Home News యాదాద్రి దేవస్థాన స్తంభాలపై కేసీఆర్ బొమ్మ, టీఆరెస్ చిహ్నాలు – హిందువుల తీవ్ర ఆగ్రహం

యాదాద్రి దేవస్థాన స్తంభాలపై కేసీఆర్ బొమ్మ, టీఆరెస్ చిహ్నాలు – హిందువుల తీవ్ర ఆగ్రహం

0
SHARE

తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నరసింహ క్షేత్రమైన యాదాద్రి (యాదగిరి గుట్ట) ఆలయ స్తంభాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ ఆకృతితో పాటు టీఆర్‌ఎస్ పార్టీ అధికార చిహ్నం కారు గుర్తు చెక్కడం వివాదం రేపుతోంది. దీనిపై రాష్ట్రంలోని హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని ప్రకటించిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా ఆలయ గోడలు, రాతి స్తంభాలపై తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలకు సంబంధించిన అంశాలను చెక్కుతున్నారు. అయితే.. కొన్ని శిలలపై కేసీఆర్ చిత్రం, టీఆరెస్ పార్టీ అధికార చిహ్నమైన కారు ఆకృతులను కూడా తీర్చిదిద్దారు. దీనిపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవాలయాలను పార్టీ ప్రచారానికి వాడుకోవడమేమిటని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నలు కురిపిస్తున్నారు.

పురాతన ఆలయాలపై చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలకు సంబంధించిన అంశాలతో పాటు ఆ కాలపు నిర్మాణ రీతులు, అప్పట్లో వాడిన నాణేలు, వ్యవసాయ పద్ధతులు, ఆచరించిన ధర్మాలు, వినియోగించిన సాధనాలను రాతి స్తంభాలపై చెక్కడం ఆనవాయితీ. శతాబ్దాల కాలం నాటి చారిత్రక నిర్మాణాల గోడలు, రాతి స్తంభాలపై చిహ్నాలు, బొమ్మలు ఆనాటి ప్రజల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. కానీ ఈ తరహా పార్టీ చిహ్నాలు, ప్రభుత్వ  పధకాలకు చెందిన చిహ్నాలు చెక్కడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, అనైతిక రాజకీయ విధానానికి పరాకాష్ట అని పలువురు పేర్కొంటున్నారు.

చట్ట ప్రకారం కూడా నేరమే!:
సుప్రసిద్ధ నరసింహ క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్తంభాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ ఆకృతితో పాటు టీఆర్‌ఎస్ పార్టీ అధికార చిహ్నం కారు గుర్తు చెక్కడం వివాదం రేపుతుండగా, ఇది చట్టప్రకారం కూడా శిక్షార్హంగా తెలుస్తోంది.

రాజకీయాల కారణంగా మతపరమైన సంస్థలు, కట్టడాలు దుర్వినియోగం కాకుండా 1988లో భారతదేశంలో మతపరమైన కట్టడాలు, సంస్థల దుర్వినియోగ నిరోధక చట్టం ( Religious Institutions (Prevention of Misuse) Act, 1988) అమలులోకి వచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 3(a) ప్రకారం ఏ మతపరమైన సంస్థ లేదా కట్టడం కూడా తమ పరిసరాలలో, ఏ రూపంలో కూడా రాజకీయ ప్రేరేపిత ప్రకటనలు, ప్రచారం, ప్రోత్సాహం వంటి కార్యకలాపాలకు పాల్పడకూడదు. కానీ తాజా ఘటనలో యాదాద్రి ఆలయ వర్గాలు ఈ చట్టాన్ని అతిక్రమించినట్టు తెలుస్తోంది.