ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
తెల్లవాని తలను తెగటార్చెనుయ్యాల
శిస్తు కట్టనంటు శివమునెత్తి
ఉద్యమంబు జేసి ఉరిముద్దిడెజూడు
వినుర భారతీయ వీర చరిత
భావము
రేనాటివీరుడుగా, సైరా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పలనాడు ప్రాంతంలో ఆంగ్లేయుల శిస్తు వసూలుకు వ్యతిరేకంగా స్వరాజ్య సమరం చేశారు. తహసీల్దార్‌ను హతమార్చారు. తెల్లవారికి గుబులుపుట్టించి, స్వేచ్ఛ కొరకు అమరుడైన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వీర చరిత విను ఓ భారతీయుడా!
చరిత్ర
ఆంగ్లేయులపై దేశంలోనే తొలిసారిగా స్వరాజ్య సమర శంఖారావాన్ని పూరించి, వారి పాలిట సింహ స్వప్నమై, రాయలసీమ ముద్దుబిడ్డగా, రేనాటి వీరుడిగా, సైరా నరసింహారెడ్డిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఖ్యాతి పొందారు. శిస్తు వసూలులో తెల్లదొర పెత్తనంపై దండయాత్ర చేసి, చివరికి ఉరికొయ్యకు వేలాడి స్వాతంత్య్రోదమానికి బీజం వేశారు.
‘సైరా నారసింహారెడ్డి.. నీ పేరే బంగారు కడ్డీ’ అనే జానపద గేయం రాయలసీమ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీర మరణం పొంది 174 సంవత్సరాలు అయింది.
నేపథ్యం
కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సీతమ్మ, పెద్ద మల్లారెడ్డి దంపతుల కుమారుడు నరసింహారెడ్డి. హైదరాబాద్ నవాబులు రాయలసీమ జిల్లాలైనా కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారిని దత్త మండలాలుగా ప్రకటించి బ్రిటీష్ వారికి ధారాదత్తం చేశారు. ఇందులో నొస్సం ప్రధాన కేంద్రంగా బ్రిటీష్ పాలన కొనసాగేది. నరసింహారెడ్డి తాత జయరామిరెడ్డికి పన్నులు, భూమిశిస్తూ వసూలు చేసే అధికారం అప్పగించారు. ఆయన మరణానంతరం వారసత్వంగా ఈ బాధ్యత నరసింహారెడ్డికి వర్తించింది. బ్రిటీష్ నిరంకుశ పాలనకు ప్రతిఘటించి మొదటిసారిగా 1842లో వారిపై స్వరాజ్య సమర బావుటాను నరసింహారెడ్డి ఎగరవేశారు. నరసింహారెడ్డి తెగువకు బ్రిటీష్ సామ్రాజ్యం వణికిపోయింది.
తన స్వరాజ్య సమరంలో కోవెలకుంట్ల తహసీల్దార్‌ను నరసింహారెడ్డి నరికి చంపారు. బ్రిటీష్‌వారి ఖజానాను కొల్లగొట్టారు. ఈయన అనుసరిస్తున్న విప్లవ పంథాకు ఆంగ్లేయులు వణికిపోయారు. ఆయనను పట్టించిన వారికి 10వేల దినారాలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఎట్టకేలకు 1847లో సంజామల మండలం జగన్నాథగుట్టపై నరసింహారెడ్డిని ప్రాణాలతో పట్టుకున్నారు. బందిపోటు దొంగగా ముద్రవేశారు. 1847 ఫిబ్రవరి 22న కోవెలకుంట్ల పట్టణ సమీపంలోని జుర్రేరు ఒడ్డున ఉరిశిక్ష అమలు పరిచారు. అయితే నరసింహారెడ్డి అమరులైన వందేళ్లకు స్వాతంత్య్రం సిద్ధించింది. నాటి నుంచి భారతీయులు ఆయనను రేనాటి సూర్యుడిగా పిలుచుకుంటుంటారు. ఇప్పటికీ ఆయన స్వరాజ్య సమరం సాగించిన ప్రాంతంలో నరసింహారెడ్డిపై జానపద గేయాలు నేటికీ వినిపిస్తూనే ఉంటాయి.
-రాంనరేష్