రాష్ట్రీయ స్వయంసేవక్‌సంఘ్ స్థాపకులు డా||కేశవరావ్ బలీరాం హెడ్గేవార్‌ను స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా సంఘటితం కావాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ చాలక్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు.
ఆర్.ఎస్.ఎస్. స్థాపించి 91 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పాంచజన్య, ఆర్గనైజర్ వారపత్రికలు ’90 years of RSS’ అనే పేరుతో ప్రత్యేక సంచికలను ప్రచురించాయి. 1925లో స్థాపించిన నాటి నుండి సంఘ ప్రస్థానాన్నీ, పరిణామాన్నీ ఈ సంచికలలో వివరించారు. ఆ సంచికలను 01 డిసెంబర్ 2016 న కొత్త దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భాగవత్ విడుదల చేశారు. అనంతరం ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు.
‘పవిత్రమైన హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతినీ, హిందూ సమాజాన్నీ సంరక్షించడానికి, ఈ హిందూ రాష్ట్రాన్ని స్వతంత్రం చేయడానికి నేను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యుడనవుతున్నానని భగవంతుని సాక్షిగా, నా పూర్వీకుల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను…”. ఇది 99 మంది ఎంపిక చేయబడిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు మార్చి 1928లో నాగపూర్‌లో స్వీకరించిన ప్రతిజ్ఞ. అప్పటి సర్‌సంఘచాలక్ డా||కేశవరావ్ బలీరాం హెడ్గేవార్ ఈ ప్రతిజ్ఞ మూల ప్రతిని మరాఠీ భాషలో స్వంత దస్తూరిలో వ్రాశారు.
మన భిన్నత్వంపై విశ్వాసం కల ప్రతి ఒక్కరూ హిందువే. తమను తాము హిందువు అని గాని, భారతీయుడని గాని చెప్పుకొన్నప్పటికీ – దాని అర్థం ఒకటే. ఈ దేశంలో మన పూర్వీకులు ఎవరు? హిందువులే. వసుధైక కుటుంబాన్ని దర్శించాలంటే మొదటగా హిందువులనే సంఘటితం చేయాలి.
అసలు సమస్య ఇతరులతో కాదు. మొదట మన ఇంటిని మనం చక్కదిద్దుకోవాలి. వసుధైక కుటుంబం గురించి మనం మాట్లాడతాం. కాని మన స్వంత ప్రజలైన షెడ్యూలు కులాల, తెగలపై వివక్ష చూపుతున్నాం. దీనిని వెంటనే నిలువరించాల్సిన అవసరం ఉంది. సంఘానికి సంబంధించినంతవరకు వ్యక్తిత్వానికే ప్రాధాన్యం కాని, వారి వారి వృత్తులకు కాదు.
ఒక ప్రపంచ నాయకునిగా భారతదేశం మొదట తనను తాను వ్యవస్థీకృతమూ, బలోపేతమూ చేసుకోవాలి, ఆ తరువాతే విశ్వస్థాయిలో వ్యవస్థీకృతం చేయగలం’ అని భాగవత్ అన్నారు.
సంఘం గురించి తెలుసుకోవడానికి పాంచజన్య, ఆర్గనైజర్ పత్రికలు బాగా ఉపయోగపడతాయని, మరింత ఎక్కువగా తెలుసుకోవాలని అభిలషించేవారు సంఘ శాఖను దర్శించాలని మోహన్‌జి అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించడానికి వారు ప్రాధాన్యమిచ్చారు.
సంఘం ఎటువంటి వాదనలు చేయకుండా, వ్యతిరేకతకు, వివాదాలకు దూరంగా ఉంటుందని, అందరితోను సుహృద్భావ, స్నేహ సంబంధాలు నెరపడానికే తాము ప్రాధాన్యమిస్తామని మోహన్‌జి అన్నారు. ఆర్.ఎస్.ఎస్. గురించి ఎవరైనా తెలుసుకో వాలని కోరుతున్నట్లైతే, పక్షపాత దృష్టికి దూరంగా ఉంటూ, నిష్పాక్షికంగా దీనిని పరిశీలించడం అవసరం. మీరు ముందే నిర్ణయించిన అభిప్రాయాలకు కట్టుబడి ఉంటే దురభిప్రాయాలు తప్పని సరిగా కలుగుతాయి అని భాగవత్ ఉద్ఘాటించారు.
‘శాఖలను నిర్వహిస్తూ, వ్యక్తి నిర్మాణం చేయడమే సంఘ ఏకైక లక్ష్యం. సంఘం గురించి తెలుసు కోవాలనుకుంటే శాఖను దర్శించడం కంటే వేరే మార్గం లేదు. సంఘం గురించి మాట్లాడినంత మాత్రం చేత సంఘం గురించి తెలిసినట్లు కాదు. సంఘ శాఖకు వెళ్ళండి. నచ్చినట్లైతే కొనసాగండి. అలాకాని పక్షంలో మీ మార్గంలో మీరు వెళ్ళండి. అయితే మీ దురభిప్రాయాలను తొలగించుకోండి. మా శాఖలను దర్శించడానికి ఎటువంటి ఆంక్షలూ లేవు’ అని స్పష్టం చేశారు.
‘సంఘం గురించిన ఎన్నో ప్రశ్నలకు ఈ ప్రత్యేక సంచిక ద్వారా జవాబు లభిస్తుంది. సంఘం గురించి సరైన విశ్లేషణ చేయడానికి ఈ సంచికల ద్వారా ప్రయత్నం జరిగింది” అని ఆయన వివరించారు అన్నారు.
ఈ ప్రత్యేక సంచికలలో సంఘ ప్రస్థానాన్ని నాలుగు దశలలో వివరించారు. ఆ తరువాతి భాగాలలో ఆయా సమయాలలో అప్పటి సర్‌సంఘ చాలకులు పోషించిన పాత్రను వివరించారు.