూడా క్రైస్తవ మతమార్పిడికి ఆకర్షించే వాడు అని జస్టిస్ వాద్వా కమిషన్ తమ నివేదికలో ‘టైడింగ్’ ప్రచురణ కాపీలను ఉటంకిస్తూ పేర్కొంది. గిరిజనులను మతం మార్చేందుకు ‘ట్రైబల్ క్యాంప్’లు ఏర్పాటు చేస్తూ, అక్కడికి వచ్చిన వారికి అద్భుతాలు, మహిమలు అంటూ మభ్యపెట్టేవాడు అని కూడా కమిషన్ అభిప్రాయపడింది. ఈ క్రమంలో గ్రాహం స్టెయిన్స్ హత్య విచారణ సందర్భంగా కమిషన్ ఎదుట హాజరైన ఒక గిరిజనుడు, “గ్రాహం స్టెయిన్స్ చెప్పిన విధంగా అద్భుతాలు ఏమీ జరగలేదని, అందుకే నేను క్రైస్తవంలోకి మారి, తిరిగి హిందూమతంలోకి వచ్చేసాను’’ అని వాంగ్మూలం ఇచ్చాడు.
యథేచ్ఛగా ఒడిశా మతమార్పిడి నిరోధక చట్టం ఉల్లంఘన:
దేశ ప్రగతికి మతమార్పిడులు అడ్డంకి. ఈ ఉద్దేశంతోనే ఒడిశా రాష్ట్రంలో 1967 నుండి ‘మతమార్పిడి నిరోధక చట్టాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. కానీ విదేశీయుడైన గ్రాహం స్టెయిన్స్ మాత్రం, ఈ దేశ చట్టం పట్ల ఏమాత్రం గౌరవం ప్రదర్శించకుండా, ఏమాత్రం సంశయం లేకుండా, తాను కాలుమోపినప్పటి నుండి జీవిచినంత కాలం తన అనైతిక, మతమార్పిడి కార్యకలాపాల ద్వారా ఈ దేశీయ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూనే ఉన్నాడు.
ఈ చట్టం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి బాప్తిజం స్వీకరిస్తున్నట్లైతే, బాప్తిజం ఇస్తున్న వ్యక్తి ఆ విషయాన్ని స్థానిక జిల్లా మేజిస్ట్రేట్ కు ముందస్తుగా తెలియజేయాల్సి ఉంటుంది. అనేక మందికి బాప్టిజం ఇచ్చినట్టుగా తన లేఖల్లో అనేకసార్లు ప్రస్తావించిన గ్రాహం స్టెయిన్స్ ఈ నియమాలను ఏమాత్రం పట్టించుకోలేదు. అంతేకాకుండా స్థానిక జిల్లా పోలీస్, అడ్మినిస్ట్రేషన్ యంత్రాంగానికి సైతం ఈ చట్టం పట్ల కనీస అవగాహన లేదని, ఈ చట్టాన్ని అమలు చేసే ప్రయత్నం కూడా చేయలేదన్న విషయం జస్టిస్ వ్వాద్వా కమిషన్ తమ నివేదికలో పేర్కొంది.
కుష్టు వ్యాధిగ్రస్థుల సేవల గురించి ఏమాత్రం ప్రస్తావించని గ్రాహం స్టెయిన్స్:
కుష్టు వ్యాధిగ్రస్థులకు సేవ చేయడానికి మాత్రమే భారతదేశానికి వచ్చినట్టు చెప్పుకునే గ్రాహం స్టెయిన్స్ దంపతులు, తమ కార్యకలాపాలను వివరిస్తూ ‘టైడింగ్స్’ పత్రికకు వ్రాసే లేఖల్లో ఆ విషయాలను ఏమాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. తాను ఏర్పాటు చేసే ‘బాప్తిజం’ స్వీకరణ, ‘అటవీ ప్రార్ధనలు’ ఇతర చర్చి కార్యక్రమాలకు హాజరయ్యే వారి గురించి పూసగుచ్చినట్టు వివరించే గ్రాహం స్టెయిన్స్.. తాను కుష్టు వ్యాధిగ్రస్థులకు చేసే సేవా కార్యకలాపాలను ఎక్కడా వివరించలేదు.
చివరిగా.. గ్రాహం స్టెయిన్స్ హత్యకు సంబంధించిన కేసులో నిందితుడు దారా సింగుకు సీబీఐ కోర్ట్ మరణశిక్ష విధించడంపై సుప్రీంకోర్టు విభేదించింది. గ్రాహం స్టెయిన్స్ వంటి మిషనరీలు దేశంలో పాల్పడుతున్న మతమార్పిడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ దారా సింగుకు పడిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు మతమార్పిడులపై చేసిన ఆవేదనాపూరిత వ్యాఖ్యలను కొన్ని సోకాల్డ్ సంస్థలు తప్పుడు అర్ధం వచ్చే రీతిలో ప్రచారం చేసి నిరసనలు తెలియజేయడంతో సుప్రీం తన వ్యాఖ్యలను సవరించుకుంది.
Source : NIJAM TODAY