- ఫిలింనగర్లో ఉద్రిక్తత
- పలువురి స్వామీజీలు అరెస్టు
- పెట్రోల్ పోసుకొని ఇద్దరు భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం
పురాతన ఆంజనేయుడి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించడంతో పాటు విగ్రహాన్ని తరలించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు మంగళవారం ఆందోళనకు దిగారు. బంజారహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉన్న సర్వే నెంబరు 403లో ఉన్న పురాతన ఆంజనేయస్వామి ఆలయంలోని విగ్రహాన్ని సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. విషయం తెలుసుకున్న వీహెచ్పీ, బజరంగ్ దళ్ నాయకులు ఫిలింనగర్‌కు వచ్చి ఆందోళన చేపట్టారు. ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో జూబ్లీహిల్స్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, బజ రంగళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్, శివస్వామి, భాగ్యనగర్ శ్రీగణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంత్ రావు, పలువురు స్వామీజీలు నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేడియం కి తరలించారు. పూజ్య స్వామిజీలను అరెస్టు చేసి గోషామహల్ స్టేడియంలో పెడితే ఉదయం నుంచి భోజనం లేకుండా స్వామిజీలు నిరాహార దీక్ష చేస్తున్నారు.
ఇదిలా ఉండగా బజరంగ్ దళ్ కు చెందిన ఇద్దరు యువకులు విగ్రహాన్ని పునఃప్రతిష్టించ కుంటే ఆత్మాహుతి చేసుకుంటామని ఒంటిపై పెట్రోలు పోసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకు న్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆందోళనకారులు వస్తుండటంతో ఫిలింనగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫిలింనగర్ బస్తీలకు చెందిన హిందువులు కూడా పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి ఆందోళనలో పాల్గొన్నారు. తొలగించిన ఆంజనేయ విగ్రహాన్ని వెంటనే పునః ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.
రెండో రోజు కూడా గోషామహాల్ స్టేడియంలో స్వామీలు నిరసన చేపట్టారు. అక్కడ పూజ్య స్వామిజీలు చేస్తున్న నిరాహారదీక్ష కు మద్దత్తుగా సంఘీభావం ప్రకటించి విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సంఘటనా మంత్రి ముడుపు యాదిరెడ్డి గారు,సుభాష్ చంద్ర జీ, శివరాం గారు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధుసంతులు నిద్రాహారాలు మాని ఆలయ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నారు, వారికి మద్దత్తుగా హిందువులందరూ హనుమంతుని ఆలయ ఆక్రమణ పట్ల తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు.