Home Uncategorized విశ్వమంతటా ఒకే చైతన్య శక్తి ఉంది : ప్రకృతి వందన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్...

విశ్వమంతటా ఒకే చైతన్య శక్తి ఉంది : ప్రకృతి వందన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా.మోహన్ భాగవత్

0
SHARE

పర్యావరణం అనే మాట ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. అలాగే ప్రతి సవత్సరం పర్యావరణ దినోత్సవం జరపడం కూడా ఆనవాయితీ అయింది. దీనికి కారణం ఏమిటంటే ఇప్పటి వరకు ప్రపంచంలో అనుసరిస్తున్న జీవన శైలి పర్యావరణానికి అనుకూలంగా లేదు. ప్రకృతిని జయించి మనిషి జీవించాలనే ధోరణిలో ఉంది ఆ శైలి. ప్రకృతి మనిషి వాడుకునేందుకే ఉన్నదని, ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనిషికి లేదనే ధోరణి అది. ప్రకృతిపై మనిషికి పూర్తి అధికారం ఉందని భావించి సాగే జీవన శైలి. అలా మనం 200 నుంచి 250 సంవత్సరాలుగా జీవిస్తున్నాం. అలాంటి జీవన శైలివల్ల కలిగే దుష్పరిణామాలు ఇప్పుడు మనకు ఎదురవుతున్నాయి. వాటి భయంకర ఫలితాలు మనం అనుభవిస్తున్నాం. ఇలాగే సాగితే కొంతకాలానికి మనం కూడా మిగలం. అందుకనే ఇప్పుడు మానవులు ఆలోచనలో పడ్డారు. పర్యావరణ పరిరక్షణ తప్పనిసరి అని గ్రహిస్తున్నారు. పర్యావరణ దినోత్సవం పాటిస్తున్నారు. 2000 సంవత్సరాలనాటి, ముఖ్యంగా గత 300 ఏళ్ల నుంచి మరచిపోయిన పద్దతులను తిరిగి గుర్తుచేసుకుంటున్నారు.

కానీ భారత్ లో జీవన శైలి, పద్దతులు పూర్తి భిన్నంగా ఉంటాయి. జీవన సత్యాన్ని మన పూర్వీకులు సంపూర్ణంగా అర్ధం చేసుకున్నారు. అందుకనే మనిషి కూడా ప్రకృతిలో భాగమేనని గ్రహించారు. శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి. అవి సక్రమంగా పనిచేసినప్పుడే శరీరం బాగుంటుంది. అలాగే ప్రాణమున్నంతవరకే శరీరం పనిచేస్తుంది. ప్రాణం పోతే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. కొంతసేపటికి మెదడు పనిచేయడం మానేస్తుంది. అలా ఒక్కొక్క అవయవం నిష్క్రియమై చివరికి చనిపోతాము. ఇలా శరీరం వివిధ అంగాలపై ఆధారపడి ఉంటే, ఆ అంగాలు శరీరంలోని ప్రాణం శక్తిపై ఆధారపడి ఉన్నాయి. అదే పద్దతిలో ప్రకృతికి, మనకు మధ్య సంబంధం ఉంది. మనం ప్రకృతిలో భాగం. ఆ ప్రకృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం. మనం జీవించడం కోసం ప్రకృతి నుంచి కొన్ని తీసుకుంటాము. అంతేకాని ప్రకృతి శోషణ చేయం. ఇదే జీవన పద్దతిని మన పూర్వీకులు అర్ధం చేసుకున్నారు, అనుసరించారు. సాయంత్రం చీకటిపడిన తరువాత చెట్లను ముట్టుకోకూడదని, అవి కూడా నిద్ర పోతాయని చెపుతారు. చెట్లకు కూడా ప్రాణం ఉంది. అవి ఈ ప్రకృతిలో భాగం. ప్రకృతిలో ప్రాణులు ఎలాగో చెట్లు కూడా అలాంటివే. ఆధునిక విజ్ఞానం వ్యాప్తిచెందడానికి వేల సంవత్సరాల పూర్వం నుంచే ఈ జ్ఞానం మనకు ఉంది. రాత్రి వేళల్లో చెట్లను తాకకూడదని మన దేశంలో నిరక్షరాస్యుడైన సామాన్యుడికి కూడా తెలుసు.

జీవితంలో ఏం చేయాలి, ఏం చేయకూడదన్నది మనకు పరంపరాగతంగా తెలుసు. పక్షులకు గింజలు వేయడం, ఆవుకు గడ్డిపెట్టడం, కుక్కలకు ఆహారం వేయడం, క్రిమికీటకాలకు కూడా తినేపదార్ధాలు వేయడం, గ్రామంలో ఎవరూ ఆకలితో లేకుండా చూసిన తరువాతనే భోజనం చేయడం వంటివి ప్రతి ఒక్కరూ పాటించేవారు. వీటిని ఐదు రకాల బలులు అనేవారు. వీటిని ఇచ్చిన తరువాతనే గృహస్తు భోజనం చేసేవాడు. ఈ బలి కార్యక్రమంలో ప్రాణి హింస ఎక్కడా లేదు. పైగా ఇంట్లో వండిన పదార్ధాలు వివిధ ప్రాణులకు పెట్టాలి. ఈ ప్రాణులన్నింటిని పోషించడం మనిషి కర్తవ్యం. ఎందుకంటే మనిషి వీటన్నిటిపైనా ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. ఈ విషయాన్ని అర్ధం చేసుకుని అందుకు అనుగుణంగా మనం జీవిస్తాం. అందుకనే ఇక్కడ నదులను కూడా పూజిస్తారు. చెట్లను పూజిస్తారు. పర్వతాలకు ప్రదక్షిణ నమస్కారాలు చేస్తారు. గోవులను పూజిస్తారు, పాములను కూడా పూజిస్తారు.

విశ్వమంతటా ఒకే చైతన్య శక్తి వ్యాపించి ఉందని గుర్తించి ఈ విశ్వంలోని అన్నీ జీవరాశులపట్ల ఆత్మీయత, స్నేహం, శ్రద్ధా భావాలను కనబరచడం ఈ జీవన పద్దతి.

పరస్పర భావయంతమ్ అని భగవద్గీత చెపుతుంది. దేవతలపట్ల గౌరవభావాన్ని చూపు. అప్పుడు దేవతలు కూడా నీ పట్ల సాదరపూర్వకంగా వ్యవహరిస్తారు. పరస్పర సహకారం, గౌరవభావం వల్ల సృష్టి నడుస్తుందన్నది మన జీవన శైలి. కానీ పెడమార్గం పట్టి మనం ఆ జీవన శైలిని మరచిపోయాం. అందుకనే ఇప్పుడు పర్యావరణ దినోత్సవమని ఆ జీవన శైలిని గుర్తుచేసుకోవలసి వస్తోంది. ఆ పని చేయవలసిందే. ఈ పని ప్రతి ఇంటిలో జరగాలి. ఈ సంవత్సరం ఆగస్ట్ 30న అలాంటి కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం. కానీ మన దేశంలో నాగపంచమి చేస్తారు, గోవర్ధన పూజ చేస్తారు, తులసీ వివాహం చేస్తారు. ఇవన్నీ చేస్తూ మళ్ళీ మన జీవితాల్లో ఆ సంస్కారాలను తెచ్చుకోవాలి. అప్పుడు యువతరం కూడా ఈ సంస్కారాలను అందిపుచ్చుకుంటారు. మనం ఈ ప్రకృతిలో భాగమని గుర్తిస్తారు, గ్రహిస్తారు. ప్రకృతి నుంచి తీసుకుని, దానిని పరిరక్షించాలి. అంతేకాని ప్రకృతిని జయించాలనుకోకూడదనే భావాలు యువతరంలో కలగాలి. అప్పుడు గత 300-350 ఏళ్లుగా జరిగిన విధ్వంసాన్ని 100-200 ఏళ్లలో సరిచేసుకునేందుకు వీలు కలుగుతుంది. ప్రపంచం సురక్షితంగా ఉంటుంది. మానవజాతి సురక్షితంగా ఉంటుంది. జీవనం సౌందర్యమయమవుతుంది.

ఈ కార్యక్రమం ఏదో వినోదం కోసం చేస్తున్నామని అనుకోకుండా సంపూర్ణ సృష్టిని పరిరక్షించడం కోసం, మన జీవితాలను సౌందర్యవంతంగా చేసుకునేందుకు మనం ఈ కార్యం చేపట్టమనే భావన ఉండాలి. ఈ ప్రకృతి సందేశాన్ని మన జీవితంలోని అనుసరించి, అమలుపరచాలి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ, ఉత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నా ప్రసంగాన్ని పూర్తిచేస్తున్నాను.