Home Telugu Articles ట్రంప్‌ గెలుపు మీడియాకు పాఠం

ట్రంప్‌ గెలుపు మీడియాకు పాఠం

0
SHARE

ఈ ఏడాది అధ్యక్షఎన్నికల ఫలితాలు అమెరికన్‌ మీడియా అంచనాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయనేది స్పష్టం. ఈ సత్యాన్ని ప్రపంచ దేశాల, మరీ ముఖ్యంగా భారతీయ మీడియా గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మాతృదేశాన్ని దాని ప్రభుత్వాన్ని విచక్షణా రహితంగా విమర్శిస్తూ, అది తమ ప్రాథమిక హక్కు అని భావించే అసమ్మతివాదులకు, దేశ సమగ్రత, సమైక్యతకు విఘాతం కల్గించే కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి మద్దతునిస్తున్న ధోరణిపై మీడియా పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా వున్నది.

అమెరికా ప్రజలకూ, ‘ఉదారవాద’ మీడియాకు మధ్య అంతరం బాగా పెరిగిపోతోంది! 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం స్పష్టం చేసిన పెద్ద సత్యమిది. ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు నిర్ణయమై, తుది పోరుకు ప్రచారం ప్రారంభమైన తదాది డొనాల్డ్‌ ట్రంప్‌ (రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, అధ్యక్ష పదవికి ఎన్నికైన నాయకుడు) అమెరికా అధ్యక్షుడు కావడానికి అర్హుడుకాడని కేవలం అమెరికన్లకు మాత్రమే కాకుండా యావత ప్రపంచానికి అమెరికన్‌ ‘ఉదారవాద’ మీడియా పదే పదే చెప్పింది.

ఒక ఆఫ్రికన్‌-అమెరికన్‌ (సంప్రదాయ పరిభాషలో నల్లజాతివ్యక్తి) ను అమెరికా అధ్యక్ష పదవికి రెండు పర్యాయాలు ఎన్నుకొన్న అమెరికాయే డొనాల్డ్‌ ట్రంప్‌ను కూడా తన సార్వభౌమాధినేతగా ఎన్నుకొన్నది. గతంలో అమెరికా ప్రజలు తమ అధ్యక్షుడుగా అణచివేయబడిన లేదా సామాన్యవర్గాల నుంచి ప్రభవించిన వ్యక్తులను ఎన్నుకొన్న చరిత్ర అమెరికా ప్రజలకు ఉన్నది. ఇరవయ్యో శతాబ్దంలో, కుట్టుపని ఉపకరణాలను విక్రయించే వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన హ్యారీ ట్రూమన్‌, కేథలిక్కు కెన్నడీ, విశ్వవిద్యాలయ విద్యావంతుడు కాని రోనాల్డ్‌ రీగన్‌, ప్రస్తుత శతాబ్దంలో ఆఫ్రికన్‌-అమెరికన్‌ బరాక్‌ ఒబామా లకు అమెరికా ఓటర్లు పట్టం కట్టారు. ఇటువంటి ఉదారవాద ధోరణిని ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలలో అమెరికన్లు తిరస్కరించారు.

ఉదారవాద దృక్పథాన్ని ఆదరించి, అనుసరించడం వల్లే అమెరికన్‌ సమాజం ఇటీవలికాలంలో కొన్ని విపరీత పరిణామాలకు లోనయిందని చెప్పక తప్పదు. ఏమిటవి? స్వలింగ వివాహాలు, కృత్రిమ గర్భధారణతో మరొకరికి పిల్లల్ని కనడం, విడాకుల సంఖ్య పెరిగిపోవడం, తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరు మాత్రమే ఉండే కుటుంబాలు, అమెరికా ఉద్యోగాలు సుదూర దేశాలకు తరలిపోవడం, లేహ్‌మాన్‌ సంక్షోభం ఇత్యాదులు. ఇవన్నీ అమెరికా ప్రజల జీవితాల్లో ఒక అనిశ్చితిని, అభద్రతను సృష్టిస్తున్నాయి. తత్ఫలితంగా వాషింగ్టన్‌ అధికార వ్యవస్థపై అన్నివర్గాల ప్రజలలోను తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా సంప్రదాయ విలువల్ని పరిరక్షించే వ్యక్తిని తమ అధ్యక్షుడుగా ఎన్నుకోవాలనే సంకల్పం అమెరికన్లలో దృఢపడింది.

స్వయంశక్తితో జీవితంలో అన్నివిధాలా ఉన్నత స్థితికి చేరుకున్న వ్యక్తి తమకు సమర్థ నాయకత్వం అందివ్వగలడని వారు భావించారు. తాము కోరుకున్న లక్షణాలు డొనాల్డ్‌ ట్రంప్‌లో వారు చూశారు. తత్ఫలితమే అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్‌ విజయం.

డొనాల్డ్‌ ట్రంప్‌ కుబేరుడు. వేలకోట్ల డాలర్ల విలువైన ఆస్తులు స్వశక్తితో ఆర్జించుకున్న వ్యక్తి. మొట్టమొదటిసారి ఒక ప్రభుత్వపదవికి, అదీ దేశాధ్యక్ష పదవికి పోటీచేసిన సాహసికుడు. సూటిగా మాట్లాడడం ఆయన తత్వం. తాను అధ్యక్షుడుగా ఎన్నికైతే అమెరికాకు వలసకారుల వెల్లువను ఎట్టి పరిస్థితులలోను అనుమతించబోనని ట్రంప్‌ పదే పదే స్పష్టంగా చెప్పారు. ఉత్తరాఫ్రికా, పశ్చిమాసియాల నుంచి అమెరికాకు ముస్లింల వలసవెల్లువను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన ఉగ్రవాద జిహాదీల విషయంలో ఏమాత్రం ఉదార వైఖరితో వ్యవహరించనని, వారిని పూర్తిగా అణచివేస్తానని ఆయన తన ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా చెబుతూ వచ్చారు. మతపరమైన ఉదారవాదానికి వ్యతిరేకంగా అమెరికన్లలో ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. ఆ ఉదారవాదం వల్లే తమ సమాజంలోని ముస్లింలు జిహాదీలుగా మారుతున్నారని అమెరికన్లు భావిస్తున్నారు. అమెరికన్‌ ప్రజానీకంలో పాదుకుపోయిన ఈ వ్యతిరేక భావనలను అర్థం చేసుకోవడంలో అమెరికన్‌ మీడియా విఫలమయింది.

అంతర్జాతీయ జిహాదీవాద ధోరణుల పట్ల ఒక్క అమెరికన్‌ సమాజంలోనే కాక, పాశ్చాత్య దేశాలన్నిటా ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్‌లలో ఎన్నికల ఫలితాలు, యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలగాలా, వద్దా అనే విషయమై బ్రిటన్‌లో ప్రజాభిప్రాయం ఇస్లామిక్‌ జిహాదీల పట్ల ఆయా దేశాలలో ఎంత వ్యతిరేకంగా ఉన్నదో స్పష్టం చేశాయి. ఈ ఏడాది అధ్యక్షఎన్నికల ఫలితాలు అమెరికన్‌ మీడియా అంచనాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయనేది స్పష్టం. ఈ సత్యాన్ని ప్రపంచ దేశాల, మరీ ముఖ్యంగా భారతీయ మీడియా గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మాతృదేశాన్ని దాని ప్రభుత్వాన్ని విచక్షణా రహితంగా విమర్శిస్తూ, అది తమ ప్రాథమిక హక్కు అని భావించే అసమ్మతివాదులకు, దేశ సమగ్రత, సమైక్యతకు విఘాతం కల్గించే కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి మద్దతునిస్తున్న ధోరణిపై మీడియా పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా వున్నది.

నేరస్థులు, పంచమాంగదళం వారిలో సుగుణాలు చూస్తూ, చొరబాటుదారులు, జిహాదీ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జాతీయ భద్రతకు ఏర్పాటుచేసిన రక్షణలను బలహీనపరచడానికి ప్రయత్నించే మేధావులు తమను తాము ఉదారవాదులుగా చెప్పుకోవడం జరుగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతలోని ‘ఉదారవాద’ మేధావులకు ఒక హెచ్చరిక అని చెప్పకతప్పదు. పారిస్‌, నైస్‌ నగరాలలో ఇస్లామిక్‌ స్టేట్‌ జిహాదీల పాశవిక దాడుల అనంతరం ఫ్రాన్స్‌కు ఇస్లామిక్‌ ఉగ్రవాదం ఎంత క్రూరమైనదో తెలిసొచ్చింది. బ్రస్సెల్స్‌ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొన్న ఉగ్రవాద దాడులతో బెల్జియం కళ్ళు తెరిచింది. ఇంకా ఏదో ఒక స్థాయిలో ఉగ్రవాద దాడుల పాశవికత్వాన్ని బ్రిటన్‌, జర్మనీ, స్పెయిన్‌ మొదలైన దేశాలూ చవిచూశాయి. ఉత్తరాఫ్రికా, పశ్చిమాసియా దేశాలకు చెందిన ‘శరణార్థులు, వలసకారులు’కు ఉదారంగా ఆశ్రయం కల్పించినందుకు ఇప్పుడాదేశాలు ఎంతైనా విచారిస్తున్నాయి.

ఇక మన దేశంలోని అస్సోం, పశ్చిమబెంగాల్‌, బిహార్‌ మొదలైన రాష్ట్రాలలోని జనాభాలో మతపరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులలో హిందువుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోందని మరి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. హైదరాబాద్‌ నగరం, దాని పరిసర ప్రాంతాలలోను, ఉత్తర మలబార్‌లోను ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రభావంలోకి పోతున్న ముస్లింల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

అమెరికా అధ్యక్ష పదవీ ఎన్నికలలో మితవాద అభ్యర్థి అయిన డొనాల్డ్‌ ట్రంప్‌కు ప్రభావశీల భారతీయ అమెరికన్లలో పలువురు మద్దతునిచ్చారు. అమెరికా నుంచి అందుకుంటున్న ఆర్థిక సహాయాన్ని – తాజాగా అందించిన సహాయం 3300 కోట్ల డాలర్లు అని కాంగ్రెస్‌ నివేదికలు సూచిస్తున్నాయి- పాకిస్థాన్‌ పూర్తిగా దుర్వినియోగపరుస్తోందన్న వాస్తవం అమెరికాకు ఇప్పుడు పూర్తిగా తెలిసివచ్చింది.

ఆసియాలో తన ప్రాబల్యాన్ని పెంపొందించుకొనే ప్రయత్నాలను బీజింగ్‌ ముమ్మరం చేసిన సమయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికవడం భావి పరిణామాల పట్ల ఎంతైనా ఆసక్తి కలిగిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోని దీవులన్నీ తనవే అని బీజింగ్‌ వాదిస్తోంది. అయితే ఆ దీవులు తమ సార్వభౌమాధికార పరిధిలో ఉన్నాయని అంటున్న ఆగ్నేయాసియా, పసిఫిక్‌ మహాసముద్ర తీరస్థ దేశాలు చైనా వాదనను అంగీకరించడం లేదు. అవి తమకే చెందాలని ఏడు దేశాలు స్పష్టం చేస్తుండడంతో చైనా వాటితో తీవ్ర ఘర్షణ పడుతోంది. ఈ ఘర్షణలపై డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా తీసుకొనే వైఖరిపై ఆ వివాదపు భావి పరిణామాలు ఆధారపడివున్నాయి.

మరో ముఖ్య విషయమేమిటంటే చైనా ఆర్థికాభివృద్ధి మాంద్యంలో పడిన తరుణంలో డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అయ్యారు. చైనా సామ్రాజ్యవాద ఆకాంక్షలను గ్రహించిన జపాన్‌, భారత్ మొదలైన దేశాలు బీజింగ్‌కు వ్యతిరేకంగా సమైక్యమవడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచ ఏకైక అగ్రరాజ్యంగా అమెరికాను నిలబెట్టాలని ట్రంప్‌ సంకల్పిస్తే అందుకు అనివార్యంగా భారత సహాయాన్ని తీసుకోవల్సి వుంటుంది. బీజింగ్‌కు వ్యతిరేకంగా తాను నిర్మిస్తున్న ఆసియా కూటమిలో భారతను విధిగా కీలక భాగస్వామిగా చేసుకోవల్సి వుంటుంది.

భారత్, అమెరికాలకు ఇదొక చరిత్రాత్మక సమయం. మాటలకు గాక చేతలకు ప్రాధాన్యమిచ్చే ఒక రాజనీతిజ్ఞుడు భారత్‌లో గత రెండున్నరేళ్ళుగా అధికారంలో ఉన్నారు. పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయడం ద్వారా, ఎన్ని సమస్యలు, చిక్కులు ఎదురైనా తాను సాహసిక నిర్ణయాలు తీసుకోగలనని ప్రధాని నరేంద్రమోదీ నిరూపించుకున్నారు. అమెరికాకు కూడా ఇప్పుడు, ఉగ్రవాద నిర్మూ లన విషయమై దృఢసంకల్పం కల వ్యక్తి అధ్యక్షుడు అయ్యారు. అక్కడా ఇక్కడా సాహసిక వ్యక్తులు ప్రభుత్వాలకు నాయకత్వం వహించడమనేది ఒక చర్రితాత్మక విషయం కాదా? జిహాదీ ఉగ్రవాదాన్ని అణచివేసి శాంతిని పెంపొందించడానికి భారత, అమెరికాలు కలసికట్టుగా వ్యవహరించగలవనే ఆశాభావానికి అది ఎంతైనా ఆస్కారం కల్గిస్తోంది.

– బల్బీర్‌ పుంజ్‌

( వ్యాసకర్త బీజేపీ సీనియర్‌ నాయకులు)

(ఆంధ్ర జ్యోతి సౌజన్యం తో)