గిరిజనులలో తమ సంస్కృతి, జీవన విధానం పట్ల ఆత్మ గౌరవం కల్గించడమే ఉద్దేశంగా జనవరి 25 జైపూర్ లోని సూర్య మహల్ ప్రాంగణంలో ఉన్న మహారాజా విక్రమ దేవ్ వర్మ 1 విగ్రహానికి పూలమాల వేసి యాత్ర ప్రారంభ సభను అక్కడే నిర్వహించారు. సభలో మహారాజ విక్రమ దేవ్ వర్మ మనుమడి భార్య రాజ మాత శ్రీమతి సారిక దేవి ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. జైపూర్ నుండి జనవరి 25 ప్రారంభమైన ఈ యాత్ర 11 రోజుల అనంతరం 4 ఫిబ్రవరి విశాఖకు ముగింపు సభకు చేరుకుంది.
ఈ సందర్భంగా 11 రోజుల పాటు యాత్ర రథాన్ని గిరిజనులందరూ ఆసక్తిగా స్వాగతం పలికారు. రథంపై ఇరువైపులా గిరిజనుల, దేశ స్వేచ్చా స్వాత్రంత్యాల కొరకు, ధర్మ రక్షణకు బలిదానాలు చేసిన భగవాన్ బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు, గంటం దొర వంటి వీరుల చిత్రపటాలు, రథం ముందు భాగాన భారతమాత, మత్స్య గుండంలోని దేవత చిత్రపటాలతో అలంకరించారు. ఒడిస్సా అంతటా రథంలో జగన్నాథుని మూర్తులు ఉన్న కారణంగా రథంపైకి ఎక్కి జగన్నాథుడు మా గ్రామానికి వచ్చాడని గిరిజనుల సాంప్రదాయిక పద్ధతి లో భక్తితో స్వాగతం పలికారు.
గిరిజనులలో తమ సంస్కృతి, జీవన విధానం పట్ల ఆత్మ గౌరవం కల్గించడం ప్రధాన ఉద్దేశంగా జరిగిన యాత్రలో 21 చోట్ల గిరిజన గ్రామాల్లో సభలు జరిగాయి. అరకులోయ, పాడేరులలో పెద్ద ఎత్తున్న సభలు జరిగాయి. మరో 22 గిరిజన గ్రామాల్లో కూడా రథానికి గిరిజనులు స్వాగతం పలికారు. అక్కడా సభలు జరిగాయి. ప్రతి గిరిజన గ్రామంలో వారి సాంప్రదాయక పద్ధతిలో యాత్రకు మహిళలు కలశాలతో స్వాగతం,వీడ్కోలు పలికారు. గిరిజన మహిళలు తమ సాంప్రదాయిక పాటలను పాడారు. ప్రతి సభలోను వివిధ రంగాలలో సేవ చేస్తున్న మూలికా వైద్యులు, గిరిజన పూజారులు, వివిధ స్థాయిల్లో బహుమతులు పొందిన క్రీడాకారులను ఈ సందర్భంగా సన్మానించారు.
యాత్ర వెంబడి వస్తున్న అందరికీ ఈ గిరిజన గ్రామాల్లోనే భోజనం,వసతులను గిరిజనులు ఎంతో ఆప్యాయంగా ఇచ్చారు. గిరిజనేతర ప్రజల్లో గిరిజనుల పట్ల సోదరభావం కల్గించడం ఈ యాత్ర ద్వారా గిరిజనేతర ప్రజల్లో గిరిజనుల సంస్కృతి జీవన విధానం ఎంతో గొప్పవని అర్థం చేయించడం,గిరిజనులు మా సోదరులే! అనే బంధు భావనను కల్గించారు. ఒరిస్సా జైపూర్, విజయనగరం, ఆనందపురం, సింహాచలం, విశాఖ నగరంలో ఈ సభ, ఈ కోవకు చెందినవే! పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు ఈ సభలకు హాజరయ్యారు.
రథ యాత్ర సభలలో రాష్ట్ర ఎస్టీ కమీషన్ సభ్యురాలు శ్రీమతి వేంకట రమణమ్మ, విద్యా భారతి జాతీయ అధ్యక్షులు దూసి రామ కృష్ణజీ, వనవాసి కళ్యాణ ఆశ్రమం మార్గదర్శకులు పొన్నపల్లి సోమయాజులు, వనవాసి కళ్యాణ ఆశ్రమం జనజాతి రక్షా ప్రముఖ గిరీష్ కుబెర్, సామాజిక సమరసత జాతీయ కన్వీనర్, శ్యాం ప్రసాద్, అనేక మంది గిరిజన నాయకులు వక్తలుగా పాల్గొన్నారు.
వనవాసి కళ్యాణ ఆశ్రమం, విజయనగరం కేంద్రీయ విశ్వవిద్యాలయం, వారి కార్యకర్తలు చేసిన కృషి వల్ల యాత్ర విజయవంతమైంది. ఈ యాత్రకు యాత్రా ప్రముక్ గా ఉబ్బేటి నాగేశ్వర రావు ,యాత్ర సహ ప్రముఖ గా మోహన్ గా ఉన్నారు. వనవాసి కళ్యాణ ఆశ్రమం ఆంధ్ర ప్రదేశ్ సంఘటనా కార్యదర్శి) విద్యాధర మహంతో గారు యాత్ర ఏర్పాట్లను పర్యవేక్షించారు.