Home News గ్రామాభివృద్ధే… దేశాభివృద్ధి…

గ్రామాభివృద్ధే… దేశాభివృద్ధి…

0
SHARE

నిజమైన గ్రామీణాభివృద్ధి అంటే ఒక గ్రామంలో పండించిన ధాన్యం, ఉత్పత్తి చేసిన వస్తువులను ఎక్కువ భాగం ఆ గ్రామస్తులే వినియోగించుకోగలగాలి. విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రతిఒక్కరికి సరైన పౌష్టికాహారం అందాలి.

‘గ్రామాభిరక్ష – నగరవత్‌ కృతా’ అన్నారు పెద్దలు. గ్రామీణాభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వాలు, సహకార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామాధికారులు, ఉపాధ్యాయులు ఐక్యంగా పనిచేయాలి. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకురావాలి. అప్పుడే గాంధీజీ కలలుగన్న ‘గ్రామ స్వరాజ్యం’ సాధ్యమవుతుంది.

జలవనరుల వినియోగం, సామాజిక అడవుల పెంపకం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, ఆరోగ్యం, విద్య, వైద్యం, మాతా, శిశు సంరక్షణ, పంచాయతీరాజ్‌ వ్యవస్థలను పటిష్టం చేయడం మొదలైన వాటి వల్ల గ్రామాలు అభివృద్ది దిశగా అడుగులు వేస్తాయి.

గ్రామాలు ఆర్థిక ప్రగతిని సాధించకుండా సామాజిక న్యాయాన్ని సాధించలేవు. ఆర్థిక ప్రగతి అంటే తమకు అవసరమైన వనరులను తామే కల్పించుకోవడం, సంపాదనా శక్తిని పెంచుకోవడం.

భారతదేశంలో సహజ వనరుల లభ్యత అధికం. అంతేకాకుండా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి కూడా ఎక్కువగానే ఉంది. కాని మనదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు వివిధ వృత్తుల పట్ల సరైన అవగాహన కరువవుతోంది.

ప్రముఖ దౌత్యవేత్త గాల్‌బ్రెత్‌ మనదేశ ప్రజల జీవనసరళిని, ఇతర దేశాల పేదరికాన్ని గురించి విశ్లేషిస్తూ ‘భారతదేశంలోని పల్లె సీమల్లో ప్రజలు దారిద్య్రాన్ని అనుభవించినప్పటికీ అనాదిగా వస్తున్న నైతిక విలువలతో, మనోధైర్యంతో వారు దారిద్య్రంలో కూడా సంతోషంగా ఉండగలిగారు’ అని చెప్పారు. అయితే నేడు మనదేశంలో రోజురోజుకి నైతిక విలువలు పతనమవుతూనే ఉన్నాయి. స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ, జయప్రకాశ్‌ నారాయణ్‌ వంటి మహనీయులు దేశాభివృద్ధిలో గ్రామాలు ప్రధాన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అని నేడు అలా జరగడంలేదు.

గ్రామీణాభివృద్ధి కేవలం ప్రభుత్వాల వల్ల సాధ్యంకాదు. గ్రామస్తులందరూ ముందుకొచ్చి అభివృద్ధిలో పాలుపంచుకోవాలి. ప్రాచీన, మధ్య యుగాల్లో ప్రజలు తరచూ తమ గ్రామాల్లోని చెరువుల్లో, కాలువల్లో పూడికలు తీసి బాగు చేసుకునేవారు. శాంతి భద్రతలను కాపాడుకునేవారు. న్యాయపరమైన సమస్యలను తమకు తామే పరిష్కరించుకునేవారు. కాని నేడు గ్రామాల్లో ఆ పరిస్థితులు కనపడటంలేదు. స్వాతంత్యానంతరం గ్రామాల్లో ప్రవేశించిన రాజకీయ కక్షల వలన నేడు గ్రామాల్లో వాతావరణమే మారిపోయింది. కుల సంఘర్షణలు, రాజకీయ సంఘర్షణలు మితిమీరి పోయాయి. ప్రభుత్వాలు గ్రామీణాభివృద్ధి కొరకు కేటాయించిన నిధులు దుర్వినియోగం పాలవు తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలందరూ ఏకతాటి పైకి వచ్చి గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలి.

గ్రామాలు ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందడానికి నాడు మహాత్మా గాంధీ ‘ఖద్దరు’ ఉద్యమాన్ని ప్రారంభించారు. స్వదేశీ భావనతో ప్రారంభమైన ఈ ఉద్యమం గ్రామాల ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచిందనే చెప్పాలి. గాంధీజీ గ్రామీణ ప్రాంతాల్లో సబ్బులు, పేపరు, అగ్గిపెట్టల తయారీ, తోళ్ల పరిశ్రమలు మొదలైన వాటిని ప్రోత్సహించి గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించారు. పారిశుద్ధ్యమే గ్రామాలకు ఆయువుపట్టు అని గాంధీజీ ప్రజలను ప్రోత్సహించేవారు. ఆయన ప్రారంభించిన ఈ ఉద్యమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములయ్యారు.

గాంధీజీ చేపట్టిన అద్భుతమైన కార్యక్రమాల్లో ‘అంటరానితనం నిర్మూలన’ చెప్పుకోదగ్గది. ఇది గ్రామాల్లో సామాజిక న్యాయాన్ని కలిగించింది. ఈ సామాజిక చైతన్యం వలన గ్రామాల్లో ఐక్యత భావం పెంపొందింది. అదే విధంగా మద్యపానం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు తెలియజేసి గ్రామీణుల చేత సారాయిని మానిపించి వారి ఆర్థిక స్థితిని గాంధీజీ మెరుగుపరిచారు. ఆనాడు గాంధీజీ చేపట్టిన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు చాలా స్ఫూర్తిదాయక మైనవి, ఆచరణ యోగ్యమైనవవి.

మిలటరీలో ఒక సామాన్య సైనికుడిగా సేవలందించిన అన్నా హజారే, మహారాష్ట్రలోని పుణెకు దగ్గరలో ‘రాలేగాఁవ్‌సింధి’ అనే గ్రామాన్ని దత్తత తీసుకొని దాన్ని సస్యశ్యామలం చేశారు. ప్రాథమిక విద్యా కేంద్రాన్ని ఏర్పాటుచేసి గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించారు. గ్రామసభలు నిర్వహించి, తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలా చేసి రాలేగాఁవ్‌సింధిని ‘ఆదర్శ గ్రామంగా’ తీర్చిదిద్దారు. నేడు దేశం నలుమూలల నుంచి అనేకమంది ఈ గ్రామానికి వచ్చి శిక్షణ పొంది తమ గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించుకుంటున్నారు. అన్నా హజారే సలహాలు దేశంలోని అనేక గ్రామాల్లో జల వనరులను వృద్ధి చేశాయి.

రాజేంద్ర సింగ్

రాజస్థాన్‌కు చెందిన రాజేంద్రసింగ్‌ గ్రామీణాభివృద్ధికి తన వంతు కృషిని అందించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం తాను చేస్త్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలేశారు. నలుగురు మిత్రులతో కలిసి 1985 అక్టోబరు 2వ తేదీన గాంధీ జయంతి నాడు ‘గోపాలపురం’ అనే గ్రామాన్ని చేరుకున్నారు. అప్పుడు ఆ గ్రామంలోని ప్రజలు రాజేంద్రసింగ్‌ బృందాన్ని వింతగా చూశారు. వారికి అక్కడ ఆదరణ లభించలేదు. అయినా వారు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. మొదట గ్రామంలో పూడుకుపోయిన చెరువులో పూడికతీత కార్యక్రమం చేపట్టారు. అప్పుడు ఆ గ్రామస్తులు అందరూ ఆశ్చర్యపోయారు. తరువాత ఊరు ఊరంతా రాజేంద్రసింగ్‌ బృందంతో జతకట్టారు. తరువాత రాజేంద్రసింగ్‌ బృందం అక్కడ చెక్‌డ్యామ్‌లను నిర్మించింది. వర్షాకాలంలో వాన నీటిని వృథా పోనివ్వకుండా సమర్థవంతంగా నిల్వచేసి ఆ చెక్‌డ్యామ్‌లలోకి పంపించారు. ఈ ‘జల ఉద్యమం’ రాజస్థాన్‌ గ్రామ ప్రజల్లో ఆశలను రేకెత్తించింది. తరువాత రాజేంద్రసింగ్‌ ‘తరుణ్‌ భారత్‌’ అనే సంస్థను స్థాపించి గోపాలపురంలోనే గాక ఇతర గ్రామాలలో కూడా ‘జల సంరక్షణ’ కార్యక్రమాలను నిర్వహించారు. ఆళ్వార్‌ జిల్లాలోని గ్రామాలన్నిటికి ఈ జల సంరక్షణ కార్యక్రమాలను విస్తరించారు. కేవలం పదేళ్ళ వ్యవధిలోనే ఆద్వార్‌ నది పరివాహక ప్రాంతాల్లో వందలాది చెరువుల్లో పూడికలు తీశారు. అంతరించిపోతుందనుకున్న ‘ఆద్వార్‌ నది’ ఉరకలెత్తే జీవన వాహినిలా తయారయ్యేందుకు కారణ మయ్యారు.

భారత మాజీ రాష్ట్రపతి డా|| అబ్దుల్‌కలాం 2002 సెప్టెంబరులో భోపాల్‌లోని ఖాండావ్‌ జిల్లాలో గల టోర్నీ గ్రామాన్ని ఒకసారి సందర్శించారు. గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొంటేనే దేశం ముందుకెళ్తుందన్నారు. ఆ గ్రామస్తులతో కలాం మాట్లాడుతున్న సమయంలో కొంతమంది బాలురు తమ గ్రామంలోని సమస్యల గురించి ఆయనకు తెలియజేశారు. వెంటనే అధికారులకు ఆ సమస్యల పట్ల దృష్టి సారించాలని కలాం సూచించారు. 15 నుంచి 20 గ్రామాలు కలసి ఒక జట్టుగా ఏర్పడి రహదారులు నిర్మించుకోవాలని, తాము తయారు చేసిన వస్తువులను తమ ఊళ్లోనే అమ్ముకోవాలని కలాం వారికి సూచించారు. ఇందుకు ప్రభుత్వాల నుంచి పూర్తి సహకారాలుంటాయని ఆయన వారికి హామి ఇచ్చారు. కలాం సూచనలు పాటించిన ఆ గ్రామస్తులు అద్భుత విజయాలను సాధించారు.

మహాత్మ గాంధీ, ఎపిజె అబ్దుల్‌ కలాం, అన్నా హజారే వంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రజలందరూ గ్రామీణాభివృద్ధిలో పాలు పంచుకోవాలి. అప్పుడే దేశం అభివృద్ధి దిశగా అడుగులేస్తుంది.

– డా|| జి.వెంకటేశ్వర్రావ్‌

(జాగృతి సౌజన్యం తో)