Home News  అమెరికా, బ్రిటన్ ల మానవహక్కుల ఉల్లంఘన

 అమెరికా, బ్రిటన్ ల మానవహక్కుల ఉల్లంఘన

0
SHARE

హిందూ మహాసముద్రంలో అత్యంత వ్యూహాత్మక ప్రాంతం చాగోస్. ఇప్పుడు ఈ ప్రాంతం వివాదాస్పదమవుతోంది. అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు రెండూ అక్కడ ఉన్న ప్రజలను జాతిపరంగా హింసిస్తూ, వారి స్వదేశానికి తిరిగి రాకుండా నిరోధిస్తున్నాయి. ఇది చాలాపెద్ద నేరమని పేర్కొంటూ హ్యుమన్ రైట్స్ వాచ్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాదు హిందూ మహాసముద్రంలోని చాగోస్ ద్వీప సమూహంలోని వారు స్వదేశంలో తిరిగి జీవించే హక్కుతో సహా చాగోసియన్ ప్రజలకు రెండు ప్రభుత్వాలు కూడా పూర్తి నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్  చేస్తోంది.

దాదాపు 106 పేజీలు ఉన్న ఈ నివేదికలో దీనికి సంబంధించిన కీలకమైన అంశాలన్నీ పొందుపర్చారు. 1969లో బ్రిటన్ వలస పాలన నుంచి మారిషస్ స్వాతంత్య్రం పొందడానికి ముందు వరకు చాగోస్ దీవులు మారిషస్ లో భాగంగా ఉండేవి. అయితే బ్రిటన్ మారిషస్ ను చట్టవిరుద్ధంగా విభజించలేదని అంతర్జాతీయ న్యాయస్థానం నాన్ బైండింగ్ ఒపీనియన్ ను వ్యక్తం చేసింది. దాంతో అమెరికా సైనిక స్థావరం ఉన్న డియోగో గార్సియా తో సహా చాగోస్ దీవులను మారిషస్ కు తిరిగి అప్పగించాల్సిందేనని ఐరాస సాధారణ సభ్ర బ్రిటన్ ను డిమాండ్ చేస్తూ తీర్మానించింది. దీనికి కట్టుబడి ఉండాలని పోప్ ఫ్రావిన్స్ సైతం చెప్పారు. కానీ ఇందుకు బ్రిటన్ అంగీకరించట్లేదు. చాగోస్ దీవులు వదులుకునే ప్రసక్తే లేదని బ్రిటన్ తేల్చి చెబుతోంది. అయితే తాజాగా చాగోస్ దీవులపై సార్వభౌమాధికారం, హక్కులు తమవేనని మారిషస్ ప్రభుత్వం పేర్కొంది. అక్కడి ప్రజలను తిరిగి తమ దేశంలోకి తీసుకుని వచ్చే ప్రయత్నం మారిషస్ ప్రభుత్వం చేస్తోంది. దీన్ని బ్రిటన్ వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే బ్రిటీష్ హిందూ మహాసముద్ర ప్రాంతంగా పేర్కొంటున్న ఈ ద్వీప సముదాయం 1814 నుంచి తమ ఆధీనంలోనే ఉందనీ, వ్యూహాత్మకంగా ఇది కీలకమైన ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో తాము కొనసాగుతామని ఆ దేశం చెబుతోంది. అంతేకాకుండా  రక్షణ అవసరాల నిమిత్తం డియోగో గార్సియాను ఉపయోగించుకునేందుకు 1966లో బ్రిటన్ తో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. సైనిక స్థావరం ఏర్పాటుకు వీలుగా బ్రిటన్ అక్కడ నుంచి సుమారు 2వేల మందిని బలవంతంగా తరలించింది. ఇది అత్యంత హేయమైన చర్య, మానవత్వానికి మచ్చలాంటిది అని ఐరాస పేర్కొంది. ఆ సమయంలో వ్రాసిన పత్రాలు, ఇటీవలి కాలంలో బహిర్గ‌త‌మ‌య్యాయి. హ్యూమన్ రైట్స్ వాచ్ కూడా స‌మీక్షించింది.

ఇక బ్రిటన్, అమెరికా రెండు దేశాల మద్దతుతో చాగోసియన్లు తమ సొంత దేశమైన మారిషస్ కు వెళ్లకుండా నిరోధిస్తూ అక్కడి ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా 2022లో బ్రిటన్ ప్రభుత్వం చాగోస్ ప్రజల సమస్య గురించి వారితో చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించింది. కానీ అవేవీ సఫలం కాలేదు. వారికి ఇవ్వవలసిన నష్టపరిహరం గురించి కూడా అందులో ఎక్కడా పేర్కొనలేదు.

బ్రిటన్ ప్రభుత్వం చాగోస్ దీవుల విషయంలో అత్యంత క్రూరమైన నేరానికి పాల్పడుతోంది. ఆ దీవుల్లో నివసించే చాగోసియన్లందరినీ అసలు ఎలాంటి హక్కులు లేని ప్రజలుగా భావిస్తోందని హ్యూమన్ రైట్స్ వాచ్ సీనియర్ న్యాయ సలహాదారు, నివేదిక ప్రధాన రచయిత క్లైవ్ బాల్డ్విన్ అన్నారు. బలవంతంగా తరలించిన చాగోసియన్లందరికీ అమెరికా, బ్రిటన్ దేశాలు కలిసి తగిన నష్టపరిహారాన్ని అందించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ విషయంపై అమెరికా, బ్రిటన్ లతో పాటు మారిషస్ అధికారులు కలిపి దాదాపు 57మందిని హ్యుమన్ రైట్స్ వాచ్ ఇంటర్వ్యూ చేసింది. అనేక రకాలైన పత్రాలను సమీక్షించింది. ఈ సమీక్షలో అది మూడు కీలకమైన నేరాలను గుర్తించింది. బ్రిటన్, అమెరికా ఒప్పందం మూలంగా ప్రజలను బలవంతంగా పంపించడం, రెండోది చాగోసియన్లను వారి స్వదేశానికి వెళ్లకుండా నిరోధించడం, ఇక మూడోది వారిని జాతి పేరుతో నానారకాలుగా హింసించడం. ఈ మూడు కారాణాల వల్ల వారు అనేక రకాలైన వివక్షలకు లోనయ్యారు. పేదరికంలో జీవిస్తున్నారు. ప్రస్తుతం వేలాది మంది చాగోసియన్లు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్నారు. ఎక్కువ మంది మారిషస్, బ్రిటన్లలో నివసిస్తున్నారు.

అసలైతే ఈ చాగోసియన్లు ప్రధానంగా 18వ, 19వ శతాబ్దాలలో ఫ్రెంచ్, బ్రిటీస్ పాలనలో బానిసలుగా ఉండేవారు. అప్పడే జనావాసాలు లేని చాగోస్ దీవులకు బలవంతంగా తీసుకుపోబడ్డారు. అప్పుడు చాగోస్ మారిషస్ లో భాగంగా బ్రిటన్ కల్నల్ పరిపాలనచే నిర్వహించబడేది.  వీరిది ప్రత్యేకమైన భాష, సంస్కృతి ఉంది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాల ప్రకారం స్థానిక ప్రజలు. అయితే UK మరియు US ప్రభుత్వాలు తమ స్వంత ప్రయోజనాల కోసం చాగోసియన్‌లను హక్కులు  లేని ప్రజలుగా పరిగణించాయి, వారితో సంప్రదింపులు జరపకుండా, వారికి తగిన పరిహారం లేకుండా స్వదేశం నుండి శాశ్వతంగా వారిని తరలించారు. ఇటు తిరిగి వీరు బ్రిటన్ వెళ్లాలన్నా భద్రతా ఇంకా వారికి పెట్టాల్సిన ఖర్చు గురించి ఆలోచిస్తూ బ్రిటన్ ప్రభుత్వం వారు తిరిగి యూకె రావడానికి పదేపదే నిరాకరించింది. గత 20సంవత్సరాలలో చాగోసియన్ల పట్ల ఆ దేశం వ్యవహరించిన తీరు అత్యంత అవమానకరమైనది అని ఈ నివేదికలో చెప్పబడింది.

ఈ దిశలో UK , US ప్రభుత్వాలు చాగోసియన్ ప్రజలకు పూర్తి నష్టపరిహారం అందించాలని హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది. చాగోస్ దీవులకు శాశ్వతంగా తిరిగి వచ్చే చాగోసియన్లపై  ఇప్పుడు ఉన్న నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలనీ. UK ఇంకా  US చాగోస్ ద్వీపాన్ని పునరుద్ధరించడానికి ఆర్థికంగానూ, ఇంకా ఇతర సహాయాన్ని అందించాలనీ, చాగోసియన్లు  తిరిగి రావడానికి, గౌరవంగా జీవించడానికి పని చేయడానికి తగిన వీలు కల్పించాలి అని హ్యుమన్ రైట్స్ వాచ్ తమ నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా యూకె, యూఎస్ ప్రభుత్వాలు ఈ ప్రజలపై  చేసిన నేరాలపై సమర్ధవంతమైన పరిశోధన నిర్వహించాలని  పేర్కొంది.

అంతే కాకుండా మారిషస్ ప్రభుత్వం వారి జాతీయత లేదా ప్రస్తుత నివాసంతో సంబంధం లేకుండా చాగోస్పియన్లను, తిరిగి వారి స్వంత దేశానికి  రావడానికి బహిరంగంగా మద్దతు ఇవ్వాలనీ, వారిని స్థానిక ప్రజలుగా గుర్తించాలని హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది. మారిషస్, UK మరియు సీషెల్స్ తమ భూభాగంలో నివసిస్తున్న చాగోసియన్లకు సమానమైన హక్కులు అందివ్వాలనీ, వారు ఎక్కడ ఉండాలనుకుంటే ఆ దేశ పౌరసత్వం ఇవ్వాలని హ్యుమన్ రైట్స్ వాచ్ పేర్కొంది.

“UK మరియు US ప్రభుత్వాలు చాగోసియన్‌లను గౌరవప్రదంగా వారి స్వదేశానికి తిరిగి రావడానికి రాజకీయ మరియు ఆర్థిక నిబద్ధత కలిపించి వారికి వ్యతిరేకంగా చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి.”అని ఈ నివేదికలో చెప్పింది.