- టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీకి వినతి పత్రం అందజేసిన VHP నేతలు
- గ్రూప్ 4 పరీక్షా నిర్వాహకులకు గట్టిగా సూచనలు ఇవ్వాలని డిమాండ్
- అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులను సస్పెండ్ చేయాలి
గ్రూప్ 4 పరీక్ష సందర్భంగా హిందువులను అవమానిస్తే, చూస్తూ ఊరుకునేది లేదని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది. హిందువుల సంప్రదాయాలను మంటగలిపే దుర్మార్గమైన చర్యలకు పాల్పడితే తీవ్ర ప్రతిఘటన ఉంటుందని ఘాటుగా స్పందించింది. గురువారం టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీని కలిసిన విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర బృందం వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షహాల్ లోకి అనుమతించే క్రమంలో ఇతర మతస్తులను కనీస తనిఖీ చేయని అధికారులు… హిందువుల విషయంలో ఘోరాతి ఘోరంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ మహిళల చెవి రింగులు, గాజులు, ముక్కుపుడకలతో పాటు తాళిబొట్టు.. కాలి మెట్టెలు కూడా తొలగించి పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్న విషయం మనం చాలా సందర్భాల్లో చూశామన్నానరు. అయితే జూలై 1న జరిగే గ్రూప్ 4 పరీక్ష సమయంలో ఈ విషయాన్ని ముందస్తుగా టీఎస్పీఎస్సీ చైర్మన్ సెక్రటరీకి తెలియజేస్తున్నామని.. హిందువుల విషయంలో ఇంతటి వివక్ష ప్రదర్శిస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతామని VHP నేతలు హెచ్చరించారు.
ఇటీవల భాగ్యనగరంలోని సైదాబాద్ లో గల ఓ డిగ్రీ కళాశాల పరీక్ష హాల్లో ముస్లిం అమ్మాయిలకు హిజాబ్ తీసివేయాలని కళాశాల యాజమాన్యం సూచించడంతో, సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ స్పందించి కళాశాల వారిని భయభ్రాంతులకు గురి చేసిన విషయం గుర్తు చేశారు.
మరి హిందువుల మనోభావాలను గాయపరుస్తూ.. పుస్తే మెట్టలతో సహా నగలను తొలగించి పరీక్షల్లోకి అనుమతించడం దుర్మార్గమైన చర్య అని వారు ఆరోపించారు. అదేవిధంగా ఏ పరీక్ష కేంద్రంలోనైనా హిందువుల మనోభావాలు గాయపరుస్తూ తాళిబొట్టు, కాలి మెట్టెలు, చేతి గాజులు తొలగించాలని ఒత్తిడి తెస్తే విశ్వహిందూ పరిషత్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. తప్పుగా వ్యవహరించిన వారిపై చట్టపరంగా చర్యల కోసం పోరాడుతూ సస్పెండ్ చేసేదాకా వదలమని విశ్వహిందూ పరిషత్ నేతలు చెప్పారు. ముఖ్యంగా పరీక్ష రాస్తున్న అభ్యర్థులు ఈ విషయంపై అవగాహన పెంచుకోవాలని.. తాళిబొట్టు తీయమనగానే తీసి వారి చేతిలో ఇవ్వడం సరికాదని, ప్రతిఘటించి ఎదురు దాడి చేయాలని వారు అవగాహన కల్పించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రెటరీని కలిసిన వారిలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరినాథ్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ జగదీశ్వర్ గారు, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు పాల్గొన్నారు.