Home News గౌరీ లంకేష్ హత్య, కంచె ఐలయ్య సాహిత్యం ముసుగులో హిందువులపై దాడి చేస్తున్నది ఎవరు?

గౌరీ లంకేష్ హత్య, కంచె ఐలయ్య సాహిత్యం ముసుగులో హిందువులపై దాడి చేస్తున్నది ఎవరు?

0
SHARE

ఇటీవల దక్షిణ భారతంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. అందులో మొదటిది బెంగుళూరులో గౌరీ లంకేష్ హత్య. ఈమె లంకేష్ అనే సుప్రసిద్ధ జర్నలిస్టు కుమార్తె. తండ్రి తర్వాత తానే పత్రికా నిర్వహణ బాధ్యత వహించింది. మొదటినుంచి వామపక్ష భావాలు కలిగిన వ్యక్తి. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రతి సంచికలోను విమర్శిస్తూ వుండేది. కర్నాటకలోని మల్నాడు ప్రాంతంలోని అడవుల్లో మావోయిస్టులు తమ స్థావరాల్లో నుండి ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయితే ఈమె వారిని ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకురావాలని ప్రయత్నించింది. అది మావోయిస్టులకు నచ్చలేదు. హత్యకు గురి అయిన రోజు తెల్లవారుజామున ఆమెకు ఈమెయిల్‌లో బెదిరింపు మెసేజ్ కూడా వచ్చింది. సాయంత్రం ఏడు గంటల తర్వాత ఆమె తన ఇంటికి తిరిగి వస్తుండగా మోటారు సైకిళ్లమీద ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారు ముఖాలకు ముసుగులు తొడుక్కుని వున్నారు. అందులో ఒకరి వయసు 30 సంవత్సరాలు ఉంటాయి. అతని ఎత్తు ఐదున్నర అడుగులలోపే వుంటుంది. ఆమెను అతి దగ్గరనుంచి కాల్చి చంపారు. ఆ తర్వాత వాళ్లు తాపీగా పరారీ అయినారు.

ఈ సంఘటన జరిగిన పది నిముషాల లోపే వార్తను టీవీ చానల్స్ ప్రచారం చేసాయి. వెంటనే రాహుల్‌గాంధీ, కపిల్ సైబల్, దిగ్విజయ్‌సింగ్, వంటి కాంగ్రెస్ నాయకులందరు కూడా బిజెపి ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో నిందించారు. ఇది ఫ్యాసిస్టు నాజీ ప్రభుత్వం అని నిందించారు.

మహాత్మాగాంధీ హత్యకు పాల్పడిన వారసులే దీనిలో పాల్గొన్నారు అని కమ్యూనిస్టు నాయకులు విరచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. హంతకులను పట్టుకుంటాం అని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. అంతటితో ఆగలేదు. బెంగుళూరులో అతిపెద్ద మీటింగ్ ఏర్పాటు చేసారు. అందులో టీస్తా సెతల్‌వార్డు, స్వామి అగ్నివేశ్, మేధాపాట్కర్ వంటి ఎందరో వామపక్ష మేధావులు పాల్గొన్నారు. సిద్ధరామయ్యగారి బంధువులు దగ్గరుండి కార్యక్రమాన్ని నిర్వహింపచేసారు. ఇది బిజెపి వాళ్లు చేసిన దుర్మార్గం అని తీర్పుఇచ్చారు లోగడ ఇలాగే దబోల్కర్ వంటివారిని హత్య చేసిన విషయం గుర్తు చేసుకున్నారు.ముడివేల్‌కబుర్గి కూడా హత్య చేయబడడాన్ని ఆ సభలో ఖండించారు. ఇవన్నీ బాగానే వున్నాయి. ఇక్కడ మనం గమనించవలసిన ప్రధాన అంశం ఏమిటంటే జర్నలిస్టు గౌరీలంకేష్ హత్యను ఫలానా వారే చేసారు అనడానికి సాక్ష్యం ఏమిటి?

చుట్టూ ఉన్న సిసి కెమెరాల్లో ఏవైనా ఆధారాలు లభించాయా? రాష్ట్రప్రభుత్వం జరిపిన పోలీసు రహస్య నిఘా విభాగం వారి దర్యాప్తులో ఏమైనా కీలక అంశాలు దొరికాయా అంటే శూన్యం అని చెప్పవచ్చు. అలాంటప్పుడు ఆమెను ఫలానా పార్టీ వారే హత్య చేసారని రాహుల్‌గాంధీ ఇంత ఖాయంగా ఎలా చెప్పగలుగుతున్నాడు?

వీటిని శవ రాజకీయాలు అంటారు. ఇల్లుతగలబడిపోతుంటే ఒకడు చుట్ట ముట్టించుకున్నాడని సామెత. ఆ విధంగా పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా ఎవరో ప్రశ్నిస్తే దానిని ముక్త కంఠంతో ఎదుర్కోవాల్సింది పోనిచ్చి ఇలా రాజకీయ వివాదం తగునా?

ఆ మాటకొస్తే లోగడ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర కొందరు జర్నలిస్టులను చంపేసారు. అపుడు రాహుల్‌గాంధీ నోరు విప్పలేదు సరికదా విచారణలో అన్ని విషయాలు తేలాక మనం ఒక నిర్ణయానికి రావాల్సి వుంటుంది అన్నాడు. మరి ఇవాళ గౌరీ లంకేష్ విషయంలో హత్య జరిగిన పది నిముషాలకే ఆయన ఒక నిర్ణయానికి ఏ ఆధారంతో రాగలిగాడు? అది మిలియన్ డాలర్ క్వశ్చన్.

కేరళలో రాజేశ్ అనే ఒక యువకుడ్ని సిపిఎం కార్యకర్తలు హత్య చేసారు. అది ముఖ్యమంత్రి పిన్నారాయ్ మద్దతుతోనే జరిగిందని కేరళ ప్రజలకు తెలుసు. మరి రాహుల్‌గాంధీ ఆనాడు ఎందుకు నోరు విప్పలేదు. అంతేకాదు రెండురోజుల క్రితం బెంగాల్‌కు చెందిన రుతువ్రత ముఖర్జీ అని సిపిఎం ఆగ్రనాయకుడ్ని ఆ పార్టీ బహిష్కరించింది. అతడు చిన్నప్పటినుంచి కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొన్నవాడు. ప్రస్తుతం సిపిఎం పక్షాన పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభలో). అతడు ట్విట్టర్‌లో జైహింద్ అనే నినాదం పెట్టాడు. అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశానికి ఇచ్చిన పిలుపు. ఆయన తన సైన్యానికి ఆజాద్ హింద్ ఫౌజ్ అని పేరు పెట్టుకున్నాడు. జైహింద్ అంటే నీవు హిందూవాది అని అతనిని పార్టీనుంచి తొలగించారు. దాంతో రుతువ్రత ముఖర్జీ టీవీ చానల్స్‌లో కేరళలో జరుగుతున్న హత్యలన్నీ కూడా పిన్నారాయ్ విజయ కోజీ కోడి బాలకృష్ణన్ అనే కన్నూర్ మాఫియాల ప్రోత్సాహంతో జరుగుతున్నదని ఆయన ఆరోపించారు.

పార్లమెంటు సభ్యులకు ఇచ్చే కోటాను కోట్ల నిధులను సిపిఎం ఎంపీలు లెక్కాపత్రం చూపకుండా స్వాహా చేశారని రుతువ్రత ముఖర్జీ ఆరోపించాడు. అతను దశాబ్దాలుగా పార్టీలో వున్నవాడు కాబట్టి ఆయన మాటలు మనం నమ్మవలసి వుంటుంది. అయినా కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణలు జరిపి నిజానిజాలు తేల్చుకోవాలి. ఈ మొత్తం ఇతివృత్తంలోను మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. కేరళలో వందలాది హత్యలు జరిగినపుడు స్పందించని వారు కాంగ్రెస్ పాలిత కర్నాటక రాష్ట్రంలో జరిగిన హత్యలకు ఎందుకు స్పందించారు? విచారణ లేదు. సాక్ష్యాలులేవు. అయినాసరే నరేంద్ర మోదీపై నేరాన్ని ఎలా మోపారు? హంతకుడు ఎవరైనా ఏ పార్టీవాడైనా మనం ఖండించాల్సిందే కదా.

ఇక రెండవ అంశం కంచె ఐలయ్య ఉన్నట్టు వుండి వార్తల్లోకి ఎక్కాడు. ఆయన కులం పేరు చెప్పి బ్రాహ్మణులను, వైశ్యులను తిడుతు పుస్తకాలు రాశారు. బాపనలు ఫాసిస్టులు అన్నాడు. కోమటోళ్లు స్మగ్లర్లు అన్నాడు. భారతదేశంలో అంతర్యుద్ధం రాబోతున్నది. అందుకు మనం సిద్ధంగా వుండాలి. అగ్రకులాలను ఈ యుద్ధంలో ఎదుర్కోవాలి అని పిలుపునిచ్చాడు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19ఎ బి అధికరణల కింద వ్యక్తి స్వేచ్ఛ, భావ స్వేచ్ఛను, పత్రికా స్వాతంత్య్రాన్ని ప్రసాదించింది. అంతమాత్రాన మనం పేరుపెట్టి ఒక కులాన్ని లేక ఒక సామాజిక వర్గాన్ని తిట్టాలని దీని అర్థం కాదు. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మూడు దశాబ్దాలకుపైగా ఉద్యోగం చేసాను. అపుడు కంచె ఐలయ్య కూడా పని చేస్తుండేవాడు. ఆ వివరాలన్నీ ఇప్పుడు రాయడంలేదు. యూనివర్సిటీలో గోమాంస భక్షణోత్సవం నిర్వహించాడు. దేశమంతా దీపావళి జరుపుకుంటుంటే, ఈయన నరకాసుర జయంతి చేసేవాడు. ప్రజలంతా విజయదశమి జరుపుకుంటుంటే ఇతడు మహిషాసురుని జయంతి జరిపాడు.

మన నాయకుడు కృష్ణుడు, దుర్గాదేవి కాదు. అసలైన నాయకుడు మహిషాసురుడే అన్నాడు. మహిష శబ్దం తమో గుణానికి సంకేతం. అంటే మన పండుగలు ప్రతీకాత్మకమైనవి. అధర్మం మీద ధర్మం సాగించిన విజయానికి ఈ ఉత్సవాలు నిదర్శనం. అయితే ఐలయ్య తన పేరును షెపరడ్ అని పెట్టుకున్నాడు. ఏసు ప్రభువుకు గుడ్ షెపర్డ్ అని పేరు వుంది కదా. భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చిన మహమ్మదీయులు, క్రైస్తవులు మంచివారు, బ్రాహ్మణులే దుర్మార్గులు అని తన పుస్తకాల్లో రాశాడు.

ఆది శంకరాచార్యులతో బ్రాహ్మణులు గుండు కొట్టించుకోవడం మొదలుపెట్టారు అని మంగలోల్లు అన్న పుస్తకంలో రాశాడు. ఇంకా పేరుపెట్టి తిరుపతి వేంకటేశ్వర స్వామిని తిట్టాడు. తిరుపతిలో వున్నది ఒక దుర్మార్గపు వ్యవస్థ అన్నాడు. ఇపుడు ఆర్య వైశ్య సంఘాలు తమ నిరసనను తెలియజేసాయి. మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కింది అని అన్నట్టు ఆర్యవైశ్యులవల్ల తనకు ప్రాణ హాని వుంది అని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు.

నిజానికి నేడు

వ్యాపారస్తులంతా ఆర్యవైశ్యులు కాదు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి, కమ్మ, కాపు వంటి సామాజిక వర్గాలకు చెందిన వారు సినీ పరిశ్రమతో సహా అన్ని రంగాల్లోను ప్రముఖంగా వ్యాపారం చేస్తున్నారు. ఇక ఖాజీ మస్తాన్ దావుద్ ఇబ్రహీం వంటి ఇస్లామిక్ ఉగ్రవాదులు మాఫియా గ్యాంగు లీడర్లు స్మగ్లింగు, మనీ లాండరింగ్ చేస్తున్నారు.

జాతిపిత మహాత్మాగాంధీ, అమరజీవి పొట్టి శ్రీరామలు సంయుక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వంటి ఎందరో మహనీయులు వైశ్యకులంలో పుట్టినవారే. వారు అన్నదాన సత్రాలకు, అనాధ శరణాలయాలకు భూరి దానాలు చేస్తుంటారు. ఐనా దొంగలంతా బ్రాహ్మణ వైశ్య కులాల్లోనే వున్నారని ప్రచారం చేయాల్సిందిగా ఐలయ్యగారిని అమెరికా ఆదేశించిందా? ఎందుకంటే నేనెట్ల హిందువు అవుతా అని ఒక పుస్తకం రాశాడు. అంటే మతం మార్చుకున్నాడని అర్ధం.

మరి హిందూ సమాజాన్ని విమర్శించడానికి ఏయే దేశాలనుంచి నిధులు వచ్చాయో సిఐడి విచారణలో తేలాలి. ఉపాధ్యాయుడు సమాజానికి మార్గదర్శనం చేయవలసిన వాడు. కానీ కంచె ఐలయ్యనే చేను మేస్తే ఎలా?

-ముదిగొండ శివప్రసాద్

(ఆంధ్రభూమి సౌజన్యం తో)