ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code) దిశగా ఉత్తరాఖండ్లో మరో అడుగు పడింది. ఈ ‘యూసీసీ బిల్లు (UCC bill) మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అసెంబ్లీ లో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే శాసనసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు.
ఇది ఆమోదం పొందితే స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ (Uttarakhand) నిలువనుంది. గోవాలో పోర్చుగీసు పాలన నుంచి ఉమ్మడి పౌరస్మృతి ఉంది. 2022లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భాజపా తన ఎన్నికల మేనిఫెస్టోలో యూసీసీని ప్రముఖంగా పేర్కొంది. అధికారంలోకి రాగానే సీఎం పుష్కర్సింగ్ దామి.. దీనిపై కమిటీ ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ రెండేళ్ల పాటు సుదీర్ఘ కసరత్తులు చేసింది. 70కి పైగా సమావేశాలు నిర్వహించి 60వేల మందితో మాట్లాడింది. ఆన్లైన్లో వచ్చిన 2.33 లక్షల సలహాలు, సూచనలను పరిశీలించింది. అనంతరం ముసాయిదాను రూపొందించి ఇటీవల సీఎంకు సమర్పించింది. ఇది అమల్లోకి వస్తే.. రాష్ట్రంలో మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే తరహా వివాహ, విడాకుల, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తిస్తాయి.