Home News హైదరబాద్ లో వేద పాఠశాలపై విరోధం – అండగా నిలచిన హిందూ సమాజం

హైదరబాద్ లో వేద పాఠశాలపై విరోధం – అండగా నిలచిన హిందూ సమాజం

0
SHARE

హైదరబాద్ లోని బోడుప్పల్ ఆర్.ఎన్.ఎస్ కాలనీలో మూడేళ్లుగా ఒక వేదపాఠశాల నడుస్తోంది. కానీ ఇటీవల అదే కాలనీకి చెందిన, కాలనీ అధ్యక్షుడు అయిన శ్రీ. బొమ్మక్ మురళి వేద పాఠశాల వల్ల ఆటంకంగా ఉందని, నిరంతర వేద పఠనంవల్ల తమ పనులకు అవరోధం కలుగుతోందని వెంటనే వేద పాఠశాల మూసివేయాలని నిర్వాహకులను హెచ్చరించారు. తక్షణం పాఠశాల మూసివేయకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని బెదిరించారు. వేద పాఠశాల పట్ల ఇటువంటి బెదిరింపులకు దిగడంపట్ల కాలనీ వాసులతో పాటు, యావత్ హిందూ సమాజంలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సహాయంతో నడుస్తున్న ఈ పాఠశాలలో 32 మంది పిల్లలు వేదం నేర్చుకుంటున్నారు. పాఠశాలకు శ్రీ. శశిభూషణ సోమయాజి  అధ్యక్షులుగా, శ్రీ. కె. సీతారామ ఘనాపాటి ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.

ఈ నెల 23న వేద పాఠశాల అధ్యక్షుడు శ్రీ. శశిభూషణ్ శర్మకు ఫోన్ చేసిన బొమ్మక్ మురళి పాఠశాల వల్ల కాలనీ వాసులకందరికి ఎంతో ఇబ్బంది కలుగుతోందని, వెంటనే పాఠశాల మూసివేయాలని లేని పక్షంలో తామే తగిన చర్యలు తీసుకోవలసివస్తుందని హెచ్చరించారు. వేదాలవల్ల ఈ రోజుల్లో ఉపయోగం లేదని, అవి చదవడం వ్యర్ధమని, కావాలంటే అడవుల్లోకి పోయి చదువుకోవాలని స్పష్టం చేశారు. అందుకు శశిభూషణ శర్మ పాఠశాల వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే తాము పాఠశాలను మరోచోటుకు మార్చడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే 32మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను తక్షణమే తరలించలేమని కొంత సమయం కావాలని సమాధానమిచ్చారు. ఈ సమాధానంతో తృప్తిపడని బొమ్మక్ మురళి మర్నాడు (24 సెప్టెంబర్) మళ్ళీ ఫోన్ చేసి అసభ్యకర పదజాలంతో దూషించడం ప్రారంభించారు. 32 మంది పిల్లలను `ఏట్లో పారేయమని’ పరుషంగా మాట్లాడారు. రెండు రోజుల్లో పాఠశాల మూసివేయకపోతే ఆ పని తామే చేస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు.

కాలనీ అధ్యక్షుడిగా అందరి బాగోగులు చూడాల్సిన బొమ్మక్ మురళి ఇలా దురుసుగా వ్యవహరించడం పట్ల వేదపాఠశాల నిర్వాహకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఒక సినిమా నిర్మాతగా వ్యవహరించిన వ్యక్తి ఇలా అనుచితంగా ప్రవర్తించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. బొమ్మక్ మురళి ఫోన్ సంభాషణల ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

వేదపాఠశాల పట్ల బొమ్మక్ మురళి అనుచిత వ్యవహారం గురించి తెలుసుకున్న వివిధ హిందూ సంస్థలు, సాధారణ ప్రజానీకం పాఠశాల నిర్వాహకులకు సంఘీభావం తెలుపుతూ ర్యాలీ, ఆ తరువాత సభ నిర్వహించారు. స్థానిక మల్లికార్జునస్వామి దేవాలయం నుండి వేద పాఠశాల వరకు సాగిన ర్యాలీలో హిందూ సమాజంలోని అన్ని వర్గాల వారు వేల సంఖ్యలో పాల్గొన్నారు. వేద భూమిగా పేరుపడిన ఇక్కడ కాకపోతే వేదపాఠశాల మరెక్కడా నిర్వహిస్తారని పలువురు అభిప్రాయపడ్డారు. వేదపాఠశాలను ఎక్కడికి తరలించాల్సిన అవసరం లేదని, తాము పాఠశాల నిర్వాహకులకు అన్నివిధాల అండగా ఉంటామని అన్నారు.

వేదపాఠశాలకు అన్నీ వైపులా నుండి మద్దతు లభిస్తున్న తరుణంలో `సమత సైనిక్ దళ్’ అనే సంస్థ వేద పాఠశాల, దానికి మద్దతు తెలుపుతున్నవారిని దూషిస్తూ ప్రకటనలు జారీచేస్తోంది. పాఠశాలకు మద్దతు తెలుపుతున్నవారిని ఆర్ ఎస్ ఎస్ గుండాలంటూ ప్రకటించిన సమత సైనిక్ దళ్  బ్రాహ్మణ వర్గాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని దూషణకు పాల్పడుతోంది. ఆ సంస్థ ద్వారా పోస్ట్ చేసినట్లు చెపుతున్న కింది పోస్టింగ్ వాట్సప్ గ్రూపులలో కనిపిస్తోంది.