సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ ను తప్పుపట్టినట్లుగా చూపించే వీడియోను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ దుష్ప్రచారానికి కారణం ప్రప్రధమ ప్రధానిగా దేశ ప్రజానీకం నెహ్రూకు బదులు సర్దార్ పటేల్ ను కోరుకున్నారన్న విషయాన్ని సంఘ్ గుర్తుచేయడమే. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇలా విషాన్ని కక్కింది.
నిజానిజాలు ఏమిటి?
- నెహ్రూ కంటే సర్దార్ పటేల్ ఈ దేశానికి ఉత్తమమైన, సమర్ధుడైన ప్రధాని అయిఉండేవారని ఎవరోకాదు సాక్షాత్తు దేశపు ఆఖరి గవర్నర్ జనరల్ సి. రాజగోపాలచారి అభిప్రాయపడ్డారు. సర్దార్ పటేల్ దేశ ప్రధాని, నెహ్రూ దేశ విదేశాంగ మంత్రిగా ఉండి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు.
- డా. మన్మోహన్ సింగ్ 2013లో సర్దార్ పటేల్ గొప్ప సెక్యులర్ వాది అంటూ కితాబు ఇచ్చారు. అంతేకాదు సంఘ్ సర్దార్ ను సొంతం చేసుకోలేదని కూడా అన్నారు. ఎవరికైనా సెక్యులర్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే అది కాంగ్రెస్ కే వీలవుతుంది. ఎందుకంటే ఈ దేశంలో ఆ పదాన్ని చొప్పించింది, ఆ పదానికి తమ సొంత అర్ధాన్ని ఇచ్చింది కూడా ఆ పార్టీయే. కానీ పటేల్ గురించి నెహ్రూ ఏమన్నారో చూద్దాం.
సర్దార్ పటేల్, వి పి మీనన్ లకు సన్నిహితుడు, 1947 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఎం.కె.కె నాయర్ తన పుస్తకం `విత్ నో ఇల్ ఫీలింగ్ టు ఎనీబడి’ లో ఇలా వ్రాసారు -“దేశ ఉప ప్రధాని, హోమ్ మంత్రి అయిన సర్దార్ పటేల్ ను ఒక కేబినెట్ సమావేశంలో ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అగౌరవపరచారు, అవమానించారు. “మీరు పూర్తిగా మతతత్వవాదులు. మీ సలహాలు, సూచనలను నేను ఎప్పుడు అంగీకరించలేను” అని హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం ప్రైవేటు సైన్యం రజాకార్ల నుంచి రక్షించడం విషయమై కేబినెట్ సమావేశంలో జరిగిన చర్చలో నెహ్రూ గట్టిగా అరిచారు. నెహ్రూ అరుపులకు నిర్ఘాంతపోయిన సర్దార్ పటేల్ తన కాగితాలు తీసుకుని గది నుండి మౌనంగా బయటకు వెళ్ళిపోయారు. ఆ తరువాత ఎప్పుడు పటేల్ కేబినెట్ సమావేశంలో పాల్గొనలేదు. అప్పటి నుండి నెహ్రూతో మాట్లాడలేదు’’.
కనుక నెహ్రూ కేవలం ఆర్ఎస్ఎస్ ను మాత్రమే `మతతత్వవాది’ అనలేదు. తన సొంత కేబినెట్ సహచరుడు, దేశ ఉప ప్రధాని పట్ల కూడా ఆయనకు అభిప్రాయం ఉండేది.
- కొందరు కాంగ్రెస్ నాయకులు బూటకాలను ప్రచారం చేయడమేకాక అబద్ధపు లేఖల్ని కూడా బయటపెడుతూ ఉంటారు. ఉదాహరణకు ఒక న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనిష్ తివారీ (ఒకప్పటి సమాచార ప్రసార శాఖ మంత్రి) సర్దార్ పటేల్ వ్రాసినదిగా చెప్పే ఒక లేఖను గురించి ప్రస్తావించారు. శ్రీ గురుజీకి 1948 సెప్టెంబర్ 11న వ్రాసిన ఆ లేఖలో సర్దార్ పటేల్ దేశంలో మత విద్వేషాలకు సంఘ్ కారణమని ఆరోపించారని తివారీ వాదించారు. నిజానికి తివారీ చెపుతున్న లేఖలో సర్దార్ పటేల్ ఇలా వ్రాసారు – ‘ఆర్ఎస్ఎస్ హిందూ సమాజానికి సేవ చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు, స్త్రీలను రక్షించడానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు శాయశక్తుల ప్రయత్నించారు. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహంగాని, అభ్యంతరం కానీ ఉండవు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ దేశ కార్యాన్ని మరింత ముందుకు సాగించాలంటే వారు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నేను కోరుకుంటున్నాను’’. (జస్టిస్ ఆన్ ట్రయల్),
దీనిని బట్టి సంఘ్ కాంగ్రెస్ లో చేరాలని సర్దార్ పటేల్ భావించారని అర్ధమవుతుంది. రాజనీతి చరిత్ర విధ్యార్ధినని చెప్పుకునే తివారీ లేఖ మొత్తాన్ని చదివి ఉంటే ఈ విషయం అర్ధమయ్యేది.
క్రింది ఉత్తర ప్రత్యుత్తరాలు చూసినప్పుడు కూడా మనకు అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి –
ఆర్ఎస్ఎస్ పై నిషేధాన్ని తొలగించిన తరువాత 1949 జులై 12న శ్రీ గురుజీకి వ్రాసిన లేఖలో సర్దార్ పటేల్ చేసిన వ్యాఖ్య చాలా ముఖ్యమైనది – “సంఘ్ పై నిషేధం తొలగిపోవడం నాకు ఎంత సంతోషం కలిగిస్తోందో నాకు అతి సన్నిహితులకు మాత్రమే తెలుస్తుంది. మీకు మంచి జరుగుగాక’’.
నిజాలను చెప్పాలనుకున్న వారెవరైనా పటేల్, గురుజీల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలన్నింటి గురించి మాట్లాడాలి తప్ప తమకు అనుకూలమైన, తమకు కావలసిన విషయాలను మాత్రమే ప్రస్తావించకూడదు. దీనినిబట్టి మనిష్ తివారీ, ఇతరులు ఎలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో స్పష్టమైపోతుంది.
- ఆర్ ఎస్ ఎస్ పై బురదజల్లే పని కాంగ్రెస్ కొనసాగిస్తూనే ఉంది.
సాక్ష్యాదారాలు మరోలా ఉన్నా కాంగ్రెస్ మాత్రం తన అబద్ధాలను ప్రచారం చేస్తూనే ఉంది. 1966లో నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి జె ఎల్ కపూర్ నేతృత్వంలో ఒక కమిషన్ ను నియమించింది. ఆ కమిషన్ 100 మందికి పైగా సాక్ష్యులను విచారించి 1969లో నివేదికను సమర్పించింది. `మహాత్మా గాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కనుక శాంతిదూత అయిన మహాత్ముని హత్య వెనుక ఆ సంస్థ ఉందని ఎవరు చెప్పలేరు’ అని స్పష్టం చేసింది.
నిషేధం తొలగిన తరువాత అనేక సభల్లో శ్రీ గురుజీ చేసిన ఉపన్యాసాలు ఆయన సంయమనం, సహనశీల ధోరణికి తార్కారణం. `సంఘపై నిషేధపు అధ్యాయాన్ని ఇంతటితో మరచిపోదాం. అన్యాయం చేశారు అని మీరు భావిస్తున్నవారిపట్ల మీ మనసుల్లో ఎలాంటి ప్రతికూల భావం ఉండరాదు. పళ్ల మధ్య పడి నాలుక నలిగితే పళ్ళను రాలగొట్టుకుంటామా?మనకు అన్యాయం చేసినవారు కూడా మనవారే. కనుక క్షమించి, మరచిపోదాం’’ అని ఆయన స్వయంసేవకులకు, సంఘ అభిమానులకు ఉద్బోధించారు.
ఈ సంయమన, సహనశీల ధోరణిని నెహ్రూ మొండి వైఖరితో పోల్చి చూడండి. ఆయన తనను వ్యతిరేకించిన వారిని నిర్దాక్షిణ్యంగా పక్కకు తొలగించారు. దేశంలోని 15 కాంగ్రెస్ కమిటీలలో 12 ప్రధానిగా పటేల్ పేరును ప్రతిపాదిస్తే మహాత్మా గాంధీని బలవంతంగా ఒప్పించి ఆయన ప్రధాని పీఠం దక్కించుకున్నారు.
నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరా గాంధీలు ఆర్ఎస్ఎస్ ను మహాత్మా గాంధీ హత్యలో దోషిగా నిలబెట్టాలని చాలా ప్రయత్నించారు. నెహ్రూ మనవడు రాజీవ్ గాంధీ కూడా `గాంధీని చంపినవారు’ అంటూ ఈ బురదజల్లే పనిని కొనసాగించారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో కాంగ్రెస్ వారు, కమ్యూనిస్ట్ లు హిందూ మతతత్వం పెరిగిపోతోందంటు గగ్గోలుపెట్టడం ద్వారా ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
కానీ వారి పాచికలు ఏవి పారడం లేదు. ఎందుకంటే దేశ ప్రజానీకం వారి ప్రచారం వెనుక నిజం ఏమిటో గ్రహించారు.
– ఆయుష్ నడింపల్లి