Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

తిలక మాఝి

వయసు చిన్న దైన వనవాసులనుగల్పి
మాత స్వేచ్చ కొరకు మాఝి పోరె
సమరమందు తాను జంపె క్లీవ్లాండును
వినుర భారతీయ వీర చరిత
…………..
సమరమందు తాను జంప క్లీవ్లాండును
తెల్ల వాడిట నిలువెల్ల వణకె
మాత స్వేచ్చ కొరకు మాఝి పోరు గనుము
వినుర భారతీయ వీర చరిత

భావము, చరిత్ర

సిద్ధూ కాను, భూమిజ్ సర్దార్ పోరాటం, వీర బుద్ధూ భగత్ పోరాటం, తానా భగత్ ఉద్యమం, బిర్సా భగవాన్ స్వాతంత్య్రోద్యమం మొదలైనవి తమ పవిత్ర భూమిపైన పరాయి పాలకులు అడుగుపెట్టకుండా నివారించాయి. ఈ మహాయోధులు చేసిన త్యాగాలు, కృషికి చరిత్ర పుటల్లో సముచిత స్థానం లభించలేదనే చెప్పాలి. బ్రిటీష్ వారు కూడా కుట్ర పన్ని ఈ ప్రాంతాలను తమ రికార్డుల్లో నమోదు చేయకుండా వాటిని సాధారణ చట్టం పరిధి వెలుపల ప్రపంచానికి తెలియకుండా ఉంచారు.

అటువంటి ప్రాంతంలో వీరోచిత పోరాటం చేసిన వాళ్ల‌లో తిల‌కా మాఝి అగ్రగణ్యులు. ఝార్ఖండ్‌లో సంతాల్ ఉద్యమంగా పేరొందిన స్వరాజ్య సమరానికి నాయకత్వం వహించిన ఈ గిరిపుత్రుడిని తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తిస్తారు. వలస పాలకుల అరాచకాలకు స్పందించి, స్వరాజ్య సమరం చేసి, ప్రాణ త్యాగం చేసిన అమరవీరుడు తిలకా మాఝి.

1750 ఫిబ్రవరి 11న బీహార్ రాష్ట్రం సుల్తాన్ గంజ్ ప్రాంతంలోని తిలక్ పూర్ అనే చిన్న గ్రామంలో ఒక సంతాల్ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ కుటుంబంలో తిలకా మాఝి జన్మించారు. ఆయన తండ్రి పేరు సుందరా ముర్ము. అడవుల్లో స్వేచ్చాజీవిగా, ఆటవిక నాగరికత నియమాల ప్రకారం, చెట్లు పుట్టల వెంబడి తిరుగుతూ, లోయల్లో, నదుల్లో ఆడుకుంటూ, వేటాడుతూ, ల‌భించిన తిండి తింటూ, త‌న బాల్యాన్ని గ‌డిపారు. అడవుల్లో గడిపిన జీవనం వారిని నిర్భయులను చేసింది. వారి ధైర్యసాహసాలు చూసి అబ్బురపడిన తోటివారు తిలకా మాఝికి “జబ్రా పహాడియా” అని బిరుదు కూడా ఇచ్చారు.

అయితే అంతటి బాల్యంలోనే వారికి బ్రిటిష్ వారి అరాచకాలు గోచరమయ్యాయి. తన కుటుంబాన్ని, తన తెగవారిని బ్రిటిష్ పాలకులు దోచుకుంటున్న విషయాన్ని తిలకా మాఝి గ్రహించారు. గిరిజన బాలలు, వృద్ధులు, మహిళలు బ్రిటిష్ వారి చేతిలో చిత్రవధలకు గుర‌వుతున్నారని, పాల‌కులు తమ భూములను, తమ పంటలను, ఉత్పత్తిని తమకి మిగల్చకుండా ఆకలి చావులకు సమీపంగా తమని తోసేస్తున్నారనీ గమనించారు. అదే సమయంలో భూమిజ్ సర్దార్ తమ భూముల కోసం చేస్తున్న పోరాటాన్ని కూడా తిలకా మాఝి చూశారు. భూస్వాములు బ్రిటిష్ పాలకులకు ఊడిగం చేస్తూ తమ సొంత ప్రజలను బలి పెడుతున్నారు.

తిలకా మాఝి యువ హృదయంలో ఈ అన్యాయం పట్ల ఆగ్రహం రగిలింది. శనాచార్ (బనాచారి జోర్) అనే ప్రదేశంలో మొదటిసారి తిలకా మాఝి బ్రిటిష్ వారిపై స్వరాజ్య సమరానికి పిలుపునిచ్చారు. భాగల్పూర్, సుల్తాన్ గంజ్ అడవుల వైపు తిలకా నేతృత్వంలో గిరిజన యోధులు ముందుకి కదిలారు. అది 1767 సంవత్సరం, అప్పుడు తిలకా మాఝి వయసు 17 ఏండ్లు. రాజ్ మహల్ ప్రాంతంలో వారు బ్రిటిష్ సైనికులతో తలపడ్డారు.

తమపై జరుగుతున్న పోరాటం తీవ్రత చూసి ఆందోళన చెందిన బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేకంగా క్లీవ్లాండ్ అనే అధికారిని నియమించింది. క్లీవ్లాండ్ తన సైన్యం, పోలీసులతో కలిసి రాజ్ మహల్ చేరుకున్నాడు. తిలకా మాఝి పోరాటం కొనసాగుతూనే ఉంది. దేశీయంగా, స్థానికంగా తయారు చేసిన ఆయుధాలతో, తన తోటివారైన వనవాసీ సైనికులతో కలిసి తిలకా మాఝి ముంగేర్, భాగల్పూర్, సంతాల్, పర్గణా ప్రాంతంలో చాకచక్యంగా, అడవులు, లోయలు, నదుల మధ్య శత్రువుపై పోరాటం కొనసాగించారు.

క్లీవ్లాండ్, సర్ అయిర్ ఈ శౌర్యమంతులను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 1784 లో జనవరి 13 వ తేదీన గుర్రంపై అడవిలోకి వచ్చిన అధికారి క్లీవ్లాండ్‌ని ఒక తాటిచెట్టుపై దాగి ఉన్న తిలకా మాఝి బాణంతో హతమార్చారు. ఇది విన్న బ్రిటిష్ ప్రభుత్వం కంపించిపోయింది. సైనికులు, అధికారులు భయంతో వణికిపోయారు.

తిలకా మాఝి నిర్భయ పోరాటానికి అలజడి చెందిన బ్రిటిష్ ప్రభుత్వం ఎలాగైనా వారిని పట్టుకుని హతమార్చాలని నిర్ణయించింది. యుద్ధంలో విజయాల పట్ల ఆనందంతో సంగీతం, నృత్యాలతో వేడుక చేసుకుంటున్న తిలకా సంతాల్ బృందంపై దేశద్రోహి అయిన ఒక గిరిజన భూస్వామి సహాయంతో దాడి చేసి, అనేకమంది సైనికులను హతమార్చారు. కొంతమందిని బందీలుగా పట్టుకున్నారు.

తిలకా మాఝి తప్పించుకుని సుల్తాన్ గంజ్ కొండల్లో దాక్కున్నారు. అయితే బ్రిటిష్ సైన్యం తన అన్వేషణ కొనసాగించింది. అజ్ఞాతంలో జీవిస్తున్న సంతాల్ సైన్యం కష్టాల పాలైంది. తిండి నీరు లేక నీరసించింది. సైనికులు ప్రాణాలు కోల్పోసాగారు. అయితే అలాంటి పరిస్థితిలో కూడా సంతాల్ సైన్యం గెరిల్లా యుద్ధం కొనసాగించింది. కానీ తిలకా మాఝి చివరకి పట్టుబడ్డారు. అత్యంత అమానుషమైన రీతిలో నాలుగు గుర్రాలకు కట్టి, నేలపై ఈడుస్తూ భాగల్పూర్‌కి వారిని తరలించింది బ్రిటిష్ సైన్యం. 1785లో ఒక మర్రి చెట్టుకి ఉరివేయడంతో వనవాసీ వీరుడు అమరులైనారు.

తిలకా మాఝి బ్రిటిష్ వలస పాలన, దోపిడీపై సమరం చేసిన తొలి భారతీయ వీరుడు. ఈ స్వరాజ్య సమరం అనంతరం 90 ఏళ్లకు 1857లో స్వాతంత్ర్య సంగ్రామంగా తిరిగి ప్రారంభమైంది.

భాగల్పూర్ కోర్టులో తిలకా మాఝి విగ్రహం ఏర్పాటు చేశారు. వారి గౌరవార్థం ఒక విశ్వవిద్యాలయానికి తిలకా మాఝి పేరు పెట్టారు.

కేవలం 35 సంవత్సరాలకే అత్యున్నత త్యాగం చేసిన తిలకా మాఝి చరిత్రలో చేతులెత్తి మొక్కదగిన మహనీయుల్లో ఒకరు.

“ఈ భూమి నా తల్లి.. నా మాతృభూమి. ఈ భూమి కోసం నేను ఎవరికో శిస్తు చెల్లించడం ఏమిటి?’ అని అతి లేత వయసులోనే గంభీరంగా ప్రశ్నించి, వీరోచితంగా, విశ్రాంతి లేకుండా పరాయిపాలన పైనా, అన్యాయమైన దోపిడీపైనా పోరాటం చేసి, తన జీవితాన్నే కాదు, ప్రాణాన్నే త్యాగం చేసిన తిలకా మాఝి జీవన విధానం భారతీయులకు స్ఫూర్తిమంతం.

రాంనరేష్