ఆవు, దూడలు దారివెంట నడుస్తున్నాయి. ఈ రెండు ఎక్కడివి? ఎవరివి? అని దారినపోయే దానయ్య పక్కనే నడుస్తున్న ఓ పెద్దాయనను అడిగాడు. ఆవు ఎక్కడితో తెలియదుకానీ దూడ గురించి బాగా తెలుసన్నాడు. దానితో ఆగకుండా నాకు ఆవు నచ్చదుకానీ దూడ మాత్రం చాలా ఇష్టం. ఈ దూడ మాత్రం ఆవుదే! అన్నాట్ట. సరిగ్గా మన దేశ బుద్ధి జీవుల్లో కూడా ఇలాంటి పక్షపాతపు డైలాగులే రోజుకు పది వినిపిస్తుంటాయి. ఈ దేశం మాదే అంటారు. కానీ ఈ దేశంలో పుట్టిన సంస్కృతిని అంగీకరించరు.
ఈ మేధావులు రోజుకు పదిసార్లు పాశ్చాత్యుల గ్లోబలైజేషన్‌ను తిడుతారు. కానీ వారి వైజ్ఞానిక ఆవిష్కరణలు చూపించి మన దేశ వైజ్ఞానిక పరంపరను నిందిస్తారు. ‘అన్ని వేదాల్లోనే ఉన్నాయష’ అని వేదాలను వెక్కిరించేవారు మనకు సంస్కర్తలుగా కొలువుదీరారు. ఈ భావ వైరుధ్యం పక్కనపెట్టి నిజంగా ప్రపంచం బట్టలు కట్టని రోజే మన ఆలోచనలు ఎంత గొప్పగా వున్నాయో నిశితంగా చూడవచ్చు.
అణుబాంబు విస్ఫోటనం చూసి దాని అంతరార్థాన్ని భగవద్గీతలోని (11/12 11/32) శ్లోకాలలో చెప్పిన రాబర్ట్ జ్యూలియస్ వోపన్ హామర్ గురించి ఎంత మందికి తెలుసు! 16 జూలై 1945లో మాన్‌హట్టన్ ప్రాజెక్టులో ప్రముఖంగా పనిచేసి అణుబాంబు పరీక్షల అనుభవాన్ని గీతాతత్వంతో అన్వయించుకున్న ఈ పాశ్చాత్య శాస్తవ్రేత్త భగవద్గీత గొప్పతనాన్ని తన జీవిత చరిత్రలో నమోదు చేసుకొన్నాడు. శ్రీరామకృష్ణుల మహా సమాధి తర్వాత అనేక కష్టాలు పడి అమెరికాకు వెళ్లాడు స్వామి వివేకానంద. 11 సెప్టెంబర్ 1893 నాటి సర్వమత సమ్మేళనంలో స్వామి ఉపన్యాసం తర్వాత పాశ్చాత్య ప్రపంచంలోని సింహభాగం మనకు తలవంచారు. వారంతా స్వామి వివేకానందను గురించి ప్రచార సాధనాల్లో చెబితేగాని మనకు స్పహరాలేదు. అలాగే ఈరోజు పాశ్చాత్యులు ఎందరో మన ప్రాచీనత్వాన్ని గురించి పరిశోధన చేస్తుంటే, మనం మాత్రం కులం కుళ్లులో, స్వార్థ రాజకీయాల్లో, సంకుచిత మనస్తత్వాల్లో ఇరుక్కుపోతున్నాం.
భూమి గుండ్రంగా ఉందని మొదటిసారి చెప్పింది ఎవరు? అనగానే మనం చదువుకొన్న కోపర్నికస్, గెలీలియో అని టక్కున చెప్పేస్తాం. కానీ ఋగ్వేదం (1.33.8) మంత్రంలో ‘భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవారు’ అని స్పష్టంగా భూమి గోళాకారాన్ని గురించి చెప్పిన విషయం మర్చిపోతాం. 16వ శతాబ్దంలో జీవించిన కోపర్నికస్ అని చెప్తే అది విజ్ఞాన శాస్త్రం అంటాం. క్రీ.శ 476 ప్రాంతంలోని ఆర్యభట్ట భూవృత్తాకారాన్ని, భూవ్యాసాన్ని వర్ణించాడు. వరాహమిహిరుడైతే ‘పంచ భూతాత్మకమైన గుండ్రని భూమి, పంజరంలో వేలాడే ఇనుప బంతిలాగా ఖగోళంలో తారల మధ్య నిలిచి ఉంది’ అంటాడు. క్రీ.శ 1543లో మొదటిసారి ‘సౌరవ్యవస్థకు సూర్యుడు కేంద్రంగా వుంటే గ్రహాలన్నీ, భూమితో సహా అతని చుట్టూ తిరుగుతున్నాయి’ అని కోపర్నికస్ చెప్పకముందే, నవగ్రహాల మధ్యలో సూర్యుణ్ణి పెట్టి ఆరాధించే మన హైందవ దేవాలయ సంస్కృతి మరెంత గొప్పదో చూడండి. ఛార్లెస్ డార్విన్- జీవ పరిణామ వాదాన్ని వివరించాడు. దానికి ఆధునిక కాలంలో విశేష ప్రాచుర్యం ఉందని మనకు తెలుసు. కానీ పతంజలి మహర్షి తన ఆత్మ యోగ సిద్ధాంతం ద్వారా ‘మానవ జీవ పరిణామవాదం’ అందించాడు. మనిషి ప్రవృత్తులను యోగ విద్య ద్వారా దివ్యంగా మార్చే అపూర్వ సిద్ధాంతాన్ని పునఃస్థాపన చేసాడు. పశువులా జీవించే మనిషిని దివ్య మానవుడిగా ఎదిగించే రహస్యం మనకు అందించాడు. గురుత్వాకర్షణ సిద్ధాంతం- ఆపిల్- న్యూటన్ కథ వినగానే, భూమ్యాకర్షణ సిద్ధాంతం అని చదివిన మనం ‘యురేకా! అంటూ పరుగులు పెడతాం. కానీ క్రీ.శ 505లో జీవించిన వరాహమిహిరుడు తన ‘పంచ సిద్ధాంతి’ అనే గ్రంథంలో భూతంలోని ఏ భాగంలో అయినా.. అన్ని జ్వాలలు పైకెగుస్తాయి. పైకి వేసిన వస్తువు కిందకు పడుతుంది’ అని స్పష్టంగా చెప్పాడు. అలాగే బ్రహ్మగుప్తుడు (క్రీ.శ-591), భాస్కరాచార్యుడు (క్రీ.శ 1114) ఇదే విషయాన్ని దృఢపరిచారు. ఇదంతా సైన్సు కాదా?
అలాగే గణితశాస్త్రంలోని అంక గణితం, రేఖా గణితం, బీజ గణితం, భూగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రం కలగలిపి మన ప్రాచీనులు అభివృద్ధి చేసారు. వేద కల్ప సూత్రాల్లోని శుల్బ సూత్రాలు, యజ్ఞవేదికల నిర్మాణాల విషయాలు అత్యంత ప్రాచీనమైనవి. క్రీ.శ. 6వ శతాబ్దానికి చెందిన బ్రహ్మగుప్తుడు చక్రీయ చతుర్భుజ విస్తీర్ణాన్ని, దాన్ని వికర్ణాన్ని కనుగొనడంలో విశేష కృషి చేసాడు. శూన్యాంశం (సున్న) వర్గమూలం (స్క్వేర్‌రూట్) ఘనమూలం (క్యూబ్‌రూట్)లను భారతీయులే కనుగొని ప్రపంచంలోనే మొదట గణిత విప్లవం సృష్టించారు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365.2587 రోజులు పడుతుందని తన ఖచ్చితమైన గణితంతో చెప్పిన భాస్కరాచార్యుడు ఎంత గొప్ప గణితవేత్త. 1962లో మురళీ మనోహర్ జోషి ఉత్తరప్రదేశ్ పాఠ్యాంశ నిర్ణాయక కమిటీ ముందు బోధాయనుని ప్రమేయం గురించి చెప్తే అందరూ వ్యతిరేకించారు. అప్పుడు జోషి ఎడ్వర్డ్ టేలర్‌కు సంబంధించిన ‘సింప్లిసిటీ ఎండ్ ద సైన్స్’ పుస్తకం ముందు పెట్టి ఆయనే పేర్కొన్న బోధాయన ప్రమేయం మూలాలను చూపించాడు. ఈ ఎడ్వర్డ్ టేలర్ హైడ్రోజన్ బాంబు తయారీలో పాత్రధారి. నోబెల్ బహుమతి గెల్చుకొన్న విజేత. పైథాగరస్ పేర్కొన్న ప్రమేయాలకు బోధాయనుడి సూత్రాలే మూలం అన్నాడు. అదే విషయాన్ని తర్కబద్ధంగా వాళ్ల ముందు పెడితే చివరికి దానికి పైథాగరస్ బోధాయన ప్రమేయంగా’ పేరు పెట్టారట! ఎంత విచిత్రం!!
రస విద్య మన దేశంలో ఎంతో ప్రాచీనమైంది. నాగార్జునుడిని గొప్ప రస విద్య తెలిసిన వ్యక్తిగా ప్రాచీన రసాయన గ్రంథాలు పేర్కొన్నాయి. రాగి, సీసం, బంగారం, తుత్తునాగం, వెండి వంటి వాటిని శుద్ధిచేసే విధానం ఈ దేశంలో అత్యంత ప్రాచీన కాలంలోనే ఉందని దాదాపు 50 ప్రాచీన రస గ్రంథాలు తెలియజేస్తున్నాయి. రస విద్య ద్వారా సప్త్ధాతువుల్లో ఓజస్సు తగ్గకుండా ఎలా వుండాలో మనవాళ్లు విశేష పరిశోధన చేసారు. ఆచార్య నాగార్జునుడి మార్గంలోనే ఐజక్ న్యూటన్ పరిశోధనలు చేసి రస విద్య అంతు చూడాలనుకొన్నాడు. తన సహచర పరిశోధక మిత్రుడు రాబర్ట్ బోయల్‌తో కలిసి నారతీయ రస విద్య ఆధారంగానే హేమ తారక విద్యను తెలుసుకోవాలనుకొన్నా మిత్రుడు మరణించడం, పెంపుడు కుక్క కొవ్వొత్తిని తన్నడంతో ప్రయోగశాల బుగ్గి పాలైందని చెప్తారు. న్యూటన్ రసవాదంపై చేసిన అంశాలు ఇప్పటికీ డీకోడ్ చేయలేకపోతున్నారని అనేక గ్రంథాలు ఆధారం ఇస్తున్నాయి. వేల యేళ్లనాడే అనేకానేక పరిశోధనలకు నెలవైన భారత రసాయన విద్య ఎందుకు మధ్యలో లుప్తమైందో ఆలోచించాలి!
కాంతి వేగాన్ని క్రీ.శ. 1675లో రోమర్ లెక్కించాడని చెప్తారు. కానీ భారతీయ ప్రాచీనమైన ఋగ్వేదానికి సాయణాచార్యులు 14వ శతాబ్దంలోనే భాష్యం రాసారు. వారు కాంతి వేగం గురించి వ్యాఖ్యానిస్తూ- ‘అర నిమిషానికి 2202 యోజనాల దూరం ప్రయాణించు ఓ కాంతి కిరణమా! నీకు నమస్కారం’ అంటారు. ఇదే విషయాన్ని 20వ శతాబ్దానికి చెందిన శాస్తవ్రేత్తలు మెకీల్‌సన్స్, మోర్లే కాంతి వేగాన్ని సెకనుకు 1,86,300 మైళ్లు అని పేర్కొన్నారు. సాయణులు చెప్పిన విషయాన్ని క్రీ.శ. 1890లో మాక్స్‌ముల్లర్ సంకలనం చేసిన ‘ఋగ్వేదం’ అనే ఆంగ్ల గ్రంథంలో కూడా ప్రస్తావించారు.
అనంతమైన కాలగణనను అరచేయిలో చెప్పే పంచాంగం, జ్యోతిష విజ్ఞానం వదలిపెట్టి చిలకశాస్త్రాల జ్యోస్యాలకు అలవాటుపడిన మనకు మన ప్రాచీనుల పరిజ్ఞానం ఎలా అర్థమవుతుంది? సంస్కృతంలో కాలగణనకు చెప్పే ‘హోర’ హవర్‌గా మారడం ఎలా సాధ్యమైందో తెలిస్తే మన ప్రాచీనుల కాలచక్రం నేడు గ్రహించగల్గుతాం.
మన చుట్టూ నడయాడిన బాలరాజు మహర్షి గొప్పతనాన్ని ఎవరో జర్మన్‌వాళ్లు చెప్పాక గాని మనకు తెలిసిరాలేదు. ‘ఔషధం కాని మొక్కలేదు’ అన్న ఆయన సూత్రం ప్రకారం మన ప్రాచీన వైద్య గ్రంథాలలో 1,50,000 ఔషధ మొక్కల వివరాలు వున్నాయంటే మనం నమ్మగలమా! ప్రాచీన కాలంలోనే మరుగుజ్జు వృక్షాలను (బోన్సాయ్ మొక్కలు) గురించి చరకుడు తన చరక సంహితలో ‘వామన తనువృక్షాది విద్య’ ప్రత్యేక ప్రకరణలో పేర్కొని ఆచరణలో పెట్టాడు.
స్ర్తి అండాన్ని, పురుషుని శుక్రకణాన్ని టెస్ట్ ట్యూబ్‌లో కలుపుతారు. ఫలదీకరణం జరిగాక పిండాన్ని స్ర్తి గర్భంలో ప్రవేశపెడతారు. ఇది ఆధునిక కాలంలో జరుగుతున్న ప్రక్రియ. 5వేల ఏళ్ల క్రితమే వ్యాసమహర్షి గాంధారి గర్భంలోని పిండాన్ని నూటొక్క కుండల్లో ప్రవేశపెట్టి కౌరవ సంతానోత్పత్తికి ఆద్యుడయ్యాడు. గర్భ మార్పిడి, వీర్యదానం వంటి విషయాలను పిండోత్పత్తి శాస్త్రంగా ఆనాడు అభివృద్ధి పరిచారు. ఇది ఎందరికి తెలుసు?
అత్యంత ప్రాచీన కాలంలోనే భారతీయులు ఈ విషయాలను వాళ్ల కాలానికి తగినట్లుగా ఆచరణలో పెట్టారు. ఇప్పుడు గొప్ప విజ్ఞాన దేశాలుగా చెప్పేవి పుట్టని కాలంలోనే ఇలాంటి తొలి అడుగు వేసిన భారతీయ శాస్తవ్రేత్తలను గుర్తించేదాకా మనకు పోరాటం తప్పదు.
భారతీయులకు ఎన్ని విద్యలు తెలిసినా మనం ఎక్కడి నుండి వచ్చాం? మనం ఎవరం? మనం ఎక్కడికి వెళ్తాం? అన్న మూడు ప్రశ్నల చుట్టే తమ శాస్త్రాలను తిప్పుకొన్నారు. ఉత్తర కొరియా, పాకిస్తాన్‌లలాగా అణు బాంబులను చేతిలో పట్టుకొని బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడలేదు. అలాంటి మహోన్నత భారత వారసత్వం అనుసరించిన డా. ఎ.పి.జె.అబ్దుల్ కలాం కూడా భారతీయ అణు విజ్ఞానం మన రక్షణకేగాని ఇతరులపై ప్రయోగానికి కాదు అన్నాడు.
ప్రముఖ శాస్తవ్రేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన చివరి ముప్ఫై ఏళ్లలో సాధించిన సాపేక్ష సిద్ధాంతం ప్రపంచానికి కొత్త వెలుగైనా మానవ జీవన మూల్యాలను చెప్పే భారతీయ తత్వశాస్త్రాలవైపు మొగ్గు చూపాడు. అందుకే సున్నాను కనుగొన్న భారతీయులకు ప్రపంచం ఋణపడి ఉందన్నాడు ఐన్‌స్టీన్. యథార్థాలు తెలుసుకోకుండా కుయుక్తులతో కాలం గడిపే బుద్ధి జీవులు సమతుల్యమైన మనస్సుతో అధ్యయనం చేస్తారని ఆశిద్దాం.
-డా. పి భాస్కరయోగి [email protected]
(ఆంధ్రభూమి సౌజన్యం తో)