Home News భారతీయ వైద్య-ఆరోగ్య విధానాల పట్ల ఎందుకీ వ్యతిరేకత?

భారతీయ వైద్య-ఆరోగ్య విధానాల పట్ల ఎందుకీ వ్యతిరేకత?

0
SHARE

 –  ప్రదక్షిణ

ఇటీవలి కాలంలో తెలుగునాట కొన్ని ముఖ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీటిని పరిశీలిస్తే ఈనాటి `ఆధునిక’ వైద్యవ్యవస్థలకి- ఆయుర్వేదం, సిద్ధ, యోగా వంటి భారతీయ వైద్య-ఆరోగ్య విధానాల పట్ల ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది.

ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా, కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు శ్రీ ఆనందయ్య గారి ఉదంతం ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోoది. ఆయన గత 30సం ఆయుర్వేద చికిత్స చేస్తున్న అనుభవజ్ఞులు. ఆనందయ్య గారు కోవిడ్ మహమ్మారి తగ్గించడం కోసం 18ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన మందును పూర్తి ఉచితంగా రోగులకి  అందిస్తున్నారు. ఈ మిశ్రమం ఆశ్చర్యకరమైన అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది, కోవిడ్ బారిన పడిన రోగులకి 1-2 రోజుల్లో కోవిడ్ నెగటివ్ రావడమే కాక, పడిపోయిన ఆక్సిజన్ స్థాయి గణనీయంగా పెరిగి, మృత్యుముఖంలో ఉన్న వారికి కూడా ప్రాణదానం చేయగలిగారు. దీనితో మౌఖికంగా విపరీతమైన ప్రచారం జరిగి, కరోనా బారిన పడిన వేలాదిమంది ప్రజలు కృష్ణపట్నం ఉరుకులు పరుగులు పెట్టారు. 3-4 వారాల్లోనే అయన దాదాపు లక్షమందికి మందిచ్చి కాపాడారు. పూర్తిగా ఆరోగ్యవంతులైన కోవిడ్ రోగులు వారికెలా నయమయిందీ సోషల్ మీడియాలో వివరించిన వీడియోలు వైరల్ అయినాయి. ఖాళీ అయిన ఆసుపత్రి పడకలు కూడా అవే కథ వినిపించాయి. మీడియాలో సంచనలం సృష్టించిన శ్రీ ఆనందయ్యగారి చికిత్సా పటిమ అందరినీ ఆశ్చర్యపరిచింది. మందుతయారీ ఎలా చేసారో చెప్పమని అడగగా, నిస్వార్థంగా ఉచితంగా వైద్యం చేస్తున్న ఆయన, మూలికలతో సహా వివరాలు చెప్పారు. మందుకు డిమాండ్ పెరగడంతో, తనవద్దకు వచ్చే ప్రజలు డబ్బులు తేవద్దని, దొరికితే మూలికలు మాత్రమే తెమ్మని చెప్పి తన సేవాభావం చాటుకున్నారు.

ఈ వార్త నలుదిక్కులా పాకడంతో, ప్రభుత్వంలో ఉన్న కొన్ని శక్తులు, అల్లోపతి వైద్యవ్యవస్థ నుంచి ప్రయోజనం పొందుతున్నవారు అప్రమత్తమై, వెంటనే రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని లోకాయుక్త, వారంతట వారే సుఓ-మోటోగా కేసు తీసుకుని, మందుకోసం గుమిగూడిన జనం ముఖానికి మాస్క్ వేసుకోలేదని, కాబట్టి మందు పంపిణి ఆపించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.  ఇది చాలా ఆశ్చర్యకరమైన చర్య. ఎందుకంటే లోకాయుక్త కార్యాలయం  ప్రభుత్వంలో అవినీతి దర్యాప్తు చేయడానికి నియుక్తి చేయబడింది. లాక్డౌన్ ప్రకటిస్తున్నారనగా, వందలాది మంది లిక్కర్ షాపులవద్ద ఒకరిని ఒకరు తోసుకుంటూ, మాస్కులు లేకుండా, రోడ్లు అంతటా నిండిపోయినపుడు లోకాయుక్త కార్యాలయానికి గాని, పోలీసులకిగాని తెలియలేదేమో.  ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. (క్రిస్టియన్ పాస్టర్లు అద్భుత `మహత్తు’గల మందులిస్తూ, కాన్సర్, కిడ్నీలో రాళ్లు, ఎయిడ్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేస్తున్నట్లు, ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. అయినా ఏ ప్రభుత్వ విభాగం ఎప్పుడూ ఆ మందుల సామర్థ్యం, పనితీరుపై విచారణ చేపట్టలేదు). `పోలీసు సంరక్షణ’ తరువాత ఆనందయ్య గారు ఉచితంగా పంపిణి చేస్తున్న మందుల్లో మూలికలపై పరీక్షలు జరిపి, వాటి పనితీరును అంచనా వేస్తారని ప్రకటన వెలువడింది. తదనుగుణంగా AYUSH (ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియో) మంత్రిత్వ శాఖకి చెందిన నిపుణులు పరీక్షలు జరిపి, తనిఖీ చేసి, ఆ మందు, దాంట్లో వాడిన మూలికలు సురక్షితమైనవని, అవి వాడితే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని నిర్ధారణ చేస్తూ నివేదిక ఇచ్చారు.

ఈ మొత్తం సమస్యలో, ఎవరైనా వ్యక్తి, లేక సంస్థ లేక రాష్ట్ర ప్రభుత్వమో, ఎవరు భారతీయ వైద్య పరిశోధనా సంస్థకి(ICMR) విజ్ఞప్తి చేసారో తెలియరాలేదుకాని వారు కూడా దీంట్లో తలదూర్చారు. అయితే వింతైన విషయమేంటంటే, ICMR సంస్థ అల్లోపతి మందులకి సంబంధించిన పరిశోధన, వాటి నిర్ధారణ చేసేందుకు నెలకొల్పిన సంస్థ; ఈ సంస్థకు ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి ఎటువంటి సంబంధం లేదు. ICMR సంస్థ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తూ, గత సంవత్సరంగా కోవిడ్ పై యుద్ధంలో ముందుండి, నిపుణుల కమిటీలు ఏర్పరిచి, అల్లోపతి మందులకి సంబంధించి రకరకాల సలహాలు సూచనలు ఇస్తోంది. ఆయుర్వేదంతో సంబంధం లేకపోయినా, అక్కడినుంచి కొందరు పరిశోధకులు కృష్ణపట్నం వచ్చి మందులను పరీక్షిస్తామని చెప్పారు! ఇప్పటికి పదిరోజులకి పైగా దాటిపోయినా, ఇంకావారి రాక కోసం అందరూ, ముఖ్యంగా రోగులు, వేచిచూస్తునే ఉన్నారు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పుకోవాలి. AYUSH (ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియో) మంత్రిత్వ శాఖ ఇంతవరకూ ఆయుర్వేదం, ఇతర దేశీయ వైద్యశాస్త్రాలకు సంబంధించి, `పరిశోధన, మందుల నిర్ధారింపు, గుర్తింపు’ విషయంలో అవసరమైన ఉన్నత స్థాయి బోర్డు ఏర్పాటు చేయకపోవడం శోచనీయం.  కృష్ణపట్నం ఆయుర్వేద మందుల విషయంలో, ఇంకా విచిత్రమైన విషయం ఇంకొకటుంది. AYUSH వారు మందులవల్ల ఏ హాని లేదని ప్రకటించిన తరువాత కూడా, శ్రీ ఆనందయ్యగారిని భద్రత పేరు మీద, ప్రజల నుంచి ఇప్పటికి 2వారాలకు పైగా దూరంగా ఉంచారు. ప్రజారోగ్య విషయంలో కరోనా మహమ్మారి చెలరేగిపోతున్నా, రోగులు వారి కుటుంబాలు, ఒక ఆసుపత్రినుంచి ఇంకొక ఆసుపత్రికి ప్రాణాలు నిలిపే చికిత్సకోసం పరుగులు తీస్తుంటే, లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటే,  అనుభవజ్ఞుడైన వైద్యుడిని రోగులకి దూరంగా ఉంచడం చాలా విచిత్రమైన విషయం.

ICMR సంస్థకి ఆయుర్వేదంతో ఏ సంబంధం లేని విషయం అటుంచి, కరోనా మహమ్మారి చికిత్స విషయంలో, అల్లోపతి వైద్యవిధానం- సూచనలు-సలహాలు, మందులు, స్టిరాయిడ్ వాడకం, ఇంజెక్షన్లు మొదలైన అన్ని విషయాల్లో, ప్రజలను అయోమయంలో పడేసింది. కోవిడ్ మహమ్మారికి ఇప్పటిదాకా చికిత్స లేదు. డాక్టర్లు రకరకాల మందులను వాడి తమ  ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర వ్యాధులకి వాడే మందులను జతకలిపి ఇస్తున్నారు. అంటే నేతి-నేతి పద్ధతి (ఒకటి కాకపోతే ఇంకొకటి అనే ప్రయత్నాలు) అన్నమాట. అవి కొన్నిసార్లు పనిచేస్తున్నాయి, కొన్నిసార్లు లేదు. ప్రస్తుతం ప్రయత్నించి చూస్తున్న ఏ మందులు కూడా కోవిడ్ చికిత్స కోసం పరీక్షించబడలేదు, ఎటువంటి నిర్ధారణ జరగలేదు. కాని ఎవరూ అల్లోపతి డాక్టర్లను, ఆ మందుల గురించి కాని, వాటి దుష్ప్రభావాలు ఎలా ఉంటాయనిగానీ ప్రశ్నించలేదు. ఇప్పటికే వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్, కొత్తగా ఎల్లో ఫంగస్ అనే కొత్త రుగ్మతలు బయటపడుతున్నాయి. ఇవి స్టిరాయిడ్స్, మందులు, ఇంజెక్షన్లు విచక్షణారహితంగా వాడడంవల్ల వచ్చిందని డాక్టర్లే చెపుతున్నారు. అయినా, అల్లోపతిలో చికిత్స, నివారణ లేకపోయినా, ప్రస్తుత భయానక పరిస్థితుల్లో ఆయుర్వేదం దారిచూపుతున్నా కూడా, ఎంతోమంది అల్లోపతి డాక్టర్లు, ప్రతిదానికి నకారాత్మకంగా వంకలు పెట్టేవాళ్ళు రంగంలోకిదిగి, ఆయుర్వేదం మందుల పనితనాన్ని ప్రశ్నించి, వాటి వాడకాన్ని ఆపడమే  పనిగా పెట్టుకున్నారు. `జనవిజ్ఞాన వేదిక’లాంటి వాళ్ళు ఈ దేశపు వైద్యవిధానమైన ఆయుర్వేదాన్ని విమర్శించడంలో ముందుంటారు. తమిళనాడులో `సిద్ధ వైద్యం’ కూడా సత్ఫలితాలని ఇస్తోందని వార్త, ఈ గుంపు వాటిమీద పడరని ఆశిద్దాము.

భారత దేశీయ వైద్యవిధానాలను ఎలాగైనా నిరోధించాలనే తాపత్రయంలోపడి, దేశంలో పాతుకుపోయిన అల్లోపతి వ్యవస్థ, ఇతర స్వార్థపూరిత శక్తులు/గుంపులు, ఒక విషయాన్ని పూర్తిగా విస్మరించారనే చెప్పాలి; రోగులకి వారికి కావలసిన వైద్యవిధానo అవలంబించడానికి, వారికి కావలసిన వైద్యులు/చికిత్సకారుల దగ్గరకి వెళ్లి మందు తీసుకునే పూర్తి హక్కు/ స్వేచ్ఛ ఉంటాయి. రోగులకి ఉండే ఈ సహజ హక్కులను, తమకి కావలసిన వైద్యాన్ని ఎంచుకునే స్వేచ్ఛని ప్రభుత్వాలు ఎందుకు సాగనివ్వడంలేదు? ప్రస్తుత కోవిడ్ మహమ్మరి దృష్ట్యా, రోగులు హాస్పిటళ్ళకి లక్షల రూపాయలు ధారపోసి కూడా ప్రాణాలతో బయటపడలేని దుస్థితి ఉన్నపుడు, ప్రజలు ఆయుర్వేదం కాని, మరే ఇతర వైద్యం కాని పొందితే, అదీ ఉచితంగా, ప్రభుత్వాలు అడ్డుకోవలసిన అవసరం ఏముంది? ఆనందయ్యగారి మందుల విషయంలో వాటి సత్ఫలితాల గురించి ప్రచారం జరిగి, ప్రజలు తమంతటతామే ఆంధ్రప్రదేశ్ నుంచే కాక చుట్టుపక్కల రాష్ట్రాలనుంచి కూడా ఆయుర్వేదం మందులకోసం వెళ్ళారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మనకి కనపడుతున్న విషయం కాక, తెరవెనుక మరేమైనా విషయాలు దాగిఉన్నాయా? ఉచితంగా లేక చాలా తక్కువ వ్యయంతో, ఆయుర్వేదం సిద్ధ లాంటి దేశీయ వైద్యాలు ప్రజలకు సేవచేస్తే, లక్షలాది కోట్లాది రూపాయల లాభం పోతుందేమో అని విచారిస్తున్న మెడికల్ మాఫియా దీనివెనుక పావులు కదుపుతోందా? ఇప్పటికే ప్రాణరక్షణ మందులు, ఆక్సిజెన్ సిలిండర్లు, ఇంజెక్షన్లు రహస్యంగా నిలవచేసి, బ్లాక్ మార్కెట్లో ఎన్నోరెట్లు ఎక్కువ ధరలకి అమ్మి సొమ్ము చేసుకున్న వారిపై అనేక రాష్ట్రాల్లో పోలీసులు కేసులు పెట్టారు. లక్షల రూపాయలు బకాయిలు కడితేగాని, మృతుల శవాలు కూడా ఇవ్వని హాస్పిటళ్ళ గురించి మనం విన్నాము.

బ్రిటిష్ వారు `నల్లదొరల’కి అందచేసిన అల్లోపతియే అన్నిటికన్నా మెరుగైన విధానమని ఎవరు తేల్చారు? ఈరోజు ఒక మంత్రిత్వశాఖ అయిన AYUSH ప్రధాని వాజపేయిగారి సమయంలో ఒక చిన్న విభాగంగా ప్రారంభమైంది. ఈ మొత్తం వ్యవహారంలో కొన్నిసంగతులు తేటతెల్లమైయాయి; ఒకటి, వైద్య విధానాలలో కూడా క్రమానుగత శ్రేణి ఉంటుందని, అంటే ఒకటి ఎక్కువ, ఇంకొకటి తక్కువగా చూడబడతాయని. రెండు, బాగా చదువుకున్న భారతీయులు తమ మనసుల్లోని ఈ పక్షపాత ధోరణిని ఎంతమాత్రం దాచుకోకుండా, ఏ చికిత్స అయినా `క్లినికల్ ట్రయల్స్’ చేస్తే కాని నిర్ధారించలేమని వేదికలెక్కి ప్రకటిస్తుంటారు. అయితే అల్లోపతి వైద్యం వాడుతున్న మందులు, ప్రత్యేకించి కోవిడ్ చికిత్స కోసం, ఎవరు ఎప్పుడు `క్లినికల్ ట్రయల్స్’ చేసారో చెప్పమంటే మాత్రం వారు చెప్పలేరు. ఈ పక్షపాత ధోరణికి స్పష్టమైన ఉదాహరణ ఒకటుంది – క్రిందటి సంవత్సరo 2020లో, ప్రపంచం మొత్తం కోవిడ్ కోసo ఆఘమేఘాలమీద మందు కనిపెట్టే ప్రయత్నం చేస్తుంటే, మనదేశంలోని `పతంజలి’ ఆయుర్వేదిక్ సంస్థ, `కరోనిల్’ అనే రోగనిరోధక మందు కనిపెట్టగా, జైపూర్లో ఉన్న NIMS అనే హాస్పిటల్/పరిశోధనా సంస్థ చాల విస్తారంగా `ట్రయల్స్’ జరిపింది. వారు మొత్తం నివేదకను ప్రజల ముందుంచారు. అయినా, మనదేశంలో పాతుకుపోయిన వైద్య `వ్యవస్థ’ పతంజలి సంస్థను తెగ విమర్శించి దుమ్మెత్తి పోయడంతో, వారు ఆ మందుని `రోగనిరోధకశక్తి’ పెంచే ఔషధంలాగా మార్కెట్లో విడుదల చేసారు. అయినా సరే, ఈ రోజు కరోనిల్, కాబాసుర కుడినీర్, ఆయుష్64 మొదలైన ఆయుర్వేద మందులు విపరీతంగా అమ్ముడుపోయి ఈ మహమ్మారి సమయంలో ప్రజలకు ఉపశమనం  కలిగిస్తున్నాయి. ఈ కోవిడ్ మహామ్మరి పుట్టిన చైనాలో కూడా, వారి పాత సంప్రదాయ `చైనీస్ వైద్య’మే వారు కూడా ఉపయోగిస్తున్నారని, మనదేశంలో `నిపుణులు’ తెలుసుకుంటే మంచిది. గత కొన్ని వారాలుగా ఈ పక్షపాత ధోరణి, వైద్యం విషయంలోనే కాక, భాష విషయంలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మన ప్రాచీన చికిత్సా విధానాలను ఆయుర్వేదం, సిద్ధ అని పేర్కొనకుండా, `నాటువైద్యం, చెట్ల వైద్యం, గృహ చిట్కాలు, వంటింటి చిట్కాలు’ అని రకరకాలుగా పిలుస్తున్నారు. ఈ పద్ధతులన్నీ ఆయుర్వేదం, సిద్దా మొదలైన చికిత్సా విధానాల్లోంచి గ్రహించినవేనని బహుశా ఈ `నిపుణుల’కి తెలియదేమో.

కాబట్టి, కేంద్ర ప్రభుత్వం వెంటనే AYUSH శాఖ కింద `పరిశోధన, పరీక్ష, నిర్ధారణ బోర్డులు’ ఏర్పాటు చేసి, దేశానికి స్వదేశి సురక్షిత ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలను అందచేసేలా వెంటనే చర్యలు చేపట్టాలి. చాలా విషయాలలో `వివిధత్వ’ విధానమున్న మనం, వైద్యంలో కూడా అవసరాన్ని బట్టి అనేక చికిత్సా పద్ధతులు అవలంబించాలి.