Home News యువశక్తి పెరగడంతో సంఘ కార్యం వేగంగా విస్తరిస్తోంది – దత్తాత్రేయ హోసబలే

యువశక్తి పెరగడంతో సంఘ కార్యం వేగంగా విస్తరిస్తోంది – దత్తాత్రేయ హోసబలే

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యం వేగంగా విస్తరిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే సంఘ శాఖలు నడుస్తున్న స్థానాల సంఖ్య 550 కి పైగా పెరిగింది. ప్రస్తుతం 34 వేల స్థానాల్లో నిత్య శాఖలు, 15వేల స్థానాల్లో సాప్తాహిక్ మిలాన్ లు జరుగుతున్నాయి. అంటే మొత్తం 49వేల 493 స్థానాల్లో శాఖలు, సాప్తాహిక్ ల ద్వారా సమాజంలో సంఘకార్యం జరుగుతోంది. ఇక శాఖల సంఖ్య 1600, సాప్తాహిక్ మిలాన్ ల సంఖ్య 1700 పెరిగాయి. భోపాల్ లోని శారదా విహార్ పాఠశాలలో ప్రారంభమయిన అఖిల భారతీయ కార్యకారిణి మండలి సమావేశాల గురించి సహ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే పత్రిక విలేకరులకు వివరిస్తూ ఈ సమాచారాన్ని అందించారు. గురుగోవింద్ సింగ్ సభా గృహంలో భారత మాత చిత్రపటానికి పూలమాల సమర్పించి సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ మరియు సర్ కార్యవాహ్ శ్రీ సురేశ్ భయ్యాజీ జోషి సమావేశాలను ప్రారంభించారు. దేశం మొత్తం నుండి వచ్చిన 350 మంది కార్యకర్తలు ఈ సమావేశాలలో పాల్గొంటున్నారు. అఖిల భారతీయ కార్యకారిణి , క్షేత్ర మరియు ప్రాంత సంఘచాలక్ లు, కార్యవాహ్, ప్రచారక్ లు మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాలలో రాగల మూడు సంవత్సరాలకు సంబంధించిన కార్యక్రమాల యోజన, కార్య విస్తరణ, దృఢీకరణ గురించి చర్చిస్తారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంఘ సహ సర్ కార్యవాహ్ శ్రీ దత్తాత్రేయ హోసబలే సంఘకార్యం వేగంగా విస్తరిస్తోందన్నారు. ముఖ్యంగా యువశక్తి ఈ విస్తరణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, `జాయిన్ ఆర్ ఎస్ ఎస్ (Join RSS)’ ద్వారా పెద్ద సంఖ్యలో అనేక సాంకేతిక నిపుణులైన యువత సంఘకార్యంలో పాలుపంచుకునేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇలా జాయిన్ ఆర్ ఎస్ ఎస్ ద్వారా సంఘ వైపుకు వస్తున్నవారి సంఖ్య 2015 తో పోలిస్తే 2016లో 48 శాతం, 2017లో 52 శాతం పెరిగిందని తెలియజేశారు. వీరిలో కూడా 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారి సంఖ్య ఎక్కువ.

సంఘ గ్రామ వికాసం, కుటుంబ ప్రబోధన్, సామాజిక సమరసత వంటి గతివిధుల (సామాజిక కార్యక్రమాలు) ను నిర్వహిస్తోందని ఆయన వివరించారు. సంఘ కార్యకర్తల కృషి ఫలితంగా దాదాపు 450 గ్రామాలలో చెప్పుకోదగిన మార్పు వచ్చింది. కుటుంబాలు బాగుంటే సమాజం కూడా బాగుంటుందని, అందుకనే కుటుంబ వ్యవస్థను బలపరచేందుకు స్వయంసేవకులు 15 ఏళ్ల క్రితమే కర్నాటకలో కుటుంబ ప్రబోధన్ కార్యాన్ని ప్రారంబించారని, దీని ద్వారా కుటుంబ విలువల వ్యాప్తిని చేయగలిగారని దత్తాత్రేయ హోసబలే వివరించారు. కుటుంబ వ్యవస్థ, కుటుంబ విలువల ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవాలంటే మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలాం ఒక జైన ఆచార్యులతో జరిపిన సంభాషణ ఆధారంగా ప్రచురించిన  పుస్తకాన్ని చదవాలని ఆయన సూచించారు.

ఈ సమావేశాలలో రాగల మూడు సంవత్సరాలకు సంబంధించిన కార్యక్రమాల యోజన కూడా జరుగుతుందని శ్రీ హోసబలే తెలిపారు. కార్యకారిణి మండలి మూడు సంవత్సరాలకు ఒక సారి మారుతుంటుంది. మార్చ్ 2018 నాటికి మూడు సంవత్సరాలు పూర్తి అవుతాయి. అందువల్ల కొత్త కార్యకారిణి మండలి ఏర్పాటు గురించి కూడా చర్చ జరుగుతుందని, మార్చ్, 2018లో జరిగే ప్రతినిధి సభ సమావేశాలలో తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రస్తుత సమావేశాలలో సంఘ కార్య విస్తరణ, కార్యం వల్ల లభిస్తున్న ఫలితం గురించి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. గత ఆరు నెలల కాలంలో సంఘకార్యపు సమీక్ష జరుగుతుంది. సంఘ శిక్షవర్గ (కార్యకర్తల శిక్షణ) గురించి కూడా సమావేశాలలో చర్చ జరుగుతుంది.

మధ్య ప్రదేశ్ లో సంఘ కార్యం మొదటి నుండి బాగా ఉందని శ్రీ దత్తాత్రేయ హోసబలే తెలియజేశారు. చాలా కాలం తరువాత అఖిలా భారతీయ కార్యకారిణి మండలి సమావేశాలు భోపాల్ లో జరుగుతున్నాయి. విజయదశమి ఉత్సవంలో సర్ సంఘచాలక్ ఉపన్యాసం సంఘ విధానాన్ని తెలియజేస్తుందని ఆయన అన్నారు. సంఘ దేశంలో 20 ప్రదేశాలలో మేధావుల సమావేశాలు నిర్వహించిందని, అందులో సర్ సంఘచాలక్  చెప్పిన విషయాలను వివరించడం జరిగిందని, వాటిని చాలామంది మేధావులు కూడా అంగీకరించారని ఆయన  తెలియజేశారు. ఎవరి అభిప్రాయాలపై వారు దృఢంగా ఉన్నప్పటికి సమాజంలో సమారస్యపూర్వకమైన చర్చ జరగాలని అన్నారు. కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, కర్ణాటక మొదలైన రాష్ట్రాలలో సంఘ కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆయన అన్నారు. ఇటువంటి దాడులు సంఘ వ్యతిరేకుల సిద్ధాంతపు వైఫల్యాన్ని తెలియజేస్తాయని స్పష్టం చేశారు. తమ సిద్ధాంతాన్ని బతికించి ఉంచుకునేందుకు ప్రత్యర్ధులు ఇలా సంఘ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని శ్రీ దత్తాత్రేయ హోసబలే అన్నారు.

`ధరోహర్’ ప్రదర్శిని ప్రారంభం

మహాపురుషుల జీవితాలలో స్ఫూర్తిని కలిగించే అంశాలతో కూడిన  ప్రదర్శిని సహ సర్ కార్యవాహ్ శ్రీ సురేశ్ సోనీ గురువారం ఉదయం ప్రారంభించారు. ఇందులో పద్మ భూషణ్ కుశోక్ బకుల్ రింపోచే జీవిత విశేషాలను వివరించారు. ఇది ఆయన జన్మ శతాబ్ది వత్సరం. ఆయన జమ్ము కాశ్మీర్ లో విద్యా, సామాజిక సంస్కరణ కోసం విశేష కృషి చేశారు. అలాగే గురుగోవింద్ సింగ్ 350 జయంతి, సోదరి నివేదిత 150వ జయంతిని పురస్కరించుకుని వారి జీవన విశేషాలను కూడా ప్రదర్శినిలో వివరించారు. అలాగే సంఘ స్థాపకులు కేశవ బలిరామ్ హెడ్గేవార్ జీవన విశేషాలు కూడా ఆ ప్రదర్శినిలో చూడవచ్చును.